మునుగోడు ఉప ఎన్నిక… చల్లబడ్డ కేసీఆర్.. జోరు పెంచిన బీజేపీ
posted on Oct 23, 2022 @ 10:45PM
మునుగోడు అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికను అన్ని పార్టీలూ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సిటింగ్ స్థానాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ ప్రకటించిన తర్వాత తొలిసారిగా ఎదుర్కొంటున్న ఎన్నికలో జెండా గులాబీ జెండా రెపరెపలాడించి, కాలర్ ఎగరేయాలనే వ్యూహంతో టీఆర్ఎస్, దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో వచ్చిన ప్రోత్సాహంతో ముచ్చటగా మూడో ఎన్నికను కూడా తన ఖాతాలో వేసుకుని కేసీఆర్ కు చెక్ పెట్టాలని భారతీయ జనతాపార్టీ తన సైన్యాన్ని ముందుకు నడిపిస్తోంది.
మునునుగోడులో మొనగాడిగా నిలబడాలనే వ్యూహంలో భాగంగా కేసీఆర్ తన పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, జిల్లా, మండల స్థాయి నేతలను ప్రచారానికి పంపారు. ఒక్కొక్కరికి ఒక్కో ప్రాంతం బాధ్యతలు అప్పగించారు. చివరికి గ్రామస్థాయిలో కూడా బాధ్యులను నియమించారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్లు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ తాను కూడా ఓ గ్రామం బాధ్యతలు తీసుకోవడం విశేషం. ఢిల్లీ టూర్ కు వెళ్లక ముందు మునుగోడు ఉప ఎన్నిక విషయంలో గులాబీ బాస్ చేసిన హడావుడి చూసిన జనం ఇంకేముంది.. అక్కడ కారు పార్టీ జోరుమీదే ఉంది. గెలుపు తథ్యం అని భావించారు.
అయితే.. ఇప్పటిదాకా ఒక లెక్క ఇక నుంచి మరో లెక్క అన్నట్లు.. కేసీఆర్ ఇటీవల ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత ఎందుకో కేసీఆర్ లో ముందటి స్పీడు ఉన్నట్లు కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఢిల్లీలో కమలం పార్టీ పెద్దల నుంచి ఆయనకు ఎలాంటి ఇరకాటమో, ఇబ్బందో ఎదురై ఉంటుందని అందుకే ఆయన చల్లబడినట్లు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే మునుగోడు ఉప ఎన్నిక కన్నా ఆపరేషన్ గులాబీ ఆకర్ష్ మీదే బాగా దృష్టి పెట్టినట్లు కనిపిస్తోందంటున్నారు. అది కూడా మునుగోడు ఉప ఎన్నికకు ఏమాత్రం సంబంధం లేని దాసోజు శ్రవణ్, స్వామి గౌడ్ లకు స్వయంగా ఫోన్ చేసి మరీ ఆపరేషన్ చేశారంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. కేసీఆర్ పిలిచిందే ఆలస్యం అన్నట్లు వారిద్దరూ శుక్రవారం రాత్రికి ప్రగతి భవన్ మెట్లెక్కారు. టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువాలు కప్పుకుని వీడియోలు, ఫొటోలకు ఫోజులిచ్చారు. వారిద్దరూ గతంలో టీఆర్ఎస్ గుడ్ బై చెప్పేసి ఇతర పార్టీల్లో చేరిన వారే. ఇప్పుడు బీజేపీ లో ఉన్న వారిని టీఆర్ఎస్ లోకి లాక్కోవడం గమనార్హం.
మునుగోడు ఉప ఎన్నికను అంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేసీఆర్ ఢిల్లీ వెళ్లి, పది రోజులు ఉండడం ఒక ఎత్తయితే.. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాతైనా వెంటనే మునుగోడులో టీఆర్ఎస్ ప్రచారంపై సమీక్షించాలి. పార్టీ నేతలు, శ్రేణులందర్నీ పరుగులు పెట్టించాలి. కానీ అలాంటిదేమీ లేకుండా ఆ ఎన్నికకు సంబంధం లేని, బీజేపీకి ఏమాత్రం నష్టం కలిగే అవకాశం లేని నేతలకు ఆపరేషన్ ఆకర్ష్ చేయడమేంటనే ప్రశ్నలు వస్తున్నాయి. ఢిల్లీ టూర్ కు ముందు కేసీఆర్ లో కనిపించిన గెలుపు ధీమా ఇప్పుడు ఆయనలో కనిపించడం లేదంటున్నారు. ఇవన్నీ చూస్తుంటే.. మునుగోడు ఉప ఎన్నిక విషయంలో ఆయన చేతులెత్తాశారా? అనే అనుమానాలు టీఆర్ఎస్ వర్గాల్లో సైతం వస్తున్నాయంటున్నారు. అంటే మునుగోడులో ఎన్నికల ఫలితంపై కేసీఆర్ కు ముందే స్పష్టత వచ్చినట్లుందని, అందుకే ఇప్పుడు ఈ అంశాన్ని ఆయన లైట్ తీసుకుంటున్నారా? అనే సందేహాలు వస్తున్నాయి. లేదా ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత కేసీఆర్ లో ముందు ఉన్నంత పట్టుదల, పంతం ఇప్పుడు తగ్గడానికి మరేదైనా సొంత వ్యవహారంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందనే భయం ఆయనకు పట్టుకుందా? అంటున్నారు. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న తన కుమార్తె కవిత విషయంలో ఇరకాటం కేంద్రం నుంచి ఎదురయ్యే ప్రమాదం ఉందని ఆయన వెనక్కి తగ్గారా? అనే సందేహాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి.
కాగా.. బీజేపీ విషయానికి వస్తే.. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంపై పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించాలని ఆ పార్టీ కేంద్ర నాయకత్వం నుంచి రాష్ట్రస్థాయి నేతలకు చాలా స్పష్టమైన ఆదేశాలు వచ్చాయంటున్నారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచార సమయం ముగిసే దాకా అక్కడే ఉండాలని, రాత్రిళ్లు కూడా నియోజకవర్గంలోనే ఉండాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. బీజేపీకి రాజీనామా చేసి స్వామి గౌడ్, దాసోజు శ్రవణ్ టీఆర్ఎస్ లో చేరడంతో ఢిల్లీ పెద్దలు వ్యూహం మార్చినట్లు కనిపిస్తోందంటున్నారు. మునుగోడు ఉప ఎన్నికను బీజేపీ పెద్దలు సీరియస్ గానే తీసుకున్నారంటున్నారు. నవంబర్ మూడో తేదీన మునుగోడులో పోలింగ్ జరుగుతుంది. నవంబర్ ఒకటో తేదీ సాయంత్రంతో ప్రచారం ముగుస్తుంది. ప్రచారం గడువు ముగిసేదాకా ఎన్నికల ప్రచారంపై మాత్రమే దృష్టిపెట్టాలని రాష్ట్ర స్థాయి నేతలకు కేంద్ర నాయకత్వం ఆదేశించింది. నవంబర్ ఒకటో తేదీ వరకు ఏ ఒక్కరూ హైదరాబాద్ రావద్దని, రాత్రిళ్లు మునుగోడులోనే బసచేయాలంటూ కచ్చితమైన అల్టిమేటం ఇచ్చిందంటున్నారు. బీజేపీలోని కీలక నేతలతో పాటు స్థానిక నాయకులు కూడా ప్రచారానికి పూర్తి సమయం కేటాయించాలని చెప్పింది. హైదరాబాద్ లో ఉన్న పార్టీ నేతలంతా వెంటనే మునుగోడు వెళ్లాలని బీజేపీ అగ్రనాయకత్వం ఆదేశించింది.
దీంతో పాటు పోల్ మేనేజ్ మెంట్ పైన కూడా బీజేపీ నేతలు కొత్త ప్రణాళికలు రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీలు కోవర్టులు ఎవరు.. పార్టీకే కట్టుబడి కృషిచేసేవారెవరనే దానిపై బీజేపీలో కాస్త అయోమయం నెలకొందని, అందుకే వ్యూహం మార్చి ముందుకెళ్లాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. తెలంగాణలో మరీ ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో బీజేపీ బలం పుంజుకోవాలనే వ్యూహంలో భాగంగా కోమటిరెట్టి రాజగోపాల్ రెడ్డి చేత ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి బీజేపీ అధిష్టానం రాజీనామా చేయించినట్లు చెబుతారు. అందుకే ఇప్పుడు మునుగోడులో రాజగోపాల్ రెడ్డి గెలుపు బాధ్యతను కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అందుకే మునుగోడు ఉప ఎన్నికకు మరింత ప్రాధాన్యత వచ్చిందంటున్నారు.