ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చిన ఘనుడు కేసీఆర్.. కిషన్ రెడ్డి
posted on Oct 28, 2022 @ 9:32AM
ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల వ్యవహారంపై టీఆర్ఎస్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిప్పులు చెరిగారు. మునుగోడు ఓటమి కళ్లెదుట కనిపిస్తుండటంతో దిక్కుతోచక కేసీఆర్ కొత్త నాటకానికి తెరతీశారని ఆరోపించారు. మీడియాతో మాట్లాడిన ఆయన అవినీతి, అక్రమాలకు పాల్పడితే శిక్షనుంచి తప్పించుకోవడం సాధ్యం కాదన్న విషయం కేసీఆర్ కు ఆయన కుటుంబానికి అర్ధమైందని అన్నారు.
ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాలంటూ అల్లిన కథలో దొరికిన డబ్బు కేసీఆర్ ఫాం హౌస్ నుంచి వచ్చిందా? ప్రగతి భవన్ నుంచి వచ్చిందా ముందు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో అరెస్టు చేసిన నందకుమార్ తనకు సన్నిహితుండంటూ చేస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. కేంద్ర మంత్రిగా తాను పలు కార్యక్రమాలలో పాల్గొంటాననీ, ఆయా సందర్భాలలో ఎవరెవరో తనతో ఫొటోలు దిగుతుంటారని అన్న కిషన్ రెడ్డి.. నందకుమార్ తనతోనే కాదు.. జోగినపల్లి సంతోష్, హరీష్ రావులతో సహా పలువురితో నందకుమార్ ఫోలోటు ఉన్నాయనీ.. వారందరికీ కూడా నందకుమార్
సన్నిహితుడేనా అని ప్రశ్నించారు.
ఇక ఫిరాయింపులను ప్రోత్సహించడంలో కేసీఆర్ ను మించిన ఘనుడు లేడని కిషన్ రెడ్డి అన్నారు. స్వయంగా కేసీఆర్ కుమారుడు, టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడే టీఆర్ఎస్ లో చేరాల్సిందిగా ఇతర పార్టీల నాయకులను ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆరోపించారు. అన్నిటికీ మించి ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చిన ఘనుడు కేసీఆర్ ఆని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తాను ఏ పార్టీ టికెట్ పై గెలిచి ఏ పార్టీ ప్రభుత్వంలో మంత్రి అయ్యారో ఇంద్రకిరణ్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు వంద కోట్లు ఇచ్చి కొనాల్సిన అవసరం బీజేపీకి లేదన్నారు. అయినా అన్నేసి కోట్లు పోయడానికి బీజేపీకి స్తోమత లేదన్న కిషన్ రెడ్డి.. తమ పార్టీ సొంత విమానాలు కొనేంత ధనిక పార్టీ కాదన్నారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ వ్యవహారంలో పోలీసుల తీరు కూడా దారుణంగా ఉందన్నారు. గతంలో దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో తమ పార్టీ అభ్యర్థి రఘునందనరావు నివాసంలో పోలీసులే డబ్బు పెట్టిన సంగతి ఈ సందర్భంగా కిషన్ రెడ్డి గుర్తు చేశారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ గెలవబోతోందనీ, నవంబర్ 6న కేసీఆర్ కు దిమ్మ తిరగడం తథ్యమని అన్నారు.