గిరిజనులను పార్టీకి దూరం చేసిన కేసీఆర్ నిర్ణయం!?
posted on Jul 25, 2022 @ 12:30PM
తెలంగాణలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి పార్టీ పరంగా గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఈ దెబ్బ పార్టీపై తీవ్ర ప్రభావం చూపేట్టుగా కనిపిస్తుందనేది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. తమ వర్గానికి చెందిన నేతకు ఒక్క ఓటు కూడా టిఆర్ఎస్ వేయలేదంటూ పార్టీ తరపున ఇంత వరకూ కీలక బాధ్యతలను నిర్వర్తించిన నేత టీఆర్ఎస్ కు రాజీనామా చేయడం ఇదే తొలిసారి. ఢిల్లీలో టీఆర్ఎస్ మాజీ ప్రత్యేక ప్రతినిధి, ఐఏఎస్ మాజీ అధికారి రామచంద్రు తేజావత్ పార్టీకి రాజీనామా చేశారు. గిరిజన మహిళకు దేశ చరిత్రలోనే తొలి సారిగా రాష్ట్రపతి అవకాశం వస్తే.. తెరాస మాత్రం ఆమె అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించాలని నిర్ణయం తీసుకోవడాన్ని జీర్ణించుకోలేకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు రామచంద్రు తేజావత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన రాజీనామా, అందుకు ఆయన చెప్పిన కారణం రెండూ కూడా తెలంగాణలో హాట్ టాపిక్ అయ్యాయి. తమ వర్గానికి చెందిన నేత రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో నిలబడితే టిఆర్ఎస్ ఆమెకు మద్దతునివ్వకపోవడంపై నిరసన వ్యక్తం చేస్తూ గిరిజన వర్గానికి చెందిన నాయకుడు, మేధావి, ఐఎఎస్ మాజీ అధికారి పార్టీకి రాజీనామా చేయడం పార్టీకి గట్టి ఎదురు దెబ్బేనని అంటున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ తరపున బరిలో నిలిచిన అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వకూడదని టీఆర్ఎస్ నిర్ణయం తీసుకోవడం తనకు చాలా బాధ కలిగించిందని, అందుకే పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని విస్పష్టంగా వెల్లడించిన రామచంద్రు తేజావత్ వెల్లడించారు..తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని పార్టీ అధినేతకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇది టిఆర్ఎస్ పార్టీపై తీవ్ర ప్రభావం చూపడం ఖాయమనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
నాయకుల మధ్య అభిప్రాయభేదాలు, అసంతృప్తి, పార్టీలో గుర్తింపునివ్వడం లేదనీ, టిక్కెట్టు రాలేదనీ రాజీనామా చేయడం లేదా వేరే పార్టీలోకి జంప్ కావడం సాధారణంగా రాజీనామాలకు కారణంగా కనిపిస్తూ ఉన్నాయి. కానీ, తమ వర్గాని(గిరిజన)కి చెందిన నేతకు మద్దతు పలకలేదనీ, ఓటు వేయలేదంటూ ముఖ్య బాధ్యతలను నిర్వర్తించిన ఓ ఐఏఎస్ మాజీ అధికారి ప్రకటించడం, పార్టీకి రాజీనామా చేయడం.కచ్చితంగా టీఆర్ఎస్ పై వ్యతిరేక ప్రభావం పడుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా గిరిపుత్రులను టీఆర్ఎస్ నిర్ణయం తీవ్రంగా ప్రభావితం చేయడం ఖాయమని అంటున్నారు.
ఇక ఇప్పుడు అవకాశం దక్కకపోతే ఆదివాసి రాష్ట్రపతి అవడం కలగానే మిగిలేదని ఆయన అన్నారు. దేశ రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ము ను తాను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశానని రామచంద్రు తేజావత్ తెలిపారు. ముర్మును రాష్ట్రపతి అభ్యర్థి గా నిలిపిన ప్రధాని మోడి కి ధన్యవాదాలు తెలిపారు. ఈ విధంగా తమ వర్గానికి టిఆర్ఎస్ గుర్తింపునివ్వకపోవడంతో ఓ కీలక నేత రాజీనామా చేయడంపై సొంత పార్టీని కూడా కాస్తంత విస్మయానికి లోనుచేసినట్టు పార్టీవ ర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ రాజీనామా.. ఇతర వర్గాలకు చెందిన నేతల్లోనూ ఓ ఆలోచనకు ప్రేరణగా నిలుస్తుందని పలువురు పేర్కొంటున్నారు.
తెలంగాణలో 119 నియోజకవర్గాలు ఉండగా అందులో 9 ఎస్టీ రిజర్వ్‌డ్ స్థానాలున్నాయి. తెలంగాణలో 9.8 శాతం ఎస్టీ జనాభా ఉంది. అయితే, తెలంగాణ మంత్రి వర్గంలో కేవలం ఒక్క మంత్రి పదవిని కేటాయించడం జరుగుతూ వస్తుంది. 2014లో జరిగిన ఎన్నికల అనంతరం జరిగిన మంత్రివర్గంలో ఆజ్మీరా చందులాల్, 2018లో జరిగిన ఎన్నికల అనంతరం సత్యవతి రాథోడ్ మంత్రి వర్గంలో ఉన్నారు. కానీ, ఓసిలకు (రెడ్డి సామాజిక వర్గానికి 6 వెలమలకు నాలుగు) మొత్తం 10 మంత్రి పదవులు, బిసిలకు 4 మంత్రి పదవులు, ఓ ఎస్సీకి, ఓ మైనార్టీకి మంత్రి పదవులు లభించాయి. ఇదిలా ఉండగా రాష్ట్రంలో 9.8శాతం ఉన్న గిరిజన జనాభ ఇప్పుడు టిఆర్ఎస్ కు కాస్తంత దూరం కావడం ఖాయమని పరిశీలకలు భావిస్తున్నారు.
ముందస్తు ప్రచారం జోరుగా ఉన్న సమయంలో ఓ కీలక నేత పార్టీకి రాజీనామా చేయడం ఇటు పార్టీ వర్గాల్లోనూ, అటు గిరిజనుల్లోనూ, ప్రజల్లోనూ చర్చకు దారితీసింది. ఈ పరిణామం రానున్న ఎన్నికల్లో టిఆర్ఎస్ కు గిరిజన ఓట్లు చాలా వరకు తగ్గే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా , కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థికి కాంగ్రెస్ తో ప్రభత్వాన్ని పంచుకుంటున్న జార్ఖండ్ రాష్ట్రంలో అధికార పార్టీ జెఎంఎం, మహారాష్ట్రంలోనూ కాంగ్రెస్ తో స్నేహపూర్వకంగానే ఉన్న శివసేన కేడా బిజెపి బలపరిచ అభ్యర్థికే మద్దతు అంటూ ప్రకటించింది. కానీ, టిఆర్ఎస్ మాత్రం మద్దతునివ్వకపోవడంపై రాష్ట్రంలో గిరిజనులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.