కేసుల భయమా.. కొడుకు కోసమా? కమలంతో కేసీఆర్ కథేంటో ?
posted on Dec 28, 2020 @ 9:54AM
రాజకీయ వ్యూహాలు రచించడంలో దిట్టగా పేరున్న తెలంగాణ ముఖ్యమంత్రి , టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. మాట మార్చడంలోనూ అందరి కంటే టాప్ లోనే ఉంటారనే ఆరోపణలు ఉన్నాయి. కేసీఆర్ ఎప్పుడు ఏం మాట్లాడుతారో, ఏ స్టాండ్ తీసుకుంటారో ఎవరికి అర్ధం కాదు. రాజకీయ నిర్ణయాలే కాదు పాలనా పరమైన అంశాల్లోనూ ఆయన అంతే. ఉద్యమ సమయంలోనూ, తెలంగాణ ముఖ్యమంత్రిగానూ కేసీఆర్ ఎన్నో సార్లు యూటర్న్ తీసుకున్నారు. పొగిడిన వారినే పరుష పదజాలంతో తిట్టడం... వ్యతిరేకించిన వారినే అందలం ఎక్కించడం ఆయనకు పరిపాటి. తాజాగా కేసీఆర్ మరోసారి బిగ్ టర్న్ తీసుకున్నారు. కేంద్రంతో యుద్దం చేస్తానన్న గులాబీ బాస్.. కొన్ని రోజుల్లోనే వారితో రాజీకి వచ్చినట్లు కనిపిస్తోంది. కేసీఆర్ తాజా నిర్ణయాల పై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. కేంద్రం పెద్దలతో కేసీఆర్ సఖ్యత వెనక బలమైన కారణాలే ఉన్నాయంటున్నారు.
2014లో అధికారం చేపట్టినప్పటి నుంచి బీజేపీతో మంచిగానే ఉన్నారు కేసీఆర్. అయితే గత లోక్ సభ ఎన్నికల ముందు విభేదించినట్లు మాట్లాడారు. ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదన తెచ్చారు. లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత సైలెంట్ అయ్యారు. తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల తర్వాత మరోసారి జాతీయ రాజకీయాలపై మాట్లాడారు. ఎందుకో మళ్లీ మౌనం దాల్చారు. గత పార్లమెంట్ సమావేశాల సందర్బంగా కేంద్రానికి వ్యతిరేకంగా వ్యవహరించారు. కేంద్రం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ బిల్లులను టీఆర్ఎస్ ఎంపీలు వ్యతిరేకించారు. కేంద్ర బిల్లులపై ఘాటైన విమర్శలు చేశారు కేసీఆర్. అనైతిక బిల్లులంటూ విరుచుకుపడ్డారు. రైతుల కోసమే అవరసమైతే కేంద్రంతో యుద్ధం చేస్తామని ప్రకటించారు. ఇటీవల గ్రేటర్ ఎన్నికలకు ముందు కూడా కేంద్రం తీరును ఎండగట్టారు గులాబీ బాస్. సడెన్ గా ఢిల్లీకి వెళ్లన కేసీఆర్ .. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. తర్వాత కేంద్రంపై తన స్టాండ్ మార్చుకున్నారు కేసీఆర్. కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాలకు మద్దతు పలికారు. ఇకపైన గ్రామాలలో కొనుగోలు కేంద్రాలు ఉండవని ప్రకటించారు.
తెలంగాణ రైతు తన పంటను తీసుకెళ్లి గుజరాత్ మార్కెట్ లో అమ్ముతాడా అంటూ కేంద్రాన్ని నిలదీసిన కేసీఆర్.. ఇప్పుడు పంటకు ఎక్కడ ఎక్కువ ధర వస్తే అక్కడే అమ్ముకోవచ్చని రైతులకు సూచించారు. వానాకాలం సీజన్‌లో అమలు చేసిన నియంత్రిత సాగు విధానానికి స్వస్తి చెప్పి.. యాసంగి నుంచి ఇష్టమైన పంట వేసుకోవచ్చన్నారు. కేసీఆర్ తాజా యూటర్న్ కు తన ఢిల్లీ పర్యటనే కారణమంటున్నారు. కేంద్రం బెదిరించడం వల్లే కేసీఆర్ రాజీ కొచ్చారని చెబుతున్నారు. గత ఆరేండ్లుగా తెలంగాణలో జరిగిన అవినీతి, కాళేశ్వరం ప్రాజెక్టు నిధుల్లో అక్రమాలపై కేంద్ర నిఘా సంస్థల దగ్గర పూర్తి వివరాలు ఉన్నాయని తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనలో ఆ జాబితాను కేంద్ర పెద్దలు కేసీఆర్ కు చూపించి ప్రశ్నించారని తెలుస్తోంది. సీబీఐ విచారణ జరిపితే తన అవినీతి బాగోతం బయటపడుతుందనే భయంతోనే కేసీఆర్ బీజేపీతో రాజీ పడ్డారని, అందుకే కేంద్ర చట్టాలకు మద్దతు తెలిపారనే చర్చ జరుగుతోంది. గతంలో కేసీఆర్ కేంద్ర కార్మికశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈఎస్ఐం స్కాం జరిగిందనే ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. ఈ కేసును కూడా బయటికి తీస్తామని కేంద్ర బెదిరించిందని, అందుకే కేసీఆర్ కిమ్మనకుండా వాళ్లు చెప్పినదానికే ఓకే చెప్పారనే ప్రచారం కూడా జరుగుతోంది.
కేంద్రంతో కేసీఆర్ రాజీకి మరో కారణం ఉందని కూడా బలంగా వినిపిస్తోంది. రెండు, మూడు నెలల్లో కేటీఆర్ ను తెలంగాణ ముఖ్యమంత్రిగా నియమించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపైనే కేంద్ర పెద్దలతో ఆయన మాట్లాడారని చెబుతున్నారు. తన కొడుకును సీఎంగా నియమిస్తున్నానని, అందుకు సహకరించాలని కేసీఆర్ కోరినట్లు తెలుస్తోంది. కేటీఆర్ కు సహకరిస్తే.. కేంద్రానికి తమ ఎంపీలు మద్దతుగా ఉంటారని ఆయన రాజీకి వచ్చారని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీకి ఎంపీలు అవసరమైనా తాము మద్దతు ఇస్తామని చెప్పినట్లు చెబుతున్నారు. అంతేకాదు వన్నేషన్ వన్ ఎలక్షన్ కు సపోర్ట్ చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ను పూర్తిగా నిర్వీర్యం చేయడానికి ఇద్దరం కలిసి పనిచేయాలనే ఆలోచనకు రెండు పార్టీలు వచ్చాయని కూడా చర్చ జరుగుతోంది. అందుకే కేసీఆర్ ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత రెండు పార్టీల నేతల మధ్య గతంలోగా ఆరోపణలు చేసుకోవడం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి కేసుల భయంతో పాటు కేటీఆర్ కోసం కేంద్రం పెద్దలతో తెలంగాణ ముఖ్యమంత్రి రాజీ పడ్డారన్నది మాత్రం తాజా నిర్ణయాలతో ఖాయమైందని రాజకీయ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.