మరక పడితే మార్పు తప్పదు
posted on Apr 28, 2023 7:06AM
తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కే.చంద్రశేఖర రావు, క్లారిటీ ఇచ్చారు. ముందస్తు ఎన్నికల ముచ్చట లేదని తేల్చేశారు. ఒక్క ముందస్తు ఎన్నికల విషయంలోనే కాదు, పార్టీ టికెట్ల విషయంలోనూ కేసీఆర్ పూర్తి క్లారిటీ ఇచ్చారు. గతంలో సిట్టింగులు అందరికీ టికెట్లు ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్, ఇప్పడు వడపోత తప్పదని స్పష్టం చేశారు. ప్రజల్లో ఉండి బాగా పని చేసే వారికే వచ్చే ఎన్నికల్లో టికెట్లు యిస్తామని కేసీఆర్ తేల్చి చెప్పారు. తెలంగాణ భవన్‌లో జరిగిన పార్టీ ప్రతినిధుల సభలో మాట్లాడిన ఆయన.. జాగ్రత్తగా లేకుంటే మీకే ఇబ్బంది అని ఎమ్మెల్యేలను హెచ్చరించారు. ఒక విధంగా, క్షేత్ర స్థాయిలో పరిస్థితి అనుకున్నంత ఆశాజనకంగా లేదని ముఖ్యమంత్రి పరోక్షంగానే అయినా అంగీకరించారు.
బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తెలంగాణ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా 2001 ఏప్రిల్ 27న టీఆర్ఆస్ ఆవిర్భవించగా..టీఆర్ఎస్... బీఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి)గా మారిన తర్వాత జరగుతున్న తొలి వేడుకలు ఇవి. ఈ సందర్భంగా పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం సీఎం కేసీఆర్ అధ్యక్షతన పార్టీ సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు సహా మెుత్తం 279 మంది హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్.. షెడ్యూల్ ప్రకారమే రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయని తేల్చి చెప్పారు. ప్రజల్లో ఉండి బాగా పని చేసిన వారికే టికెట్లు కేటాయిస్తామని స్ఫష్టం చేశారు. అదే సమయంలో గోడ మీది పిల్లి వాటంగా ఉన్న పలువురు ఎమ్మెల్యేలకు కేసీఆర్ క్లాస్ తీసుకుంటున్నట్లు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నా.. నేతలంతా హైదరాబాదులోనే ఉండడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. దాహం వేసినప్పుడు బావి తవ్వే రోజులు పోయాయని ముందు నుంచి జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఎమ్మెల్యేలంతా ప్రజా క్షేత్రంలోకి వెళ్లాలని.. ప్రజల్లో ఆదరణ ఉన్న వారికే రాబోయే ఎన్నికల్లో అవకాశం కల్పిస్తామని కేసీఆర్ తేల్చిచెప్పారు.
అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ లో ఒక్క సారిగా ఈ మార్పు ఎందుకొచ్చింది? గతంలో సిట్టింగులు అందరికీ టికెట్లు ఇస్తామని భరోసా ఇచ్చిన ముఖ్యమంత్రి ఇప్పుడు పనితనం ఆధారంగానే టికెట్లు ఇస్తామని కొత్త బాణీ ఎందుకు ఎత్తుకున్నారు? అంటే, క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అంత అనుకూలంగా లేవని కొంత ఆలస్యంగానే అయినా ముఖ్యమంత్రి గుర్తించారని, అందుకే టికెట్ వస్తే గెలిచినట్లే అనే ధీమాతో నియోజక వర్గాలకు వెళ్ళకుండా హైదరాబాద్ కే పమితం అవుతున్న ఎమ్మెల్యేలను అదిలించేందుకే ముఖ్యమంత్రి కేసేఆర్ ఈ హెచ్చరిక చేశారని బీఆర్ఎస్ నేతలు చెపుతున్నారు.
అయితే అది కొంతవరకే నిజమని టీఆర్ఎస్ టికెట్ పై గెలిచిన ఒరిజినల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో సగం మందికి పైగా ఎమ్మెల్యేల పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, అలాగే, కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలలో ఒకరిద్దరు మినహా మిగిలిన ఎమ్మెల్యే పరిస్థితి మరింత దారుణంగా ఉందని, అందుకే ముఖ్యమంత్రి ముందస్తు హెచ్చరిక చేశారని సీనియర్ నేతలు చెప్పుకొస్తున్నారు.ముఖ్యంగా 42 మంది ఎమ్మెల్యేల పట్ల ప్రజా వ్యతిరేకత చాలా చాలా తీవ్రంగా ఉందని, సర్వేలలో తేలిన నేపధ్యంలోనే ముఖ్యమంత్రి హెచ్చరిక చేశారని అంటున్నారు. అయితే ఈ 42 మంది ఎమ్మెల్యేలు ఎవరనేది, తెలియలేదు. అయితే, ఈ 42 మందిని హెచ్చరించడం వెనక ఇతరేతర కారణాలు కూడా ఉన్నాయని, అంటున్నారు.