కావురికి ఇంట్లో ఈగల మోత
posted on Dec 25, 2013 @ 11:02AM
నేతి బీరకాయలో నెయ్యి ఉండనట్లే సీమంధ్ర కేంద్ర మంత్రులలో సమైఖ్యాలోచన కూడా ఉండదని సీమంధ్ర ప్రజలు గ్రహించలేకపోయారు కానీ, తెలంగాణా నేతలు, ప్రజలు మాత్రం ఆ విషయం బాగానే గ్రహించారని ఒప్పుకోక తప్పదు. కేంద్ర మంత్రి కావూరివారు మొన్నఉభయగోదావరి జిల్లాలో పర్యటించినప్పుడు అక్కడి ప్రజలు ఆయనకి కోడిగుడ్లతో సత్కారం చేస్తే, నిన్నఆయన కరీంనగర్ జిల్లా సిరిసిల్లాలో పర్యటించినప్పుడు మాత్రం తెలంగాణా వాదుల నుండి ఆయనకు ఎటువంటి ప్రతిఘటనా ఎదురవలేదు. ఆయన తెలంగాణాకి వ్యతిరేఖంగా ఎన్నిమాటలు మాట్లాడినా, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలాగే ఆయన కూడా ఎన్నడూ అడ్డుపడలేదు. తన పదవిని కాపాడుకొనేందుకు పాపం ఆయన పడుతున్న తిప్పలను తెలంగాణా వాదులు సానుభూతితో అర్ధం చేసుకొన్నారు గనుకనే కేంద్రమంత్రిగా సిరిసిల్లా చేనేతన్నలకు వరాలు కురిపించడానికి వస్తున్న ఆయనకు స్వాగతం పలికారు. కానీ సార్వత్రిక ఎన్నికలు వస్తునందున ఆయన మంత్రిగిరీ మహా అయితే మరో రెండు మూడు నెలలుకు మించి ఉండబోదని తెలిసినప్పటికీ ఆయన తను శాశ్వితంగా అధికారంలో ఉండబోతున్నట్లు అనేక వాగ్దానాలు గుప్పించడమే విశేషం.