కవిత.. ఏంటి కథ?
posted on Sep 3, 2025 9:28AM
తన తండ్రి .. తాను ఆరాధ్య దైవంగా భావించే కేసీఆర్ కు ప్రియమైన కూతురుగా రాసిన లేఖ బయట పడడంతో మొదలైంది కవిత భవిత మార్చే కథ. బీఆర్ఎస్ ఆవిర్భావ పార్టీపై ఆమె తనదైన శైలిలో ఒక రివ్యూ రాశారు. ప్రస్తుతం ఉన్న కంప్యూటర్ టైపింగ్ జామానాలోలా కాకుండా.. పాత పద్ధతిలో చేతిరాతతో కాగితాల మీద రాశారు. అదెలా బయట పడిందో తెలీదు. కానీ, ఎలాగోలా మీడియాకెక్కింది. ఆ టైంలో ఆమె యూఎస్ లో ఉన్నారు.
కవిత శంషాబాద్ ఎయిర్ పోర్టులో అడుగు పెట్టడంతోనే ఆమె జాగృతి అభిమాన గణమంతా వచ్చారు. అప్పటి నుంచి బీఆర్ఎస్ శ్రేణులు కవితకు దూరంగా ఉంటూ రావడం మొదలైంది. ఆ తర్వాత చాలానే ఎపిసోడ్లు నడిచాయ్. తన తండ్రిని దేవుడంటూనే ఆయన చుట్టుపక్కల ఉండేవాళ్లంతా దెయ్యాలంటూ కామెంట్ చేశారు. ఆ కామెంట్లు నేరుగా కేటీఆర్ కి తగిలినట్టుగా భావించారంతా. ఆ తర్వాత జాగృతి తట్టాబుట్టా కిందకు దించారామె. ఆపై కార్యాలయం మార్చారు.
తర్వాత కేసీఆర్ ని టచ్ చేస్తే.. ఎంత మాత్రం సహించేది లేదన్న హెచ్చరికలు జారీ చేశారు. ఇక బీఆర్ఎస్ వాయిస్ కి వ్యతిరేకంగా బీసీ బిల్లుకు సపోర్ట్ చేశారు. అటు పిమ్మట తీన్మార్ మల్లన్నతో గొడవ. ఆపై రాఖీ సందర్భంగా తన అన్న కేటీఆర్ మొహం చాటేయ్యడం.. అంతకన్నా ముందు కవితను ఒక పద్ధతి ప్రకారం సింగరేణి కార్మిక సంఘం గౌరవాధ్యక్షురాలిగా తప్పించడం. ఆమె కూడా పెద్దగా రియాక్ట్ కాక పోవడం. అప్పటి వరకూ కవితతో ఉన్న కార్మిక వర్గంలోని కొందరు బయటకు రావడంతో ఒక పక్క తన స్థానంలో నియమితులైన కొప్పుల ఈశ్వర్ కి శుభాకాంక్షలు చెబుతూనే, ఆయన ఎన్నిక కార్మిక చట్టాల ప్రకారం తప్పని ఓపెన్ లెటర్ రాయడం. అదే లేఖలో తాను ఇప్పటి వరకూ సింగరేణి కార్మికుల కోసం చేసిన పనులన్నీ ఏకరవు పెట్టడం వంటి ఎపిసోడ్లు చకచకా జరిగిపోయాయ్.
ఇప్పుడు చూస్తే హరీష్, సంతోష్ టార్గెట్ గా వ్యాఖ్యలు. వీరి అవినీతి వల్ల.. ఈ వయసులో కేసీఆర్.. ఆయన కాలి గోటికి కూడా సరిపోని రేవంత్ చేత తిట్లు తినడం ఏంటని నిలదీశారామె. అంతేనా.. ఎలాంటి నిబంధనలు పాటించని పార్టీ ఉంటే ఎంత లేకుంటే ఎంత? అంటూ ఏకంగా తన తండ్రి పెట్టిన పార్టీ ఉనికినే ప్రశ్నార్ధకంలో పడేశారు కవిత.
మాములుగా అప్పటి వరకూ ఉన్న సీనేంటంటే.. ఒక పక్క సీఎం రేవంత్, ఆపై మంత్రులు ఉత్తమ్, వెంకట్ రెడ్డి, పొంగులేటి, జూపల్లి వంటి వారిని అసెంబ్లీలో ఒంటరిగా ఎదుర్కున్న వీరుడు హరీష్ ని చూసి బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున గర్విస్తున్న వేళ.. కవిత నుంచి ఇలాంటి సంచలన వ్యాఖ్యానం రావడంతో తీవ్రమైన కుదుపులకు లోనైంది బీఆర్ఎస్.
ఇటు చూస్తే కాళేశ్వరం వ్యవహారంలో తాము వేసిన మధ్యంతర పిటిషన్ కి హైకోర్టు నుంచి సానుకూల స్పందన. అక్టోబర్ ఏడు వరకూ కేసీఆర్, హరీష్ పై ఎలాంటి చర్యలు తీసుకోరాదంటూ కోర్టు ఉత్తర్వులు ఇవ్వడంతో కాస్తైనా ఊరట లభించిందని అందరూ భావిస్తున్న సమయాన.. సడెన్ గా కవిత ఎపిసోడ్ మరోమారు హైలెట్ అయ్యింది. ఫైనల్లీ..అందరూ ఊహించినట్టుగానే కవితపై సస్పెన్షన్ వేటు. పార్టీ నుంచి బహిష్కరిస్తూ అధికారిక ఉత్తర్వులు.
ఇక్కడ విచిత్రమేంటంటే.. ఎక్కడా కూడా ఎవ్వరూ ఎలాంటి వైల్డ్ రియాక్షన్ లేనట్టుగా బిహేవ్ చేయడం. అంతాముందే రాసి పెట్టుకున్న ప్రీప్లాన్డ్ స్క్రీన్ ప్లే లాగా జరిగిపోతూ వచ్చిందని అంటారు చాలా మంది. మధ్యలో కవిత తన కుమారుడితో సహా కేసీఆర్ ఉండే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి వెళ్లారు. కేవలం కవిత కొడుకును తప్ప ఆమెను అలౌ చేయలేదు కేసీఆర్.
ప్రస్తుతం ఫైనల్ గా ఏం జరగనుందంటే.. తన తెలంగాణ జాగృతినే ఆమె పార్టీ కింద మలిచేలా కనిపిస్తోంది. కారణం తన తండ్రి పార్టీ పేరులో వదిలేసిన.. తెలంగాణ శబ్ధం గల ఏకైక సంస్థ ఇదే కాబట్టి.. ఆమె తిరిగి తెలంగాణ అనే పదాన్ని ఆశ్రయించి.. తద్వారా తన సొంత బాటలో రాజకీయ ప్రయాణం మొదలు పెట్టాలని చూస్తున్నారు.
ఇక కవిత ప్రొఫైల్ ఏంటని ఒక సారి చూస్తే.. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శోభ దంపతులకు మార్చి 13, 1978 న జన్మించారు. కవిత విద్య విషయానికి వస్తే.. స్టాన్లీ బాలికల పాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసం, తర్వాత VNR విజ్ఞాన జ్యోతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌లో బీటెక్ పూర్తి చేశారు. 2001లో అమెరికాలోని అమెరికన్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందారు. ఆపై అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసిన కవిత, 2004లో తెలంగాణ ప్రజల కోసం పని చేయాలనే ఉద్దేశంతో భారత్‌కు రిటన్ బ్యాక్ అయ్యారు.
2003లో దేవనపల్లి అనిల్ కుమార్‌ను వివాహం చేసుకున్నారు. అనిల్ మెకానికల్ ఇంజనీర్. కవిత- అనిల్ దంపతులకు ఆదిత్య, ఆర్య అనే ఇద్దరు కుమారులు. కవిత 2006లో తెలంగాణ ఉద్యమం ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో మహిళలు, యువత వంటి వర్గాల మద్దతును సమీకరించడంలో కీలక పాత్ర పోషించారు. 2004లో తెలంగాణ జాగృతి అనే సంస్థను స్థాపించారు కవిత. గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు, బతుకమ్మ పండుగను పెద్ద ఎత్తున జరపడం, యువతకు ఉపాధి అందించే స్కిల్ సెంటర్లు ఏర్పాటు చేయడం వంటి యాక్టివిటీస్ చేశారు. ఇక ఎంపీగా కవిత ప్రస్తానం చూస్తే.. 2014-2019 టరమ్ లో నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచిఎంపీగా గెలిచారు.. ఆపై ఓటమి తర్వాత 2020లో నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీ అయ్యారు. ప్రస్తుతం ఈ ఎమ్మెల్సీ పదవి రిజైన్ చేయాలన్న డిమాండ్ బీఆర్ఎస్ నుంచి గట్టిగా వినిపిస్తోంది.
ఇక కవిత రాజకీయంగా ఎదుర్కున్న సమస్యలేంటని చూస్తే.. ఆమె ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసును ఫేస్ చేశారు. 2024 ఏప్రిల్ లో కవితను అరెస్ట్ చేసింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్. తీహార్ జైలులో 5 నెలలకు పైగా గడిపారు. ఆగస్టు 2024లో బెయిలుపై విడుదలయ్యారు. ఇక 2025 మే నెల నుంచి కవిత ఎపిసోడ్ నాన్ స్టాప్ గా నడుస్తూనే వస్తోంది. ప్రస్తుత పరిస్థితి వరకూ ఆమె రాజకీయ ప్రస్థానం రకరకాల మలుపు తీసుకుంటూనే వస్తోంది. ఒక సమయంలో తమ పార్టీ వారిని వేధించే వారి పేర్లు పింక్ బుక్ లో రాస్తానని హెచ్చరించిన కవిత.. తానే పింక్ పార్టీకి దూరమై పోయారు. ఆమే కాదు.. ఆమె ఫాలోయర్స్ ని కూడా పార్టీలోని క్రియాశీలక పాత్రల నుంచి తొలగించేశారు. చివరికి పార్టీ వాట్సప్ గ్రూపుల నుంచి కూడా తొలగించేశారు. ప్రస్తుతం తెలంగాణ రాజకీయ జంక్షన్లో ఉన్నారు.. కవిత. ఆమె నెక్స్ట్ స్టెప్ ఏంటన్నది తెలంగాణ రాజకీయాల్లోనే అతి పెద్ద చర్చనీయాంశంగా మారింది.