Read more!

కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు జ్యుడీషియల్‌ కస్టడీని ఈ నెల 23 వరకూ పొడిగించింది.   కవితకు గత నెల 26న కోర్టు 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించిన సంగతి తెలిసిందే. ఆ గడువు ముగియడంతో ఈడీ అధికారులు సోమవారం (ఏప్రిల్ 15) ఆమెను కోర్టులో హాజరు పరిచారు.

ఈ సందర్భంగా ఈడీ తరఫున అడ్వొకేట్‌ జోహెబ్‌ హుస్సేన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వాదనలు వినిపించారు. కవిత బయట ఉంటే కేసు దర్యాప్తు ప్రభావితమవుతుందని ఆయన పేర్కొన్నారు.  కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున ఆమె  కస్టడీని  పొడిగించాలని కోరారు. కవిత తరఫున అడ్వొకేట్‌ నితీశ్‌ రాణా వాదనలు వినిపించారు.

కవిత జ్యుడీషియల్‌ కస్టడీని పొడిగించాలని కోరడానికి ఈడీ వద్ద కొత్త కారణాలేమీ లేవన్నారు. 2022 నుంచి కేసు దర్యాప్తు సాగుతున్నదని, అప్పటి నుంచి కవిత దర్యాప్తును ప్రభావితం చేసే వ్యక్తి అని ఈడీ ఆరోపిస్తూనే ఉందనీ అయితే  ఇప్పటి వరకు ఆమె దర్యాప్తును ప్రభావితం చేశారనడాకి ఎటువంటి ఆధారాలూ లేవన్నారు. ఇరు వైపుల వాదనా విన్న అనంతరం న్యాయమూర్తి జస్టిస్ కావేరి బవేజా  తీర్పును కొద్ది సేపు రిజర్వ్‌ చేసి అనంతరం కవిత జ్యుడీషియల్ కస్టడీని ఈ నెల 23 వరకూ పొడిగిస్తూ తీర్పు ఇచ్చారు.