Read more!

హాజరయ్యారు.. ఇక అరెస్టేనా?

ఢిల్లీమద్యం కుంభకోణంలో అనుమానితురాలిగా ఆరోపణలు ఎదుర్కుంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుట్ల చంద్ర శేఖర రావు కుమార్తె, కల్వకుట్ల కవిత   సోమవారం ( మార్చి 20) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. నిజానికి    మార్చి 16నే ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉన్నా, ఆమె డుమ్మా కొట్టారు. ఈ నేపథ్యంలోనే సోమవారం (మార్చి 20)  ఆమె హాజరు అవుతారా, లేదా ? అనే అనుమానాలు ఆఖరి నిముషం వరకూ కొనసాగాయి. అయితే ఈ అనుమానాలకు ముగింపు పలుకుతూ కవిత ఈడీ కార్యాలయానికి వెళ్లారు. 

ఇంతకు ముందు మార్చి 11న ఆమెను ప్రశ్నించిన అధికారులు... మార్చి 16న మరోసారి ప్రశ్నించేందుకు సిద్ధమయ్యారు. ఐతే.. ఆమె ఈడీ కార్యాలయానికి తాను రాకుండా, తన బదులు లాయర్‌ను పంపారు.  దాంతో.. ఈడీ అధికారులు ఆమెకు మరోసారి నోటీస్ పంపారు.  మార్చి 20న వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. దీంతో..   ఆదివారం (మార్చి 19) సాయంత్రం, కవిత ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. సోమవారం (మార్చి 20)  వ్యక్తిగతంగా హాజరయ్యారు. ఆదివారం (మార్చి 19)  ప్రత్యేక విమానంలో బేగంపేట్ నుంచి ఢిల్లీ వెళ్లిన కవితతో పాటు ఆమె భర్త అనిల్, సోదరుడు, మంత్రి కేటీఆర్ , రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్, వద్దిరాజు రవిచంద్ర తదితరులు కూడా వెళ్లారు. ప్రస్తుతం వారంతా ఢిల్లీ తుగ్లక్ రోడ్డులోని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసంలో ఉన్నారు.

కవితకు తాను బినామీని అని హైదరాబాద్ వ్యాపారి రామచంద్ర పిళ్లై చెప్పడంతో...  ఆ స్టేట్‌మెంట్ ఆధారంగా ఈడీ అధికారులు కవితను ప్రశ్నిస్తున్నారు.  ఈ విచారణ తర్వాత ఈడీ అధికారులు ఆమెను మరోసారి విచారణకు రమ్మంటారా లేక ఆమె విచారణను ఈరోజుతో  ముగిస్తారా లేక ఆమెను అరెస్టు చేస్తారా, అన్న ప్రశ్నలకు మరి కొద్ది సేపటిలో సమాధానం దొరుకుతుంది.

అయితే కవితను వెంటనే అరెస్ట్ చేసే అవకాసం ఉండక పోవచ్చని, విచారణన్ సమయంలో ఆమె సహకరించారా లేదా అన్న దాన్ని బట్టి ఈడీ నిర్ణయం ఉంటుందని న్యాయ నిపుణులు అంటున్నారు. కవిత విచారణకు సహకరిస్తారనే విశ్వాసం కలిగితే ఈడీ అధికారులు, ఇదే విధంగా మరి కొన్ని సార్లు ఆమెను విచారించిన తర్వాతనే అరెస్ట్ పై నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు.