కరాచీ విమానాశ్రయంపై మరోసారి దాడి
posted on Jun 10, 2014 @ 3:08PM
పాకిస్థాన్‌లోని కరాచీ విమానాశ్రయంపై ఉగ్రవాదులు మరోసారి దాడి చేశారు. ఆదివారం ఇదే విమానాశ్రయంపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో పదిమంది ఉగ్రవాదులతోపాటు మొత్తం 29 మంది మరణించారు. అప్పటి నుంచి ఈ విమానాశ్రయం వైమానిక రక్షణ దళం అధీనంలో వుంది. అయితే భారీ రక్షణ వుందని తెలిసినప్పటికీ ఉగ్రవాదులు మంగళవారం మధ్యాహ్నం మరోసారి కరాచీ ఎయిర్‌పోర్ట్ మీద దాడి చేశారు. ఈసారి వైమానిక రక్షణ దళ వసతి గృహం లక్ష్యంగా ఈ దాడి జరిగింది. ప్రస్తుతం ఉగ్రవాదులకు, రక్షణ సిబ్బందికి మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో కరాచీ ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలను నిషేధించారు. ఇప్పుడు తాజా కాల్పుల నేపథ్యంలో కరాచీ ఎయిర్‌పోర్టు ఒక యుద్ధ భూమిని తలపిస్తోందని తెలుస్తోంది. ఇదిలా వుంటే మంగళవారం పాకిస్థాన్‌లోని తీరాహ్ లోయ ప్రాంతంలో మిటలరీ అధికారులు ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు చేశారు. ఈ దాడుల్లో 17 మంది ఉగ్రవాదులు మరణించారని సమాచారం.