చంద్రబాబు కాపులకు ఇచ్చిన రిజర్వేషన్లు చెల్లుతాయి!
posted on Dec 22, 2022 @ 11:08AM
ఏపీ సీఎం జగన్ తీసుకున్న ప్రతి నిర్ణయానికీ కోర్టుల్లో చుక్కెదురౌతున్న పరిస్థితీ ఉంది. అదే తెలుగుదేశం హయంలో అంటే చంద్రబాబు తీసుకున్న ప్రతి నిర్ణయం అన్ని విధాలుగా న్యాయ సమీక్షకు నిలబడే విధంగా ఉంటుంది. ఈ విషయం మరోసారి రుజువైంది. చంద్రబాబు హయంలో ఏపీలో కాపులకు 5శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో బిల్లు ఆమోదించిన సంగతి తెలిసిందే. అలా రిజర్వేషన్లు కల్పించడం చట్టబద్ధమేననీ, చంద్రబాబు హయాంలో కాపులకు ఇచ్చిన 5శాతం రిజర్వేషన్లు చెల్లుతాయనీ కేంద్రం విస్పష్టంగా చెప్పింది.
బీజేపీ ఎంపీ జీవీఎల్ రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్రం ఈ మేరకు సమాధానం ఇచ్చింది. దీంతో చంద్రబాబు హయాంలో ఇచ్చిన కాపు రిజర్వేషన్ ఇప్పుడు అమలవుతుందని, జగన్ సర్కార్ అమలు చేస్తుందని అనుకుంటే అది భ్రమే అవుతుంది. ఎందుకంటే.. ఆ రిజర్వేషన్లను జగన్ సర్కార్ రద్దు చేసింది. మూడున్నరేళ్ల కిందట జగన్ అధికార పగ్గాలు చేపట్టగానే చంద్రబాబు హయాంలో కాపులకు ఇచ్చిన ఐదు శాతం రిజర్వేషన్లను రద్దు చేసింది. అయితే అప్పట్లో కాపులు కానీ, ఆ సామాజిక వర్గానికి చెందిన వైపీసీ నేతలు కానీ దీనిపై ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు.
గతంలో కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తూ..టీడీపీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. అయితే అప్పట్లో కేంద్రం దీనిని అంగీకరించలేదు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు యాభై శాతానికి మించకూడదన్న నిబంధన ను ప్రస్తావిస్తేూ పక్కన పెట్టేసింది. కేంద్రం మాత్రం ఆర్థికంగా వెనుకబడిన ఓసీల కోసం పది శాతం రిజర్వేషన్లను అందుబాటులోకి తెచ్చింది. దీంతో చంద్రబాబు ముందు చూపుతో ఆలోచించి.. ఏపీలో ఆ రిజర్వేషన్లలో ఐదు శాతం కాపులకు కేటాయిస్తూ.. అసెంబ్లీలో తీర్మానం చేశారు. అమలు కోసం జీవో కూడా జారీ చేశారు. ఇచ్చారు. గవర్నర్ ఆమోద ముద్ర కూడా పడింది. అయితే ఎన్నికలు జరిగి జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే.. ఈ రిజర్వేషన్లు సాధ్యం కావని.. చెల్లుబాటు కావనీ పేర్కొంటూ రద్దు చేసేశారు.
భారీ మెజార్టీతో గెలిచిన ఊపులో ఉన్న వైసీపీ నేతలు.. చివరికి కాపు నేతలు కూడా రిజర్వేషన్ల ఫలాన్ని తీసేస్తూంటే.. నోరెత్తలేదు. దాంతో కాపు సామాజిక వర్గం అంది వచ్చిన ఫలాన్ని జారవిడు చుకున్నట్లైంది. ఇప్పటికైనా వైసీపీలోని కాపు నేతలు తమ ప్రజల ప్రయోజనాలు.. యువత ఉద్యోగావకాశాలు..విద్యావకాశాలు ఇతర విషయాల్లో మేలు జరిగేందుకు .. గత ప్రభుత్వం ఇచ్చిన రిజర్వేషన్లను పునరుద్ధరించాలన్న డిమాండ్ చేయాలి. కాపు సామాజిక వర్గం కూడా గత ప్రభుత్వం తమకు కల్పించిన రిజర్వేషన్ ను ప్రస్తుత ప్రభుత్వం పునరుద్ధరించాలన్న డిమాండ్ తో జగన్ పై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది.