కన్నా క్లారిటీ.. టీడీపీలోకే!
posted on Feb 20, 2023 8:58AM
కన్నా లక్ష్మినారాయణ తాను ఏ పార్టీలో చేరబోతున్నాన్న విషయంపై క్లారిటీ ఇచ్చారు. భవిష్యత్ కార్యాచరణపై ఆదివారం ఆయన తన అనుచరులతో సమావేశమై చర్చించారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో చేరడమే మంచిదని ఆ సమావేశంలో అత్యధికులు చెప్పడంతో కన్నా తాను తెలుగుదేశం పార్టీలోకి చేరనున్నట్లు ప్రకటించారు. ఈ నెల 23న చంద్రబాబు సమక్షంలో కన్నా టీడీపీ కండువా కప్పుకుంటారని ఆయన అనుచరులు తెలిపారు. కన్నాను తమ పార్టీలో చేర్చుకునేందుకు జనసేనతో పాటు బీఆర్ఎస్ కూడా ప్రయత్నాలు చేసింది. వైసీపీ నుంచి కూడా కన్నా కోసం ప్రయత్నాలు జరిగాయని చెబుతున్నారు. ఇక కన్నా లక్ష్మినారాయణకు టీడీపీలో చేరేందుకే నిర్ణయించుకోవడంతో తెలుగుదేశం పార్టీకి చేరికతో టీడీపీకి అదనపు బలం చేకూరినట్లేనని పరిశీలకులు అంటున్నారు. ఇక బీజేపీలో కన్నాకు పొమ్మన లేకపోగపెట్టిన చందంగా వ్యవహరించిన సోము వీర్రాజు చేజేతులా పార్టీకి ఇంతో అంతో ఉన్న బలాన్ని కూడా దూరం చేసినట్లైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. నిజానికి ఒక్క కన్నా లక్ష్మీనారాయణ అనే కాదు.. రాష్ట్ర విభజన తరువాత అటు కాంగ్రెస్ లో ఇమడ లేక, ఇటు తెలుగుదేశంలోనో, మరో పార్టీలోనో చేరలేక బీజేపీలో చేరిన పలువురు మాజీ కాంగ్రెస్ నాయకులు బీజేపీలో ఉక్కపోతకు గురౌతూనే ఉన్నారు.
కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి గుడ్ బై చేప్పేశారు. ఆయన బీజేపీ నుంచి బయటకు వచ్చేస్తారని చాలా కాలంగా, అంటే ఆయన పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలగిన నాటి నుంచీ ప్రచారం జరుగుతున్నా.. ఆయన ఏ పార్టీలో చేరతారన్న విషయంలో నిన్న మొన్నటి దాకా క్లారిటీ లేదు. జనసేనలోనా, తెలుగుదేశంలోనా అన్న చర్చ జరిగింది. అయితే తెలుగువన్ మాత్రం ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలగిన నాడే ఆయన రూటు తెలుగుదేశం వైపే అని చెప్పింది. ఇప్పుడు అదే నిజమైంది. కన్నా తెలుగుదేశం గూటికి చేరనున్నట్లు ప్రకటించేశారు. అయితే కన్నా బాటలోనే నడిచే నేతలు ఏపీ బీజేపీలో ఇంకా పలువురు ఉన్నారు. కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి కూడా త్వరలోనూ బీజేపీ గూటిని వీడే అవకాశం ఉంది. బీజేపీ రాష్ట్ర నాయకత్వం తీరు పట్ల ఆమె బహిరంగంగానే తన అసమ్మతిని, అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడా ఆమెకు తగిన గుర్తింపు ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలోనే ఆమె కూడా త్వరలో పార్టీ వీడే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఇక పార్టీ నుంచి వైదొలగి, తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు ప్రకటించిన కన్నా ప్రధాని మోడీ పట్ల తనకు గౌరవం, నమ్మకం ఉన్నప్పటికీ.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తీరు పట్ల తీవ్ర అభ్యంతరాలు ఉన్నాయని ప్రకటించారు. ఒక దశలో కన్నాను బుజ్జగించేందుకు బీజేపీ అధిష్ఠానం ఒక కేంద్ర మంత్రిని రంగంలోకి దింపినా ప్రయోజనం లేకపోయింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావే శాలకు, అలాగే గత నెల 24న భీమవరంలో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకూ కూడా కన్నా డుమ్మా కొట్టినప్పుడే ఆయేన బీజేపీకి గుడ్ బై చెప్పడం ఖాయమైపోంది. ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేతులు కలిపిన నేపధ్యంలో కన్నా అయితే టీడీపీలో కాదంటే జనసేనలో చేరడం ఖాయమని కూడా పరిశీలకులు తేల్చేశారు. వాస్తవానికి బీజేపీకి కన్నా గుడ్ బై చెప్పేందుకు గ్రౌండ్ గత ఏడాది డిసెంబర్ లోనే ప్రిపేర్ అయ్యింది. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కన్నా లక్ష్మీనారాయణ ఇంటికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు.
అ పాత మిత్రులం కదా అందు ఓ సారి కలిసి కబుర్లు చెప్పు కున్నాం. ఈ భేటికి రాజకీయ ప్రాధన్యత లేదని అటు నాదెండ్ల, ఇటు కన్నా కూడా అప్పట్లో చెప్పినా వారి మాటలను ఎవరూ విశ్వసించలేదు. అప్పట్లోనే జనసేనలో కన్నా లక్ష్మీనారాయణ చేరిక అంటూ ప్రచారం జరిగింది. ఇంతకీ బీజేపీలో కన్నా ఉక్కపోతకు కారణం ఎవరంటే మాత్రం కచ్చితంగా సోము వీర్రాజే అని ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు. కన్నా బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో నియమించిన ఆరు జిల్లాల అధ్యక్షులను సోము వీర్రాజు తొలగించారు. దీంతో అంతవరకూ కొంత సైలెంట్ గా ఉన్న కన్నా ఒక్కసారిగా భగ్గుమన్నారు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతం కాకపోవడంతో పాటు జనసేనతో సంబంధాలు బలహీనం అవ్వడానికి కూడా సోము వీర్రాజ వైఖరే కారణమని కన్నా కుండ బద్దలు కొట్టారు. సోము వీర్రాజు వైఖరిని కన్నా లక్ష్మీనారాయణ బహిరంగంగానే తప్పుబట్టారు. కన్నా లక్ష్మీనారాయణ విమర్శలపై సోము వీర్రాజు స్పందించలేదు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో పార్టీ అధిష్టానానికి తెలుసునని వీర్రాజు అప్పట్లోనే వ్యాఖ్యలు చేశారు.
ఈ నేపధ్యంలో కన్నా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు డుమ్మా కొట్టినప్పుడే బీజేపీలో ఆయన కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని, ఆ తరువాత రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు కూడా ఆయన గైర్హాజరు కావడంతో ఆయన పార్టీ మారడం ఖాయమని అప్పట్లోనే నిర్ధారణ అయ్యింది. అయితే కన్నా ఏ పార్టీలో, ఎప్పడు చేరుతున్నారు అన్నదే తేలాల్సి ఉందని అప్పట్లో పరిశీలకుల పేర్కొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇటీవల ఢిల్లీ నుంచి బీజేపీ సీనియర్ నాయకుడు ఒకరు కన్నాకు ఫోన్ చేసి బుజ్జగించే ప్రయత్నాలు చేసినా అవేమీ ఫలించలేదు. ఇప్పుడు కన్నా తెలుగుదేశంలో చేరనున్నట్లు స్వయంగా ప్రకటించేసి క్లారిటీ ఇచ్చేశారు.