కమల్ కు కష్టాలు తీరేనా..విశ్వరూపం విడుదలయ్యేనా?

 

కర్ణుడు చావుకి వేయి కారణాలు, వేయి శాపాలు అన్నట్లుగానే కమల్ హస్సన్ విశ్వరూపం తమిళ్ వెర్షన్ సినిమా విడుదలకి కూడా వేయి అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఆయన ఎంత పట్టు విడుపులు ప్రదర్శిస్తున్నపటికీ ఆయన సినిమా కష్టాలు ఇప్పట్లో తీరేట్లు లేవు.

 

నిన్న మొన్నటివరకు తమిళనాడు ముఖ్యమంత్రి కుమారి జయలలిత అయన సినిమాకి సైందవుడిలా అడ్డుపడిందని అందరూ ఆరోపిస్తే కొంచెం వెనక్కి తగ్గిన ఆమె, తానే స్వయంగా ఆయనకీ, సినిమాపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న ముస్లిం నేతలకీ మధ్యవర్తిత్వం వహిస్తానని ముందుకు వచ్చారు. కమల్ హస్సన్ కూడా అందుకు చాలా సంతోషిస్తూ ఇక రేపోమాపో తన సినిమా విడుదల అయిపోతుందని భావిస్తూ, ముస్లిం నేతలు కోరినట్లు తన సినిమా నుండి వారు అభ్యంతరం చెప్పిన 9 నిమిషాల సన్నివేశాలు మొత్తం తీసేస్తానని ప్రకటించారు.

 

ఈ రోజు (శుక్రవారం) వారితో కలిసి విశ్వరూపం సినిమా చూసిన తరువాత వారు చెప్పిన సన్నివేశాలు తొలగించవలసిఉంది. అయితే, కమల్ హస్సన్ తనకు బదులుగా వేరే మరొకరిని పంపించడంతో ముస్లిం నేతలు ఆయన స్వయంగా వస్తే తప్ప సినిమా చూడమని చెప్పి వెళ్ళిపోయారు. తమిళనాడులో అందరికీ ఆరాధ్యుడయిన రజనీకాంత్ స్వయంగా వెళ్లి వారితో మాట్లాడినా ఫలితం లేకపోయింది.

 

ఇప్పటికే వారి ధోరణితో విసిగిపోయున్న కమల్ హస్సన్, వారితో కలిసి కూర్చొని వారు తన సినిమాలో తొలగించవలసిన సన్నివేశాలను ఒకటోకటిగా వారు చెప్పుకుపోతుంటే, అవి వినే ఓపిక నశించడంవల్లనే ఆయన వెళ్లి ఉండకపోవచ్చును. అయినా, వారు చెప్పినవి తొలగించేందుకు అంగీకారం తెలినప్పుడు, ఇంకా సమస్యని సాగదీయాలని వారు ప్రయత్నించడం ఎవరూ కూడా హర్షించరు. ఇదంతా చూస్తుంటే, తెగే వరకూ తాడు లాగకూడదని వారు గ్రహించకపోవడం వల్లనే ఈవిధంగా ప్రవర్తిస్తున్నారనిపిస్తోంది. తన సినిమా విడుదల చేసుకోవాలనుకొంటే తప్పనిసరిగా వారి షరతులకు అంగీకరించక తప్పని పరిస్థితిలో ఆయన ఉన్నారు. అయితే, ఆయనకీ అంతకంటే వేరే గత్యంతరం లేదు కూడా.

 

ఇది ఆయననే కాక, సినిమా పరిశ్రమకు చెందిన వారినందరినీ, ఆయన అభిమానులనీ కూడా తీవ్రంగా కలిచివేస్తోంది. రోజులు గడుస్తున్న కొద్దీ ఆయనకు ఆర్ధికంగా తీవ్ర నష్టం కలగడమే కాకుండా, అత్యంత వ్యయ ప్రయాసలకోర్చి నిర్మించిన తన సినిమాకి, తన కృషికి ప్రశంసలు దక్కకపోగా, ఈ విధంగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సినిమాయే విడుదలచేసుకోలేని దుస్థితి కల్పించినందుకు ఆయన చాలా బాధపడుతున్నారు. మరి ఈ కష్టాలు ఇంకా కొనసాగి సినిమా విడుదల కాకపొతే ఆయన ఏ తీవ్రనిర్ణయం తీసుకొన్న ఆశ్చర్యపోనవసరం లేదు.