Read more!

కల్వకుంట్ల కవితకు తప్పని తీహారు వాసం!

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జైలు కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన కవిత బెయిలు కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు కవిత బెయిలు పిటిషన్ ను మరో సారి తిరస్కరించింది. ఈ నెలాఖరు వరకూ ఆమె జ్యుడీషియల్ కస్టడీని పొడిగించింది. ఇదే కేసులో ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాలకు కూడా బెయిలు దక్కని సంగతి తెలిసిందే. 

కవిత దాఖలు చేసుకున్న బెయిలు పిటిషన్ ను విచారించిన కోర్టు, తదుపరి విచారణను ఆగస్టు 5కు వాయిదా వేసింది. అంతకు ముందు సీబీఐ గత నెల 7న దాఖలు చేసిన చార్జిషీట్ ను పరిగణనలోనికి తీసుకున్న కోర్టు.. కవితను శుక్రవారం (జులై 26) కోర్టులో హాజరు పరచాల్సిందిగా ఆదేశించిన సంగతి తెలిసిందే.  కోర్టు ఆదేశాల మేరకు కవిత, కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు.

 వాదనల అనంతరం కోర్టు ముగ్గురికీ కూడా బెయిలు నిరాకరించింది. ఇక సీబీఐ కేసుకు సంబంధించి కవిత బెయిలు పిటిషన్ ను కోర్టు గురువారం (జులై 24) నిరాకరించిన సంగతి విదితమే.  ఇక కేజ్రీవాల్, మనీష్ సిసోడియాల కస్టడీని కోర్టు ఆగస్టు 8 వరకూ వాయిదా వేసింది.  దీనిని బట్టి కవిత మరో రెండు వారాల పాటు జైలులోనే ఉండాల్సిన పరిస్థితి.  కవిత అరెస్టై నాలుగు నెలలు దాటిపోయింది. ఆమె  మార్చి 15న  ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన సంగతి విదితమే.