కాళేశ్వరం ఎఫెక్ట్.. మోడీతో కాళ్లబేరానికి కేసీఆర్?
posted on Feb 20, 2024 @ 4:39PM
కాళేశ్వరం ఎఫెక్ట్ కేసీఆర్ ధైర్యాన్నీ, స్థైర్యాన్నీ కోల్పోయేలా చేసిందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలు, అవకతవకలపై రేవంత్ సర్కార్ సీరియస్ గా దృష్టి పెట్టిన నేపథ్యంలో తన చుట్టూ ఉచ్చు బిగుసుకుంటున్నదన్న భయంలో కేసీఆర్ ఆసరా కోసం అర్రులు చాస్తున్నారా అంటే ఆయన హస్తిన పర్యటనకు రెడీ అయిపోవడం, అలాగే ప్రధాని మోడీ అప్పాయింట్ మెంట్ కోసం ప్రయత్నించడం చూస్తుంటే ఔననక తప్పదని అంటున్నారు.
నిన్న మొన్నటి వరకూ ప్రధాని మోడీపై తనదైన ప్రత్యేక భాషలో విమర్శలు గుప్పించిన కేసీఆర్ ఇప్పుడు ఆయనతో స్నేహం కోసం తహతహలాడుతుండటం ఆయనలోని భయాన్ని ఎత్తి చూపుతోందని అంటున్నారు. పార్టీ పేరును టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ కు మార్చిన తరువాత ఆయన మోడీ విషయంలో చాలా చాలా దూకుడుగా విమర్శలు గుప్పించారు. ప్రధాని రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు కనీసం ప్రోటోకాల్ కూడా పాటించకుండా, ఆయనకు ముఖం చాటేశారు. మోడీ అధికారిక పర్యటనకు తెలంగాణకు వచ్చిన సందర్భాలలో కూడా ముఖ్యమంత్రిగా ప్రధానిని రిసీవ్ చేసుకోవాలన్న సంప్రదాయానికి కూడా చెల్లు చీటీ పాడేశారు. అటువంటి కేసీఆర్ ఇప్పుడు ఆయనతో చెలిమికి వెంపర్లాడుతున్నారు. విపక్షంలో ఉండగా కేంద్రంతో సఖ్యత లేకుంటే చిక్కులు తప్పవని భావిస్తున్నారు. అందుకోసం పీఎం మోడీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా అపాయింట్‌మెంట్ కోరారనీ, అప్పాయింట్ మెంట్ లభించేదీ లేనిదీ రానున్న రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉందనీ అంటున్నారు. వారి అప్పాయింట్ మెంట్ లభ్యతను బట్టి ఈ వారంలో ఏ రోజైనా కేసీఆర్ హస్తిన పర్యటన ఉంటుందని పార్టీ వర్గాలే చెబుతున్నాయి.
సార్వత్రిక ఎన్నికల ముహూర్తం ముంచుకువస్తున్న నేపథ్యంలో కేసీఆర్ హస్తిన పర్యటన, మోడీ అప్పాయింట్ మెంట్ కోరడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. గత రెండేళ్లుగా కేసీఆర్ మోడీతో ముఖాముఖీ భేటీ అయిన సందర్భం లేదు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్రంలో రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ, బిజినెస్ స్కూల్, వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభం.. ఇలా పలు కార్యక్రమాలకు ప్రధాని మోడీ రాష్ట్రంలో పర్యటించారు. అయితే ఆ ఏ సందర్భంలోనూ సీఎం హోదాలో కేసీఆర్ ఆయనకు స్వాగతం పలకలేదు. ప్రోటోకాల్ ను కూడా ఖాతరు చేయకుండా మోడీకి దూరంగా మెలిగారు. పైపెచ్చు ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బీజేపీయేతర పార్టీలను ఏకతాటిపైకి తీసుకువచ్చి మోడీకి వ్యతిరేకంగా ఫ్రంట్ ఏర్పాటు కోసం ప్రయత్నించారు కూడా.
ఇప్పుడు తెలంగాణలో అధికారం కోల్పోయిన తరువాత ఆయన మోడీతో స్నేహం కోసం ప్రయత్నాలు చేయడానికి కాళేశ్వరం భయమే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అంతే కాకుండా నిన్నమొన్నటి వరకూ కేంద్రంలో చక్రం తిప్పాలని ఉవ్విళ్లూరిన ఆయన ఇప్పుడు కేంద్రంలో అధకారంలో ఉన్న బీజేపీతో పొత్తు కుదుర్చుకుని వచ్చే సార్వత్రిక ఎన్నికల గండాన్ని ఎలాగోలా దాటేయాలని భావిస్తున్నారని చెబుతున్నారు.
అయితే బీఆర్ఎస్ తో ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు ఉండదని బీజేపీ రాష్ట్ర నేతలు ఒక వైపు విస్పష్టంగా చెబుతున్నా.. కేసీఆర్ మోడీ, నడ్డాల అప్పాయింట్ మెంట్ కోసం ప్రయత్నించడం ప్రస్తుతం ఆ పార్టీ దయనీయ స్థితికి సంకేతమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నాలు అంటూ వస్తున్న వార్తలకు బీఆర్ఎస్ నుంచి ఖండనలు కూడా రావడం లేదు. దీంతో కాళేశ్వరం ఎఫెక్ట్ తో కేసీఆర్ మోడీకి దాసోహం అనడానికి రెడీ అయిపోయారనీ అంటున్నారు. చూడాలి మరి కేసీఆర్ కు ప్రధాని అప్పాయింట్ మెంట్ లభిస్తుందో లేదో. ఉమ్మడి ప్రత్యర్థి కాంగ్రెస్ ను తెలంగాణలో దెబ్బతీయడానికి బీజేపీకి కూడా బీఆర్ఎస్ అవసరం ఉందనీ, ఈ నేపథ్యంలో ఇరు పార్టీల మధ్యా పొత్తు పొడిచినా ఆశ్చర్యం లేదని కూడా చెబుతున్నారు.