కడప ఎంపీ.. కొత్త కథలు!
posted on Mar 14, 2023 @ 3:12PM
వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వయానా బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి.. ఇటీవల అంటే మార్చి 10న హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో విచారణ అనంతరం మీడియా ఎదుట చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు.. సోషల్ మీడియలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ హత్య కేసులో వివేకా కుమార్తె డాక్టర్ సునీత, ఆమె భర్త ఎన్ రాజశేఖరరెడ్డిపై నిందారోపణలు చేయడం భావ్యం కాదని అంటున్నారు. వివేకా హత్య.. రెండో పెళ్లి.. వారికి పుట్టిన బాబుని రాజకీయ వారసుడిగా ప్రకటించడం.. అలాగే ఆస్తి కోసం.. అంటూ వైఎస్ అవినాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వారు మండిపడుతున్నారు.
ఓ వేళ... ఈ హత్య కేసులో వివేకా కుమార్తె, అల్లుడే నిందితులు అయితే.. తన తండ్రిని ఇంత దారుణంగా హత్య చేసిన వారు ఎవరో ప్రపంచానికి తెలియాలంటూ.. తన సోదరుడు, వైఎస్ జగన్ ముఖ్యంమంత్రి పీఠం ఎక్కగానే ఆయన వద్దకు వెళ్లి.... తమకు న్యాయం చేయమని ఎందుకు అడుగుతుందని వారు ప్రశ్నిస్తున్నారు. అలాగే ఈ హత్య కేసు సీబీఐకి అప్పగిస్తేనే కానీ.. సూత్రదారులు, పాత్రదారులు ఎవరో బయటకు రారని భావించడం వల్లే ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలను కలవడమే కాకుండా... న్యాయస్థానాన్ని సైతం ఆశ్రయించారని గుర్తు చేస్తున్నారు. అలాగే ఈ కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించినా.. దర్యాప్తు సరిగ్గా జరగకపోవడంతో.. ఈ కేసు మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ.. మరోసారి కోర్టు తలుపు తట్టింది కూడా సూనీతేనని సమాజిక మాధ్యమంలో ట్రోల్ అవుతోంది.
అలాగే వివేకా హత్య జరిగిన వెంటనే.. నాటి ప్రతిపక్ష నేత జగన్.. పులివెందులకు వచ్చి.. ఇది టీడీపీ ప్రభుత్వం చేయించిన హత్య అని ... . ఈ హత్య కేసు సీబీఐకి అప్పగిస్తేనే కానీ.. దోషులు ఎవరో తెలియదని.. అన్నారు. అంతే కాకుండా సీబీఐ దర్యాప్తుతోనే వివేకా హత్య వెనుక ఉన్న నిజానిజాలు బయటకు వస్తాయన్నారు. ఈ విషయాన్ని ఆయన వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డి సమక్షంలోనే మీడియా ఎదుట డిమాండ్ సైతం చేశారని నెటిజన్లు ఈ సందర్భంగా వివరిస్తున్నారు. ఆ తర్వాత ఎన్నికలు రావడం.. ఆ ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ ఘన విజయం సాధించడం.. జగన్ ముఖ్యమంత్రి కావడం చకచకా జరిగిపోయాయని.. కానీ వైయస్ వివేకా హత్య కేసులో దర్యాప్తు మాత్రం నడకలో నత్తతో పోటీపడుతోంది.
అయినా వివేకానందరెడ్డిది గుండెపోటు అంటూ నాటి టీడీపీ ప్రభుత్వం చిత్రీకరించిందంటూ వైయస్ అవినాష్ రెడ్డి చెబుతుండడం పట్ల నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ వివేకా గుండెపోటుతో మరణించారంటూ తొలుత ప్రపంచానికి ఎవరు తెలియజేశారో.. మీరు మరిచిపోయారా? అని ప్రశ్నిస్తున్నారు. వైసీపీ కీలక నేత, రాజ్యసభ సభ్యుడు విజయాసాయిరెడ్డే.. వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారని మీడియా ముందుకు వచ్చి ప్రకటించారని... అలా వివేకానందరెడ్డి మృతి ప్రపంచానికి తెలిసిందని వారు ఈ సందర్బంగా గుర్తు చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే.. నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విజయసాయిరెడ్డి సమీప బందువులు కాబట్టి.. విజయసాయిరెడ్డితో చంద్రబాబు అలా చెప్పించి ఉంటారా? అని నెటిజన్లు వ్యంగ్యంగా ప్రశ్నిస్తున్నారు.
అయినా కడప జిల్లా అంటే వైఎస్ ఫ్యామిలీ.. వైఎస్ ప్యామిలీ అంటే కడప జిల్లా గుర్తుకు వస్తాయని.. అలాంటిది సొంత చిన్నాన్న దారుణ హత్యకు గురి అయితే.. ఇంత వరకు దోషులు ఎవరో అతీగతీ లేకపోవడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వమే అధికారంలో ఉంది... వివేక హత్య కేసును సాధ్యమైనంత త్వరగా ఛేదించాలంటూ.. కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐపై ఒత్తిడి తెచ్చి.. దోషులు ఎవరో.. నిర్దోషులు ఎవరో తేల్చాల్సిన కనీస బాధ్యత.. జగన్ దేననీ స్థానికులు ఈ సందర్బంగా స్పష్టం చేస్తున్నారు. హత్య జరిగిన తర్వాత.. అరిచి గీ పెట్టి.. ఆ తర్వాత అధికారంలోకి రాగానే. మౌనవ్రతం పాటించడం ఎంత వరకు సబబో , ఏపీ సీఎం వైయస్ జగన్‌తోపాటు కడప ఎంపీ వైఎస్అవినాష్ రెడ్డికి నెటిజన్లు చరకలంటిస్తున్నారు.