Read more!

నిజాయితీ కోసం కోటి రూపాయలు వదులుకుంటారా!

‘పరాయి సొమ్ము గడ్డిపోచతో సమానం,’ ఇలాంటి సూక్తులు మనం తరచూ వింటూనే ఉంటాం. మన పెద్దలు చిన్నప్పటి నుంచీ ఇలాంటి విలువలతోనే మనల్ని పెంచుతూ ఉంటారు. కానీ వాళ్లే ఆ విలువలని పాటించడం లేదనో, అలాంటి సత్తెకాలపు విలువల్ని పాటించి ఉపయోగం లేదనో చాలామంది తమదైన అడ్డదారిలో బతికేస్తూ ఉంటారు. కానీ ఏం లాభం! ఎడాపెడా రెండుచేతులా, అలా సంపాదిస్తున్నా ఏదో తెలియని ఆవేదన! కుడీఎడమ అని లేకుండా ప్రపంచాన్నే కబళిస్తున్నా ఏదో తెలియని అసంతృప్తి! అలాంటివారికి సమాధానంగా ఓ మనిషి గురించి ఇప్పుడు చెప్పుకొందాం.

 

ఒక రెండు సంవత్సరాల క్రితం కె.సుధాకరన్‌ అనే వ్యక్తి గురించి జాతీయ స్థాయి వార్తాపత్రికలన్నింటిలోనూ ఒక కథనం వచ్చింది. అదేమిటంటే... సుధాకరన్‌ కన్‌హన్‌గడ్‌ అనే కేరళ పట్టణంలో చిన్న కొట్టుని నడుపుకొంటున్నాడు. స్వీట్లు, కూల్‌డ్రింకులు, లాటరీ టికెట్లు... ఇవే ఆ షాపులోని అమ్మకానికి ఉండే సరకులు. అలాంటి సుధాకరన్‌కు ఓసారి అశోకన్‌ అనే కస్టమరు ఫోన్‌ చేశాడు. తరచూ తన దగ్గర లాటరీ టికెట్లు కొనే అశోకన్‌తో, సుధాకరన్‌కు మంచి పరిచయమే ఉంది. తను ఈసారి లాటరీ టికెట్లు కొనేందుకు రాలేకపోతున్నాననీ, తన బదులు ఓ పది టికెట్లు కొని పక్కనే ఉంచమని ఫోన్లో అడిగాడు అశోకన్‌. సుధాకరన్‌ అలాగే చేశాడు. ఇక అప్పటి నుంచీ అసలైన కథ మొదలైంది. పక్కన ఉంచమని చెప్పిన లాటరీ టికెట్లకు అశోకన్ ఇంకా డబ్బులు చెల్లించనేలేదు. ఆ లాటరీ టికెట్లు తీసుకున్న విషయం కానీ, వాటి నెంబర్లు కానీ సుధాకరన్ అతనికి చెప్పనూ లేదు. ఇంతలో సదరు టికెట్లలో ఒకదానికి కోటి రూపాయల లాటరీ తగిలినట్లు వార్త వచ్చింది.

 

‘అవి నీ కోసం తీసుకున్న టికెట్లు కావు’ అని అశోకన్‌తో ఒకమాట అంటే కోటి రూపాయలు సుధాకరన్‌ సొంతమయ్యేవే! కానీ సుధాకరన్‌ మరో ఆలోచనే లేకుండా చటుక్కున అశోకన్‌కు ఫోన్‌ చేశాడు. నీ కోసం తీసుకున్న లాటరీకి కోటి రూపాయలు వచ్చాయి, వచ్చి నీ టికెట్లు తీసుకువెళ్లు కోటిరూపాయలను ఉత్తిపుణ్యానికి వదులుకునేందుకు సుధాకరన్‌ ఏమీ ధనవంతుడు కాదు. అతనిది చిన్న షాపు, ఆ షాపు మీద సంపాదిస్తేనే, తన ఆరుగురు కుటుంబ సభ్యుల కడుపులు నిండేది. ఆ ఆరుగురిలో వికలాంగురాలైన ఒక కూతురు కూడా ఉంది. కానీ సుధాకరన్‌ ఇవేవీ ఆలోచించలేదు. సొమ్ము తనదా కాదా అన్న విషయాన్నే అతను బేరీజు వేసుకున్నాడు, అంతే! తను చేసిన పనికి అతనికి కోటిరూపాయలు మించిన తృప్తి మిగిలింది. కోట్లతో కొనలేది వ్యక్తిత్వమూ బయటపడింది.

 


సుధాకరన్‌ ఉదాహరణ ఇక్కడితో మిగిలిపోలేదు. విధి అతని నిజాయితీకి మరోసారి పరీక్ష పెట్టింది. సుధాకరన్‌ రోజూ ఉదయాన్నే 4.30కు లేచి, రెండు గంటలు ప్రయాణం చేస్తే కానీ తన కొట్టుని చేరుకోలేడు. అలాంటి ఒకరోజున సుధాకరన్‌ ట్రైనులో ప్రయాణిస్తుండగా, ఒక బంగారు నగ దొరికింది. ఆ బంగారు నగను దాని యజమాని దగ్గరకు చేర్చేదాకా నిద్రపోలేదు సుధాకరన్‌. ‘ఇంతకీ మీ ఈ నిజాయితీకి స్ఫూర్తి ఏమిటి?’ అని అడిగితే... తన తండ్రి నేర్పిన విలువలే అంటాడు సుధాకరన్‌. ‘డబ్బులు కావాలంటే అడుక్కునైనా సంపాదించవచ్చు కానీ, మరొకరి సొమ్ముని ఆశించకూడదని’ సుధాకరన్ తండ్రి చెప్పారట. ఆ విలువలనే అక్షరాలా పాటిస్తున్నాడు సుధాకరన్‌. ‘ఇతరులకు మంచి చేయకున్నా చెడు  చేయకపోవడమే..... అర్థవంతమైన, ప్రశాంతమైన జీవితానికి రహస్యం’ అంటున్నాడు. నిజమే కదా!                                        

   -నిర్జర