తాత మీద ప్రేమ మాటలకే పరిమితమా ఉత్తర కుమార!
posted on Sep 22, 2022 @ 7:37PM
కర్ర విరగకుండా పాము చావకుండా అన్నట్టుగా ఉంది జూనియర్ ఎన్టీఆర్ తీరు. మాటకు ముందు తాత, మాటకు తర్వాత తాత అంటూ తన తాతగారు నందమూరి తారక రామారావుపై ఎనలేని అభిమానం, గౌరవం, భక్తి ఉన్నాయని చెప్పుకునే జూనియర్.. తన తాత మానస పుత్రిక అయిన 'డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ' పేరు మారిస్తే "అమ్మతోడు అడ్డంగా నరికేస్తా" అనే రేంజ్ లో స్పందిస్తాడు అనుకుంటే 'అమ్మ అయ్యా' అని బతిమాలుతున్నాడు.
తన కట్టె కాలే దాకా తాత స్థాపించిన తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని గతంలో చెప్పిన జూనియర్.. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉంటూ రాజకీయాలకు దూరంగా ఉంటున్నాడు. అసలు ఆయన ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి ఏదో ఉద్దరించాలని టీడీపీ శ్రేణులు, నందమూరి అభిమానులు సైతం కోరుకోవడం లేదు. తాత అంత కాకపోయినా సినిమాల్లో అంతో ఇంతో రాణిస్తే మంచిదేగా అని మద్దతిస్తున్నారు. అయితే తన కుటుంబ సభ్యులకు అవమానం జరిగినా.. ఎవరికో భయపడో లేక ప్రత్యర్థి పార్టీలో ఉన్న తన మిత్రుల మెప్పు కోసమో అన్నట్టుగా మెతక వైఖరి చూపించడమే నందమూరి అభిమానులకు, టీడీపీ శ్రేణులకు ఆగ్రహం తెప్పిస్తోంది.
తన మేనత్త భువనేశ్వరిని అసెంబ్లీ సాక్షిగా అధికారిక పార్టీ నేతలు అవమానిస్తే.. ‘అలా మాట్లాడటం తప్పు’ అంటూ ఏదో ఆటో వెనక రాసే కొటేషన్ లా సింపుల్ గా చిన్న వీడియో బైట్ రిలీజ్ చేసి మమ అనిపించాడు. మేనత్త మీద ఆయనకున్న ప్రేమ అంతేనేమో లేక సినిమాల్లో చూపించే రౌద్రం బయట చూపించలేడేమో అనుకున్నారంతా. కానీ ఇప్పుడు తన దైవం అని చెప్పుకునే తాతకి అవమానం జరిగినా ఆయన తీరు అలాగే ఉంది. ఆటం బాంబులా పేలతాడు అనుకుంటే.. తడిసిన చిచ్చుబుడ్డిలా తుస్సుమనిపించాడు.
‘‘ఎన్టీఆర్, వైఎస్సార్ ఇద్దరూ విశేష ప్రజాదరణ సంపాదించిన గొప్ప నాయకులు. ఈ రకంగా ఒకరి పేరు తీసి ఒకరి పేరు పెట్టడం ద్వారా తెచ్చే గౌరవం వైఎస్సార్ స్థాయిని పెంచదు, ఎన్టీఆర్ స్థాయిని తగ్గించదు. విశ్వవిద్యాలయానికి పేరు మార్చడం ద్వారా ఎన్టీఆర్ సంపాదించుకున్న కీర్తిని, తెలుగు జాతి చరిత్రలో వారి స్థాయిని, తెలుగు ప్రజల హృదయాలలో ఉన్న వారి జ్ఞాపకాలను చెరిపివేయలేరు’’ ఇదీ జూనియర్ చేసిన ట్వీట్.
ఉప్పు వేయకుండా పప్పు చేసినట్టు, మసాలా లేకుండా నాన్ వేజ్ వండినట్టు.. విషయం లేని ట్వీట్ ఒకటి చేసి చేతులు దులుపుకున్నాడు. పైగా ఆ ట్వీట్ లో వైఎస్సార్ భజన ఎన్టీఆర్ అభిమానులను ఆగ్రహం తెప్పించేలా చేసింది.
తాతగారి పేరుని తొలగించడాన్ని ఖండిస్తున్నాను అని సింపుల్ గా ఒక ముక్కలో ట్వీట్ వేసినా సర్లే ఈ జూనియర్ తీరు అంతే అనుకొని అభిమానులు సరిపెట్టుకునేవారేమో. కానీ మా తాత, మీ తండ్రి గొప్పోళ్ళు అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మనస్సుకి హాయి కలిగించే మాటతో ట్వీట్ ప్రారంభించి అభిమానులకు మంట పుట్టేలా చేశాడు. అంటే తన దృష్టిలో ఎన్టీఆర్, వైఎస్సార్ సమానమేనా? ఇద్దరి స్థాయి ఒక్కటేనా?. తాత పేరుని తొలగిస్తే ఆగ్రహం వ్యక్తం చేయాల్సింది పోయి.. ఆయనతో వైఎస్సార్ ను పోలుస్తూ ఈ భజన ఏంటి?
సినిమాల్లో పడి జూనియర్ గతం మరచినట్టున్నాడు. 2009 ఎన్నికల సమయంలో టీడీపీ తరపున జూనియర్ ప్రచారం చేస్తే 'బుడ్డోడు' అంటూ హేళన చేశారు వైఎస్సార్. దాంతో జూనియర్ అప్పట్లో ఆయనపై ఓ రేంజ్ లో విమర్శలు చేశాడు. అంతేనా తాను నటించిన ఒక సినిమాలో "బుడ్డోడా బుడ్డోడా అంటే గుడ్డలూడదీసి కొడతా" అనే డైలాగ్ కూడా పెట్టుకున్నాడు. మరి ఆ ఫైర్ ఇప్పుడేమైంది. తన తాతని అవమానిస్తే మీరు చేసింది తప్పు అని నేరుగా జగన్ సర్కార్ ని ఒక్క మాట అనలేక.. ఎన్టీఆర్, వైఎస్సార్ ఇద్దరూ గొప్ప నాయకులు అంటూ ఈ దిక్కుమాలిన ట్వీట్ ఏంటి? నీ కంటే వైఎస్సార్ కుమార్తె, జగన్ సోదరి షర్మిల నయం. 'ఎన్టీఆర్ పేరు మార్చడం తప్పు' అని విస్పష్టంగా చెప్పింది. నీ జీవితం తాతకి అంకితం అని చెప్తావుగా, మరి అలాంటి తాతని అవమానిస్తే.. ఆవేదనతో, ఆగ్రహంతో ఇది తప్పని చెప్పాల్సింది పోయి.. నీ స్వార్థం కోసం ఈ ఉత్తరకుమార ట్వీట్ చేస్తావా అంటూ అభిమానులు ఆగ్రహంతో విరుచుకుపడుతున్నారు.