రామా..రావా..? పొలిటికల్ కంత్రీ!
posted on Mar 22, 2021 @ 4:28PM
సీఎం. సీఎం. ఇన్నాళ్లూ జగన్, పవన్ ఫ్యాన్స్‌కే పరిమితం ఈ స్లోగన్. ఇప్పుడు రాజకీయాలతో ఎలాంటి సంబంధంలేని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులూ ఈ నినాదం అందిపుచ్చుకున్నారు. 'తెల్లవారితే గురువారం' ప్రీరిలీజ్ ఫంక్షన్‌లో జరిగిందీ హడావుడి. జగన్, కల్యాణ్‌ల లెక్క వేరు. జూనియర్ పరిస్థితి వేరు. సీఎం, సీఎం అంటూ అభిమానులు అరుస్తుంటే.. జగన్, పీకేలు మౌనంగా ఉండేవారు. ఒకరకంగా ఆ స్లోగన్స్‌ను ఎంకరేజ్ చేసేవారు. కానీ, ఎన్టీఆర్ అలా కాదు. ఆగండి బ్రదర్.. అంటూ ఓ రేంజ్‌లో సీరియస్ అయ్యారు. పదాలు ఎక్కువగా వాడకున్నా.. ఆయన ముఖంలో, ఆ మాటలో కోపం కొట్టొచ్చినట్టు కనిపించింది.
తారక్ పొలిటికల్ ఎంట్రీపై ఎప్పటి నుంచో ఇష్యూ నడుస్తోంది. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబుకూ ఆ సెగ తగిలింది. బాబు కుప్పం పర్యటనలో టీడీపీ శ్రేణులు జూనియర్‌ను రాజకీయాల్లో దింపాలంటూ అధినేత సమక్షంలోనే పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అప్పటి నుంచి రామారావు రాకపై ఆసక్తి నెలకొంది. కట్ చేస్తే.. ఇటీవల జరిగిన ఓ మీడియా సమావేశంలో నేరుగా ఎన్టీఆర్‌నే పొలిటికల్ ఎంట్రీపై ప్రశ్నించారు జర్నలిస్టులు. ఇది సమయం కాదంటూ అప్పుడు మాట దాటేశారు జూనియర్. ఈసారి మాత్రం మరింత సీరియస్ అయ్యారు. అప్పుడు మీడియా కాబట్టి కాస్త రెస్పెక్ట్‌గా ఆన్సర్ ఇచ్చిన బుడ్డోడు.. ఇప్పుడు తన అభిమానులను ఒక్క డైలాగ్‌తో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి నోరు మూయించారు.
జూనియర్ రియాక్షన్ చూస్తుంటే ఆయనకు ఇప్పుడే రాజకీయాల్లోకి రావడం అసలే మాత్రం ఇష్టం లేనట్టే కనిపిస్తోంది. అక్కడ జరిగేది సినిమా ఫంక్షన్ కాబట్టి ఫ్యాన్స్‌ను వారించాలంటే అంత ఆగ్రహంగా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ లేదు కాబట్టే.. తనను పదే పదే సీఎం సీఎం అంటుంటే అంత అసహనానికి లోనయ్యారని అంటున్నారు. ఆ విషయాన్ని ఇక్కడితోనే ముగిస్తే మంచిదని.. మౌనంగా ఉంటే ముందుముందు మరింత ముదురుతుందని జూనియర్ భావించారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అందుకే.. జగన్, పవన్‌ల మాదిరి కాకుండా.. ఫ్యాన్స్ సీఎం సీఎం అనగానే సీరియస్‌గా రియాక్ట్ అయ్యారని అంటున్నారు.
టీడీపీ ప్రాభవం తగ్గినా.. ఎన్టీఆర్ ఇప్పటికిప్పుడు రాజకీయాల్లోకి వచ్చి పెద్దగా సాధించేదేమీ ఉండకపోవచ్చు. చంద్రబాబు ఇంకో పదేళ్లయినా యాక్టివ్ పాలిటిక్స్‌లో ఉండగలరు. ఆయన వారసులుగా లోకేవ్, బాలకృష్ణలు ఉండనే ఉన్నారు. మరోవైపు, జూనియర్ ఎన్టీఆర్ స్టార్ హీరోగా టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలుగుతున్నారు. ఆయనకు వెండితెరపై మరింత మంచి భవిష్యత్ ఉంది. అర్జెంట్‌గా పొలిటికల్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇవ్వాల్సిన అవసరమేమీ లేదు. అంతలా సిట్చ్యూయేషన్ డిమాండ్ చేస్తే.. మరో పది, పాతికేళ్ల తర్వాత రాజకీయ ఆలోచన చేయొచ్చు. అందుకే.. ఆలూ లేదు సూలూ లేదు.. హడావుడిగా సీఎం సీఎం అంటూ ఫ్యాన్స్ నినాదాలు చేయడంతో ఎన్టీఆర్‌కు చిర్రెత్తుకొచ్చి.. అలా కోపంగా.. ఆగండి బ్రదర్స్ అంటూ అదుపు చేశారని అంటున్నారు. అభిమానులు రామారావును రాజకీయాల్లోకి రా..రా.. అంటుంటే.. జూనియర్ మాత్రం రానురాను నేనురాను ఒగ్గేయమంటూ.. తప్పించుకుంటున్నారు.