వలసలు, అసంతృప్తి రాగాలు.. టీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి
posted on Jul 12, 2022 @ 1:57PM
ఎనిమిదేళ్లు ఏకఛత్రాధిపత్యంగా తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ఇప్పుడు వలసలు, అసమ్మతి రాగాలతో ఉక్కిరిబిక్కిరి అయిపోతోంది. ఒక వైపు పార్టీని వీడుతున్న నేతలు, మరో వైపు తమ అసమ్మతిని బహిర్గతం చేస్తున్న నాయకులతో టీఆర్ఎస్ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ముందు వెనుకలాలోచించకుండా ఆపరేషన్ ఆకర్ష్ అంటూ ఇతర పార్టీల వారికి తలుపులు బార్లా తెరిచేసిన ఫలితమే ఇప్పుడు ఈ పరేషాన్ అని తెరాస వర్గాలే అంటున్నాయి.
పార్టీ నిర్మాణం నుంచీ తెరాలలో ఉండి ఆటుపోట్లు తట్టుకుని రాటు తేలిన టీఆర్ఎస్ నేతలకు ఇప్పడు పార్టీలో పరిణామాలు ఇబ్బందికరంగా మారాయి. అసహనం, అసంతృప్తి వారిలో పెల్లుబుకుతోంది. ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన వారికి పెద్ద పీట వేసి, కేసీఆర్ తమను నిర్లక్ష్యం చేశారన్న ఆవేదనలో ఉన్న వారు పార్టీ తరఫున గట్టిగా నిలబడే అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలా అని ఇతర పార్టీల నుంచి వచ్చి చేరి టీఆర్ఎస్ లో అందలం ఎక్కి పదవులు అనుభవిస్తున్న వారు రేపు ఎన్నికలలో పార్టీ అటూ ఇటూ అయితే టీఆర్ఎస్ ను అంటిపెట్టుకు ఉంటారా అంటే అదీ అనుమానమేనని వారు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం మొదటి నుంచీ టిఆర్ఎస్ లో ఉన్న నాయకులకు.. మధ్యలో వచ్చి చేరి పదవుల అందలాలు అందుకున్న నాయకులకు మధ్య సయోధ్య కొరవడింది. అదే సమయంలో పార్టీ అగ్రనాయకత్వం వీరిని సమన్వయపరచడంలో పూర్తిగా విఫలమైంది. ఫలితంగా రాష్ట్రంలోని ఏ నియోజకవర్గం తీసుకున్నా.. అక్కడ రెండు మూడు గ్రూపులు ఏర్పడి.. ఒక గ్రూపుతో మరో గ్రూపునకు వైరుధ్యం, విభేదాలతో పార్టీలో సఖ్యత కొరవడిన పరిస్థితి నెలకొని ఉంది. ప్రస్తుతానికి చాలా చోట్ల ఈ అసంతృప్తి, అసమ్మతి నివురు గప్పే ఉన్నా.. ఎన్నికల నాటికి నివురు తొలగిపోయి అసంతృప్తి జ్వాలలు, అసమ్మతి అగ్ని రాజుకునే అవకాశాలే మెండుగా ఉన్నాయని అంటున్నారు. అసెంబ్లీ టిక్కెట్టు ఆశావాహులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు తమతమ వర్గాలను బలోపేతం చేసుకోవడానికే పరిమితం కావడం లేదనీ, తమకు పోటీ వస్తారని భావిస్తున్న వారిని బలహీన పరిచేందుకు వ్యూహాలు పన్ను తున్నారనీ, అందుకే నియోజకవర్గాలలో గ్రూపు తగాదాలు రోడ్డున పడుతున్నాయనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక ప్రత్యర్థులు పార్టీలో తమను ఎదగనివ్వరన్న నిర్ధారణకు వచ్చేసిన వారు మాత్రం ఎన్నికల సమయం వరకూ ఆగడం ఎందుకన్న భావనతో పార్టీని వీడుతున్నారు.
ముఖ్యంగా తాండూరు, కొల్లాపూర్, మహేశ్వరం, భువనగిరి, నకిరేకల్, జనగాం, ఉప్పల్, మేడ్చెల్, ఆర్మూర్, హుజూరాబాద్ నియోజకవర్గాలతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లోనూ పార్టీలోని ఆశావాహులు శరవేగంగా పావులు కదుపుతున్నారు. రానున్న ఎన్నికల్లో పోటీదారుడిని వెనుకకు నెట్టి టిక్కెట్టు తెచ్చుకోవడంపైనే దృష్టిసారించారు. ఈ మారు అసెంబ్లీ టిక్కెట్టు కోసం ఆశావాహుల్లో పోటీ తీవ్ర స్థాయిలో ఉన్నది. దీంతో ఈ పాటికే తాండూరులో నేనే పోటీచేస్తానని, తనతో పాటు తన సోదరుడు కూడా పోటీ చేస్తారనే ధీమాను ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి వ్యక్తం చేస్తున్నారు. భువనగిరిలోనూ చింతల వెంకటేశ్వర్ రెడ్డి కూడా ఈ విషయాన్ని బహిరంగంగా చెబుతున్నారు.
నకిరేకల్ లో వేముల వీరేశం కూడా టిక్కెట్టు తనదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కొల్లాపూర్ లో జూపల్లి కృష్ణారావు బహిరంగంగా చర్చకు రావాలని సిట్టింగ్ ఎమ్మెల్యేకు షాక్ ఇచ్చారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మహేశ్వరం నియోజకవర్గంలో ప్రస్తుత మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై తీగల కృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఉప్పల్ నియోజకవర్గంలో బొంతు రామ్మోహన్ తానే అభ్యర్థినంటూ విస్తృత ప్రచారం ప్రారంభించేశారు. ఇలా చాలా నియోజకవర్గాల్లోని ఆశావాహులు పోటీదారులపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించడమే కాకుండా తామే అభ్యర్థులమంటూ బహిరంగ ప్రకటనలకు దిగుతున్నారు.
ఇవిలా ఉంటే.. దివంగత నేత పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి, రెండు మార్లు టీఆర్ఎస్ నుంచి కార్పొరేటర్ గా గెలిచి కూడా పార్టీలో గుర్తింపు దక్కడం లేదంటూ సొంత గూటికి అంటే కాంగ్రెస్ గూటికి చేరారు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని బడంగ్ పేట్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి కూడా టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. మొత్తం మీద టీఆర్ఎస్ లో ఆల్ ఈజ్ వెల్ కాదు.. ఆల్ ఈజ్ నాట్ వెల్ అన్న వాతావరణం కనిపిస్తున్నది. ముందు ముందు రోజుల్లో ఇది మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.