ఉత్కంఠ రేపుతున్న జూబ్లీ ఎన్నిక...పోలింగ్ శాతం పెరిగేనా?
posted on Nov 10, 2025 @ 9:14PM
అభ్యర్థుల గెలుపోటములను, పార్టీల భవిష్యత్తును నిర్ణయించేది ఓటర్లే కాబట్టి.. జూబ్లీహిల్స్‌లో ఈసారి భారీ పోలింగ్ నమోదవుతుందా? ఎప్పటిలాగే 50 శాతం లోపే ఆగిపోతుందా? అన్నది ఆసక్తి రేపుతోంది. జూబ్లీహిల్స్ ఓటర్లు పోలింగ్ బూత్ దాకా వచ్చి, ఓ పది నిమిషాలు క్యూలో నిల్చొని.. తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకుంటారా? లేక.. పోలింగ్‌ని లైట్ తీసుకొని రిలాక్స్ అవుతారా? అన్నదానిపై అనేక ఊహాగానాలు మొదలయ్యాయ్. ఎందుకంటే.. 2014లో అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే.. జూబ్లీహిల్స్‌లో 50.1 శాతం పోలింగ్ నమోదైంది.
ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్ పర్సంటేజ్ 50 శాతం మార్క్‌ని దాటలేదు. జూబ్లీహిల్స్‌లో ఎప్పుడు ఎన్నికలొచ్చినా.. పోలింగ్ బూత్ దాకా వచ్చే వారి సంఖ్య తక్కువగా ఉంటోంది. ఈ బైపోల్‌లోనైనా.. జూబ్లీహిల్స్ ఓటర్ల తీరు మారుతుందా? ఎప్పటిలాగే మెజారిటీ ఓటర్లు ఉపఎన్నికని కూడా లైట్ తీసుకుంటారా? అనే చర్చ మొదలైంది. పార్టీల గెలుపోటముల గురించి ఎంత చర్చ నడుస్తుందో.. పోలింగ్ శాతం పెరుగుతుందా? లేదా? అనే దానిమీద కూడా అంతే డిబేట్ నడుస్తోంది.
జూబ్లీహిల్స్ లాంటి అభివృద్ధి చెందిన నియోజకవర్గాల్లో.. తక్కువ పోలింగ్ నమోదవడం.. ప్రజాస్వామ్య స్ఫూర్తికి మంచిది కాదు. ఎందుకంటే.. ఓటు మన హక్కు మాత్రమే కాదు.. బాధ్యత కూడా. ప్రశ్నించడానికైనా, ప్రాంత ప్రగతికైనా.. ఓటే ఆయుధం. ఏ ఎన్నిక జరిగితే నాకేంటి? ఎంతో కొంత మంది వేస్తున్నారుగా? నేనొక్కడిని ఓటు వేయకపోతే.. ఏమవుతుందిలే అనే ఆలోచన, నిర్లక్ష్య ధోరణి.. ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం! ఇలా ఆలోచిస్తే.. పోలింగ్ శాతం తగ్గిపోతోంది. తక్కువ మార్జిన్‌తో.. ఫలితం మారిపోతోంది. అప్పుడు.. మీరు అనుకున్న నాయకుడికి బదులుగా.. మరొకరు గెలిచే అవకాశం ఉంటుంది.
మీకు నచ్చిన నాయకుడు గానీ, పార్టీ గానీ గెలుపొందాలంటే.. మీరు కచ్చితంగా గడప దాటి వెళ్లి ఓటు వేయాల్సిందే! నేను కాకపోతే మరొకరు వేస్తారులే అని ఇంట్లో కూర్చుంటే.. వాళ్లు కూడా మీలాగే ఆలోచించి ఇంట్లోనే ఉండిపోతే.. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల సంఖ్య ఎప్పటికీ పెరగదు. ఇది.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్లే. ముఖ్యంగా.. జూబ్లీహిల్స్ లాంటి విద్యావంతులు, ధనవంతులు, పేద, మధ్యతరగతి ప్రజలు కలబోతగా ఉన్న నియోజకవర్గంలో.. 50 శాతం పోలింగ్ కూడా నమోదవకపోవడం ఆందోళనకరం. ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉంటూ.. సరైన అక్షరాస్యత లేని వాళ్లు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
కానీ.. ఉన్నత చదువులు చదివి, సిటీలో ఉంటూ.. ఓటు హక్కు వినియోగించు కోకపోవడమేంటి? చివరికి.. బీహార్ ఓటర్లు కూడా.. పోలింగ్ సెంటర్లకు పోటెత్తారు. మరి.. జూబ్లీహిల్స్ ఓటర్లకు ఏమైంది? పోనీ.. పోలింగ్ కేంద్రాలేమైనా పదుల కిలోమీటర్ల దూరంలో ఉంటాయా? అంటే అదీ లేదు. అందరికీ.. దగ్గర్లోనే ఉంటాయ్. లైన్‌లో ఓ పది నిమిషాలు నిల్చుంటే సరిపోతుంది. మహా అయితే.. అరగంట. అంతకుమించి పోలింగ్ సెంటర్‌లో వేచి ఉండే పరిస్థితే లేదు. అయినప్పటికీ.. జూబ్లీహిల్స్‌లో పోలింగ్ శాతం పెరగడం లేదు. మారుమూల ప్రాంతాల ప్రజలని చూసైనా.. మేల్కోవాలనే సూచనలు వినిపిస్తున్నాయ్.
ఓటు హక్కు.. రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక బాధ్యత మాత్రమే కాదు. మన భవిష్యత్తుని నిర్ణయించే.. విలువైన అధికారం. ఎన్నికల్లో ఓటు హక్కుని వినియోగించుకోకపోతే.. ప్రశ్నించే నైతిక హక్కుని కోల్పోతాం. పోలింగ్‌లో పాల్గొనే ప్రతి పౌరుడికి.. ఎన్నికల తర్వాత తమ నాయకుడిని, ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు లభిస్తుంది. ఎవరికైనా ఓటు వేసుకోండి.. మీకు నచ్చిన అభ్యర్థికే ఓటేయండి.
కానీ.. ఓటు మాత్రం వేయండి. ఓటరుగా అభ్యర్థిని ఎన్నుకున్నప్పుడు, అధికారం కట్టబెట్టినప్పుడు, పాలనలో లోపాలు కనిపిస్తే.. నిలదీసే హక్కు దక్కుతుంది. జూబ్లీహిల్స్ ప్రజలారా వింటున్నారా? పోలింగ్ డే రోజున.. ఇంటి నుంచి కదలండి. ఆనవాయితీగా మారిన లో ఓటింగ్ మచ్చని చెరిపేయండి. ఈసారైనా చరిత్రని మార్చండి. మీ ఒక్క ఓటుతో ఏమవుతుందనుకోకండి. మీ ఒక్క ఓటే.. తీర్పుని మార్చొచ్చు. పోలింగ్ సెంటర్‌లో మీరు తీసుకునే నిర్ణయమే.. సమాజాన్ని ప్రభావితం చేస్తుంది. నియోజకవర్గ భవిష్యత్‌ని నిర్ణయిస్తుంది.