సీఎం కేసీఆర్ పై జేపీ నడ్డా తీవ్ర విమర్శలు
posted on Aug 10, 2020 @ 4:40PM
తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణలో బీజేపీ జిల్లా కార్యాలయాలకు భూమిపూజ కార్యక్రమంలో భాగంగా ఆన్ లైన్ ద్వారా మాట్లాడిన ఆయన.. టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. దోచుకోవడం కోసమే రూ.45 వేల కోట్లకు పూర్తి కావాల్సిన కాళేశ్వరం పనులను రూ.85 వేల కోట్లకు పెంచారని మండిపడ్డారు.
గడిచిన ఆరేళ్ళుగా తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ చేసిందేంటో చెప్పాలని ప్రశ్నించారు. ఇంటికొక ఉద్యోగాన్ని ఇస్తానని చెప్పిన కేసీఆర్.. నిరుద్యోగులకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని నిలదీశారు. ఏడు లక్షల ఇళ్ళు నిర్మిస్తామని చెప్పి, 50వేల ఇళ్ళు కూడా కట్టలేదని విమర్శించారు. కరోనాను కట్టడి చేయకుండా సీఎం కేసీఆర్ కుంభకర్ణుడి నిద్రపోతున్నారని, కరోనా కట్టడి విషయంలో కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని దుయ్యబట్టారు. లోక్‌సభ ఎన్నికల మాదిరిగానే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కేసీఆర్ కు బుద్ధి చెప్పాలి అని నడ్డా పిలుపునిచ్చారు.
తెలంగాణలో బీజేపీ జిల్లా కార్యాలయాల నిర్మాణం చేపట్టడం, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయడం చూస్తుంటే.. బీజేపీ తెలంగాణపై మరింత ఫోకస్ పెట్టినట్టు అర్థమవుతోంది. 2019 లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో నాలుగు ఎంపీ సీట్లు గెలిచి సత్తా చాటిన బీజేపీ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పనిచేయబోతున్నట్టు కనిపిస్తోంది.