ఐప్యాక్ కార్యాలయంపై ఈడీ రెయిడ్స్.. మమత ఫైర్
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది జరగనున్నాయి. హ్యాట్రిక్ విజయాలతో వరుసగా మూడు సార్లు రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన తృణమూల్ కాంగ్రెస్ నాలుగోసారి విజయం సాధించి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నది. అదే సమయంలో బీజేపీ కూడా రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టాలన్న పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలోనే పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ వేడి రగులు కుం టోంది.
తాజాగా రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుట్రపూరితంగా ఎన్నికల లబ్ధి కోసం దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
కోల్‌కతాలోని సాల్ట్ లేక్‌లో ఉన్న ఐ-ప్యాక్ ప్రధాన కార్యాలయంతో పాటు, సంస్థ సహ వ్యవస్థాపకుడు ప్రతీక్ జైన్ నివాసంలోనూ గురువారం (జనవరి 8) ఉదయంఈడీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేపట్టారు. కేంద్ర సాయుధ బలగాల భద్రత నడుమ జరుగుతున్న దాడుల నేపథ్యంలో మమతా బెనర్జీ, కోల్‌కతా పోలీస్ కమిషనర్ మనోజ్ కుమార్ వర్మతో కలిసి నేరుగా ప్రతీక్ జైన్ నివాసానికి చేరుకున్నారు. ఇంట్లోకి వెళ్లి ఈడీ అధికారులతో మాట్లాడి, కొద్దిసేపటి తర్వాత బయటకు వచ్చిన ఆమె, మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్రంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
తృణమూల్ కాంగ్రెస్‌కు సంబంధించిన పత్రాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించారనీ, అయితే.. తాను వాటిని తిరిగి తీసుకువచ్చానని చెప్పిన మమతా బెనర్జీ, హోంమంత్రి దేశాన్ని రక్షించలేరు, కానీ ఈడీ ద్వారా తృణమూల్ ను ఇబ్బందులు పెట్టడానికి చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ నుంచి సాల్ట్ లేక్‌లోని ఐ-ప్యాక్ కార్యాలయానికి కూడా ఆమె వెళ్లారు. 2021 అసెంబ్లీ ఎన్నికలకు ముందు, అంటే 2020 నుంచి ఐ-ప్యాక్ సంస్థ తృణమూల్ కాంగ్రెస్‌కు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తున్న విషయం తెలిసిందే.
మమత చర్యలపై పశ్చిమ బెంగాల్ శాసనసభలో ప్రతిపక్ష నేత సువేందు అధికారి తీవ్రంగా స్పందించారు. రాజ్యాంగబద్ధమైన సంస్థ విధుల్లో మమతా బెనర్జీ నేరుగా జోక్యం చేసుకుంటున్నారని విమర్శించారు. గతంలో కోల్‌కతా మాజీ పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఇంటికి సీబీఐ అధికారులు వెళ్లినప్పుడు కూడా ఆమె ఇదే విధంగా అడ్డుకున్నారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక ప్రైవేట్ కార్పొరేట్ సంస్థ కార్యాలయంపై ఈడీ దాడి చేస్తే సీఎం మమతా బెనర్జీకి ఎందుకంత ఆందోళన అని ప్రశ్నించారు. మొత్తం మీద పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల హీట్ పీక్ స్టేజికి చేరిందని ఈ పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి.