కేసీఆర్, చంద్రబాబుపై జేసీ కామెంట్స్.. ఇద్దరూ ఇద్దరే..
posted on Mar 10, 2016 @ 2:09PM
ప్రతిపక్ష పార్టీపైనే కాదు.. సొంత పార్టీమీద.. సొంత పార్టీ నేతలమీద కామెట్లు చేయాలంటే జేసీ దివాకర్ రెడ్డి తరువాతే. కొద్ది రోజులుగా సైలెంట్ గా ఉన్న జేసీ దివాకర్ రెడ్డి మళ్లీ తన నోటికి పని చెప్పారు. ఈసారి ఏకంగా తెలుగు రాష్ట్రాల సీఎం గురించి వ్యాఖ్యానించడం గమనార్హం. చంద్రబాబు, కేసీఆర్ ఇద్దరూ ఇద్దరే అని అన్నారు. టీఆర్ఎస్ పార్టీలో చేరితే కేసీఆర్ పదవులు కాకపోయినా పనులైనా చేసిపెడతారని ఆశించి ఆ పార్టీలోకి చేరుతున్నారు.. కానీ ఏపీలో పరిస్థితి వేరు ఇక్కడ దానికి కుడా అవకాశం లేదని..తాను కూడా ఆకర్షణలో భాగంగానే టిడిపిలో చేరానని చెప్పారు. ఇక వైసీపీ నేతలు టీడీపీలోకి చేరడం గురించి మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యేలను డబ్బులిచ్చి కొనలేదు.. జగన్ తీరు నచ్చకే ఆపార్టీ నేతలు టీడీపీలోకి వస్తున్నారు అని వ్యాఖ్యానించారు.
ఇంకా రాష్ట్ర విభజన గురించి మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన సరికాదని తాను సోనియాగాంధీ, రాహుల్ గాంధీకి చెప్పానని... దానికి సోనియా 20 ఏళ్ల తర్వాత అయినా రాష్ట్ర విభజన సమర్థనీయమని ప్రజలు చెప్తారని తనతో అన్నారని అన్నారు. అసలు ప్రత్యేక తెలంగాణ కంటే రాయల్ తెలంగాణ ఇచ్చుంటే బావుండేదని.. అప్పుడు సీమకు కష్టాలు వచ్చేవికావని అన్నారు.