ఏపీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా జాస్తి చలమేశ్వర్ కుమారుడు..
posted on Dec 10, 2020 @ 5:23PM
ఏపీలోని జగన్ ప్రభుత్వం జాస్తి నాగభూషణం ను ఏపీ అడిషనల్ అడ్వకేట్ జనరల్‌గా నియమించింది. ఈయన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ కుమారుడు. అయితే నాగభూషణం చాల కాలంగా జగన్ లీగల్ టీంలో ఒక మెంబర్ గా పని చేస్తున్నారు. అంతేకాకుండా సీఎం జగన్ ప్రధాని మోడీ, హోమ్ మంత్రి అమిత్ షాలను కలిసేందుకు ఢిల్లీ వెళ్లిన సమయంలో ఆ బృందంలో నాగభూషణ్ కూడా ఉండడం అప్పట్లో చర్చనీయాంశం అయింది.
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా రిటైరైన తర్వాత జాస్తి చలమేశ్వర్ కొన్ని నెలల క్రితం.. నరసరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలుతో కలిసి సీఎం జగన్ తో భేటీ కావడం జరిగింది. ఆ భేటీ తర్వాత సీఎం జగన్ కోర్టులపై చేస్తున్న పోరాటంలో ఆయన జగన్ బృందానికి సహకరిస్తున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అంతేకాకుండా సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై ఆరోపణలు చేస్తూ.. సీజేఐకి రాసిన లేఖలోనూ… జాస్తి చలమేశ్వర్ సహకారం ఉందన్న ప్రచారం అప్పట్లో జరిగింది.
ఈ నేపథ్యంలో జాస్తి చలమేశ్వర్ కుమారుడికి ప్రభుత్వ పదవి ఇవ్వడం.. ఇపుడు ఏపీ రాజకీయవర్గాల్లో తీవ్ర ఆసక్తి రేపుతోంది. అయితే జాస్తి నాగభూషణం న్యాయవాది అయినప్పటికీ పెద్దగా పేరు ప్రఖ్యాతులు పొందలేదు... అయనకు పెద్ద పెద్ద కేసులు వాదించిన అనుభవం కూడా లేదని తెలుస్తోంది. అంతేకాకుండా బయటి ప్రపంచానికి అయన జాస్తి చలమేశ్వర్ కుమారుడిగానే పరిచయం. అయినా ఆయనను నేరుగా అడిషనల్ అడ్వకేట్ జనరల్‌గా నియమించడం ఇపుడు అందరిలో ఆసక్తిని రేపుతోంది.