తెలంగాణలో పోటీకి జనసేన సై
posted on Jan 25, 2023 @ 11:01AM
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తేల్చేశారు. ఏపీలోనే కాదు, తెలంగాణ శాసన సభ, లోక్ సభ ఎన్నికల్లోనూ జనసేన పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. నిజానికి గత కొంత కాలంగా జనసేన తెలంగాణలో పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ సంకేతాలు ఇస్తూనే ఉన్నారు. అయినా, అంత క్లారిటీ అయితే లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తేల్చేశారు. పూర్తి క్లారిటీ ఇచ్చారు.
జగిత్యాలలో నిర్వహించిన జనసేన తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వాహకుల సమావేశంలో ఆయన, ఎలాంటి అనుమానం లేకుండా వచ్చే ఎన్నికల్లో 7 నుంచి 14 లోక్ సభ స్థానాల్లో జనసేన పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే, పొత్తుల విషయంలోనూ ఆయన స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో ఎవరైనా పొత్తుకు వస్తే సంతోషం, రాకున్నా ఓకే, ఒంటరిగానే పోటీ చేస్తాం.. జనసేన తెలంగాణ అసెంబ్లీలో అడుగుపెట్టాలి.. కనీసం 10 మంది జన సైనికులు అసెంబ్లీలో ఉండాలనేది, తన ఆకాంక్ష అని అన్నారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక ఆశయం కోసం తాను పోరాడుతున్నట్లు పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రజలకు సందేశం ఇచ్చే స్థాయిలో తాను లేనని, ఇక్కడి ప్రజల నుంచి నేర్చుకునే స్థాయిలో ఉన్నానన్నారు. తెలంగాణ ప్రజలు చేసిన పోరాటాల నుంచి తాను స్ఫూర్తి పొందానన్నారు. ఆలాగే జనసేన తెలంగాణ గడ్డ మీద పుట్టిన పార్టీ అని అంటూ, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో బడుగు బలహీన వర్గాలకు జరిగిన అన్యాయాలను విని తాను గళం విప్పానని గతాన్ని గుర్తు చేస్కున్నారు. అలాగే పరోక్షంగానే అయినా తెలంగాణ ముఖ్యమంత్రి కేసేఆర్ కు సున్నితంగా చురకలంటించారు.
తెలంగాణ రాష్ట్ర సాధన వరకు పోరాటాలు చేసింది, తెలంగాణ సాధించింది తెలంగాణ ప్రజ లే అంటూ, భారాస నేతలు ప్రవచించే, కేసేఆర్ ఒక్కడే చావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించారనే తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టారు. అయితే అదే సమయంలో కొత్తగా వచ్చిన రాష్ట్రం, కొత్త ప్రభుత్వం ఏదో సాధించాలని ముందుకు వెళ్తోంది .. అందుకు నేను ఎదురు చూస్తున్నాను, అంటూ ఓ చిన్న ట్విస్ట్ ఇచ్చారు. ఏపీలో జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించిన రీతిలో కేసేఆర్ ప్రభుత్వాన్నిపవన్ కళ్యాణ్ టార్గెట్ చేయలేదు. అఫ్కోర్స్ అన్నప్రాసన రోజే ఆవకాయ ఆశించలేము అనుకోండి.. ముందు ముందు ఎలా ఉంటుంది అనేది చూడవలసి వుందని పరిశీలకులు అంటున్నారు.
అయితే తెలంగాణలో జనసేనతో ఎవరు పొత్తు పెట్టుకుంటారు. ఏపీలో ప్రస్తుతానికి బీజేపీ జనసేన పొత్తు కొనసాగుతోంది. అదే సమయంలో తెలుగు దేశం, జనసేన పొత్తుకు ఇరు పక్షాల నుంచి సుముఖత వ్యక్త మవుతోంది. ఒక ప్రకటన మినహా మిగిలిన క్రతువంతా ఆల్మోస్ట్ కంప్లీటై పోయిందని పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఈ నేపధ్యంలో తెలంగాణలో పవన్ కళ్యాణ్ ఎవరి మెడలో మూడు ముళ్ళు వేస్తారు, అనేది ఆసక్తికరంగా మారింది. అయితే తెరాస భారాసగా పేరు మార్చుకుని ఏపీలో ఎంట్రీ ఇచ్చిన నేపధ్యం ఒక వైపు కొద్ది రోజుల వ్యవధిలో టీడీపీ, జనసేన తెలంగాణ రాజకీయ వేదిక మీదకు వచ్చిన నేపధ్యం మరోవైపు .. చూస్తుంటే, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజకీయం ముందు ముందు మరింత ఆసక్తి దాయకంగా మారుతుందని అంటున్నారు.