చిరంజీవి మళ్లీ పొలిటికల్ ఎంట్రీ! నాదెండ్ల కామెంట్ల అర్ధమేంటీ?
posted on Jan 27, 2021 @ 4:05PM
ఏపీ రాజకీయాల్లోకి మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇవ్వనున్నారా..? తమ్ముడు వెంటే అనయ్య నడవబోతున్నారా..? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. పంచాయితీ ఎన్నికల వేళ తన వ్యాఖ్యలతో పొలిటికల్ హీట్ పెంచారు జనసేన నేత నాదెండ్ల మనోహార్. విజయవాడలో జరిగిన జనసేన క్రియాశీలక కార్యకర్తల సమావేశంలో మెగాస్టార్ పొలిటికల్ రీ ఎంట్రీపై మనోహర్ కీలక కామెంట్స్ చేశారు. త్వరలో పవన్ కల్యాణ్ వెంట చిరంజీవి రాబోతున్నారని ప్రకటించారు. పవన్ కు అండగా ఉంటామని చిరంజీవి హామీ ఇచ్చారని తెలిపారు.
అంతేకాదు పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి కారణం చిరంజీవేనని చెప్పారు నాదేండ్ల మనోహర్. రెండు మూడేళ్లు సినిమాలు చేసిన తర్వాత రాజకీయాలు చేసుకోవాలని తర్వాత నీ రాజకీయ ప్రస్థానంలో నేను కూడా నీకు అండగా నిలబడతానని.. నీతో కలిసి నడుస్తానంటూ చిరంజీవి పవన్ కు హామీ ఇచ్చారని మనోహర్ తెలిపారు. చిరంజీవి పెరు నాదెండ్ల చెప్పగానే.. జనసేన కార్యకర్తలు, కేరింతలు కొట్టారు. నాదెండ్ల మనోహర్ తాజా కామెంట్స్ ఆంధ్రప్రదేశ్ లో సంచలనంగా మారాయి.
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి చిరంజీవి ఏం చేస్తారన్నదానిపై చర్చ జరుగుతూనే ఉంది. చిరంజీవి జనసేనకు దూరంగా ఉన్నా ఆయన కుటుంబ సభ్యులు మాత్రం పవన్ కు బహిరంగంగానే మద్దతు ప్రకటించారు. నాగబాబు జనసేనలో క్రియాశీలకంగా ఉన్నారు. నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా కూడా పోటీ చేశారు. చిరంజీవి కుమారుడు రామ్ చరణ్.., సోషల్ మీడియాలో జనసేనకు మద్దతు పలకగా.. వరుణ్ తేజ్, నిహారికా నేరుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అల్లు అర్జున్ కూడా జనసేనకు మద్దతుగా ఓ బహిరంగ సభలో పాల్గొన్నారు. చిరంజీవి బహిరంగంగా మద్దతు పలకకపోయినా.., తమ్ముడికి నైతికి మద్దతు ఇస్తూనే ఉన్నారు. జనసేన వైపు ఉండాలని అభిమాన సంఘాలకు సూచించారు.
మెగాస్టార్ కు రాజకీయాలు కొత్త కాదు. గతంలో ఆయన ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు. కేంద్రమంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తించారు. తర్వాత తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి రాజకీయాలకు దూరమయ్యారు చిరంజీవి. పవన్ పార్టీ ప్రకటించినప్పుడు కూడా.. ఎన్ని ఒత్తిళ్లు, విమర్శలు వచ్చినా ఆయన తన పొలిటికల్ రీఎంట్రీకి సంబంధించి నోరెత్తలేదు. అయితే నాదెండ్ల మనోహార్ తాజా వ్యాఖ్యలతో పవన్ పార్టీకి చిరంజీవి మద్దతుపై మెగా అభిమానులకు ఫుల్ క్లారిటీ వచ్చిందని చెబుతున్నారు. ఇక్కడ తోడుగా రావడం అంటే పవన్ కు మద్దతుగా చిరంజీవి జనసేనలో చేరటం ఖాయమేనని చెబుతున్నారు. కాస్త లేట్ అయిన చిరు మళ్లీ పొలిటిక్స్ లో రీ ఎంట్రీ ఇస్తారని భావిస్తున్నారు.
మరోవైపు రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు, త్వరలో జరగనున్న తిరుపతి ఉపఎన్నికల నేపథ్యంలో ఇతర పార్టీల్లో ఉన్న మెగా అభిమానులను జనసేన వైపు తిప్పడానికి మనోహర్ ఇలా మాట్లాడి ఉంటారా అనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.