జానారెడ్డి సైలెన్స్ వ్యూహమేంటి?
posted on Aug 25, 2023 @ 11:38AM
తెలంగాణ కాంగ్రెస్ లో పరిచయం ఏ మాత్రం అక్కర్లేని పేరు ఏదైనా ఉందంటే అది జానారెడ్డి. పార్టీ సీనియర్ నేత, సీఎల్పీ మాజీ నాయకుడు, మాజీ మంత్రి జానారెడ్డి పొలిటికల్ సైలెన్స్ ఆ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయదలచుకున్న వారి నుంచి పార్టీ దరఖాస్తులు కోరింది. అయితే జానారెడ్డి మాత్రం ఇప్పటి వరకూ దరఖాస్తు చేసుకోలేదు. అసలు ఆయన ఎన్నికల బరిలో నిలుస్తారా? నిలవరా అన్న అనుమానాలు పార్టీ వర్గాలలో బలంగా వ్యక్తం అవుతున్నాయి.
ప్రస్తుతం నాగార్జున సాగర్ నియోజకవర్గ ఇన్ చార్జిగా ఉన్న జానా రెడ్డి.. పోటీ విషయంలో మౌనంగా ఉండటం రాజకీయవర్గాలలో చర్చనీయాంశంగా మారింది. జానారెడ్డి ఇన్ చార్జిగా ఉన్న నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి ఆయన చిన్న కుమారుడు జై వీర్ రెడ్డి పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడానికి దరఖాస్తు చేసుకున్నారు. ఇక ఆయన పెద్ద కుమారుడుఅయితే ఆ స్థానంలో చిన్న కొడుకు జై వీర్ రెడ్డి గురువారం దరఖాస్తు చేయడంతో జనారెడ్డి నాగార్జున సాగర్ నుంచి పోటీ చేస్తారా? చేయరా? అనే అనుమానాలు పార్టీలో మొదలయ్యాయి. అప్లికేషన్‌కు శుక్రవారం ఆఖరి రోజు కావడంతో చాలా మంది నేతలు జానారెడ్డి నిర్ణయంపై ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
ఇక జానారెడ్డి పెద్ద కుమారుడు రఘువీర్ రెడ్డి మిర్యాలగూడ టిక్కెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీంతో జానారెడ్డి పోటీకి దూరంగా ఉంటారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ల దరఖాస్తు గడువు శుక్రవారం ( ఆగస్టు 25)తో ముగుస్తుంది. ఆ రోజు శ్రావణ శుక్రవారం పర్వదినం కూడా కావడంతో ఆశావహులు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నవారిలో రేవంత్ రెడ్డి, జీవన్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్ అలీ, రఘు వీర్, రమ్యారావు తదితరులు ఉన్నారు. మొత్తం మీద పోటీ విషయంలో జానా మౌనం కాంగ్రెస్ వర్గాలలో తీవ్ర ఉత్కంఠకు కారణమౌతోంది.