కాల్పులతో అట్టుడుకుతున్న కాశ్మీర్..
posted on Sep 12, 2016 @ 10:35AM
ఇప్పటికే కాశ్మీర్ అల్లర్లతో అట్టుడుకుతుంటే మరోవైపు జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో నిన్నటి నుండి కాల్పుల కలకలం రేగుతుంది. రాష్ట్రంలో పలుచోట్ల ఎన్ కౌంటర్లు జరిగాయి. పూంచ్ జిల్లాలో దాక్కున్న ఉగ్రవాదులు అక్కడ ఉన్న భద్రతా బలగాలపై కాల్పులు జరపడంతో ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. అనంతరం ఉగ్రవాదులు ఒక ఇంట్లోకి ప్రవేశించి వృద్ధ జంటను బందీలుగా తీసుకున్నారు. దీంతో సైన్యానికి చెందిన మెరుపు దళాలు రంగప్రవేశం చేసి, ఉగ్రవాదులపై ప్రతిదాడిని ప్రారంభించాయి. వృద్ధ జంటను క్షేమంగా విడిపించాయి. ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఒక కానిస్టేబుల్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. మరో ఆరుగురు బద్రతాదళ అధికారులు గాయపడ్డారు. కాగా మూడు వేరువేరు ప్రదేశాల్లో చొరబాటుకు యత్నించిన నలుగురు ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది. ఈరోజు మళ్లీ పూంచ్ ప్రాంతంలో మరోసారి ఉగ్రవాదులు కాల్పులతో తెగబడ్డారు. దీంతో భద్రతా దళాలు ఎదురుకాల్పులకు దిగాయి. మినీ సచివాలయం వద్ద ఈ ఎన్ కౌంటర్ కొనసాగుతోంది.