బలాన్నిచ్చే బెల్లం
posted on Apr 7, 2016 @ 10:32AM
ఎక్కువగా స్వీట్స్ ఇష్టపడేవాళ్ళు తీపి తింటే లావుగా అయిపోతామని భయపడుతూ ఉంటారు. అవే స్వీట్స్ బెల్లంతో చేస్తే ఆ ప్రమాదం చాలా మటుకు తగ్గుతుందని చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు. బెల్లం పంచదారకన్నా అన్నివిధాల మేలు అని ఇప్పటికే ఎన్నో ప్రయోగాలు తెలియచేసాయ్. మనం అన్నం తినగానే చిన్న బెల్లం ముక్క తింటే అరుగుదల బాగుంటుందిట, అందుకేనేమో మన పెద్దవాళ్ళు అలా తినేవారు.
అంతేకాదు బెల్లంతో కలిగే ప్రయోజనాలు తెలుసుకుంటే, ఇన్ని ఉన్నాయా అని ఆశ్చర్యం కలగక మానదు.
బెల్లానికి ఉన్న ప్రధాన లక్షణం రక్తాన్ని శుద్ది చేయటం. బెల్లాన్ని తరచూ తినటం వల్ల అది రక్తంలో ఉన్న దోషాలని తీసిపారేసి మనం ఆరోగ్యంగా ఉండటానికి దోహదపడుతుంది. అంతేకాదు రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.
ఒంట్లో నీరసంగా ఉన్నప్పుడు కాస్తంత బెల్లం తింటే చాలు మళ్లీ పోయిన శక్తి పుంజుకొస్తుంది. ఎందుకంటే ఇందులో ఉండే కార్బోహైడ్రేట్ లు రక్తంలో త్వరగా ఇంకిపోయి మనిషికి బలాన్నిస్తాయి.
దగ్గుగా ఉన్నప్పుడు తీపి తింటే అది ఇంకా ఉదృతం అవుతుంది. కాని బెల్లంలో అల్లం, తేనే కలిపి పరగడుపునే తీసుకుంటే దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది.
బెల్లంలో ఐరన్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల అది ఎముకులకి, కీళ్లకి ఎంతో మేలు చేస్తుంది. రోజులో కనీసం 10 గ్రాముల బెల్లం తిన్నా చాలు (అంటే చిన్న ముక్క) లేదా గ్లాసు పాలల్లో బెల్లం కలుపుకుని తాగినా ఆర్థరైటిస్ లాంటి వాటిని కూడా దూరం చేస్తుంది.
అతిగా ఎక్కిళ్ళు వచ్చేవారు బెల్లంలో అల్లంరసం కలుపుకుని తాగితే ఉపశమనం కలుగుతుంది. ఇది శ్వాస సంబందిత సమస్యలను కూడా తాగిస్తుంది.
బెల్లంలో పొటాషియం, సోడియంల శాతం ఎక్కువగా ఉండటం వల్ల అది ఆసిడ్ లెవెల్స్ ని సరైన స్థాయిల్లో ఉండేలా చూసి బిపి ని తగ్గిస్తుంది.
ఎండాకాలంలో మన కడుపు చల్లగా ఉండాలంటే బెల్లం షర్బత్ తాగితే చాలు. వేసవిలో వచ్చే అతివేడిని బెల్లం తగ్గించగలదు.
ఆడవాళ్ళకి నెలసరి సమయంలో వచ్చే కడుపునొప్పికి బెల్లం ఒక దివ్యౌషదం. అలాంటి సమయంలో ఒకొక్కరికి అతిగా ఉద్రేక పడటం లేదా విపరీతమైన నీరసం మొదలైన సమస్యలు (PMS సమస్యలు) ఉంటాయి, అవన్నీ బెల్లం తీసుకోవటం వల్ల క్రమంగా తగ్గుతాయి.
రెండు వంతుల బెల్లంలో ఒక వంతు ఆవునెయ్యి కలుపుకుని పరగడుపునే తింటే మామూలు తలనొప్పులే కాదు మైగ్రైన్ లాంటి మొండి తలనొప్పులు కూడా పోతాయి.
పొడి దగ్గు ఉన్నవాళ్ళు కొబ్బరిలో బెల్లం కలిపి కొబ్బరి ఉండల్లా తింటే దగ్గు తగ్గుతుంది. కొబ్బరి తింటే దగ్గు పెరుగుతుందని చాల మంది అనుకుంటారు. కాని ఈ బెల్లం కొబ్బరుండల వల్ల దగ్గు తగ్గుతుందో లేదో మీరే టెస్ట్ చేసి చూడండి చాలు.
వేసవిలో వచ్చే పండగలైన ఉగాదికి, శ్రీరామనవమికి పానకం పంచిపెట్టటానికి ఒక కారణం ఉంది. నీళ్ళల్లో బెల్లం, మిరియాలు, యాలకులు వేసుకుని ఆ పానకం తాగితే చాలా చలవ చేస్తుంది. మన పెద్దవాళ్ళు ఏం చేసినా మనమంచికే అని మరోసారి నిరూపించారు కదా.
ఇది అసలే కొత్త సంవత్సరం మొదలయ్యే సమయం. కొత్త ఏడాదితో పాటు కొత్త బెల్లం వచ్చే సమయం. మరెందుకు ఆలస్యం, బెల్లం తినాలన్నా కొత్త నిర్ణయాన్ని కూడా తీసేసుకోండి మరి ఆలస్యం ఎందుకు....
----కళ్యాణి