విప్ జారీపై పరిశీలన..జగన్ వర్గంపై ఇక వేటే
posted on Jan 31, 2012 8:00AM
హైదరాబాద్: గీత దాటిన జగన్ వర్గంలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 16 మందినీ శాసనసభ్యత్వాలకు అనర్హులుగా ప్రకటించాలంటూ ప్రభుత్వ విప్ కొండ్రు మురళీ మోహన్ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరిగింది. కొండ్రు మురళీ తన న్యాయవాదితో పాటు స్పీకర్ మనోహర్ ఎదుట హాజరయ్యారు. స్పీకర్ కోర్టులో ముందుగా భగవద్గీత మీద నిజమే చెబుతానని ప్రమాణం చేసిన కొండ్రు నాడు అసెంబ్లీలో నవంబర్ 5న జరిగిన ఓటింగ్‌లో అనుసరించాల్సి విధానం గురించి అధికార పార్టీ శాసనసభ్యులందరికీ స్పష్టమైన సమాచారం ఇచ్చామని వివరించారు.కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరికీ ఈ మేరకు విప్ జారీ చేశామని వివరించారు. జగన్ వర్గానికి చెందిన 16 మందిలో 13 మంది విప్ తీసుకున్నారని మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కాపు రామచంద్రారెడ్డి, చెన్నకేశవరెడ్డి, ప్రసాదరాజు మాత్రం విప్‌ను తీసుకునేందుకు అందుబాటులో లేరని వివరించారు. కాగా చెన్నకేవశరెడ్డి, ప్రసాదరాజుల నివాసాలకు విప్ పత్రాలను అతికించామని చెప్పారు. ఇందులో పాల్గొన్న సిబ్బంది వాంగ్మూలాన్ని కూడా స్పీకర్ మనోహర్ నమోదు చేసుకున్నారు. కాగా కాపు రామచంద్రారెడ్డికి అసెంబ్లీ ప్రారంభానికి ముందు లాబీల్లోనూ అసెంబ్లీ లోపల పార్టీ విధానం ఏమిటో వివరించామని తనకు విప్ గురించి తెలుసునంటూ అందరు శాసనసభ్యుల ముందే అంగీకరించారని స్పీకర్ మనోహర్‌కు మురళీ వివరించారు.
విప్‌ను ధిక్కరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసిన తర్వాత మీడియాతో రామచంద్రారెడ్డి మాట్లాడారని తాను అనర్హత వేటుకు సిద్ధంగా ఉన్నానని ఉప ఎన్నికలు వస్తే 50 వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తానంటూ ప్రకటన చేశారని అందుకు సంబంధించిన పత్రికా క్లిప్పింగులు కూడా ఉన్నాయంటు వాటిని అందజేశారు. మిగిలిన 13 మంది విప్‌లను స్వీకరించినట్లుగా సంతకాలు కూడా చేశారని వివరించారు. గతంలో వారు పార్టీ విధివిధానాల మేరకు నడుచుకుంటామని ప్రమాణం చేసి కాంగ్రెస్ సభ్యత్వాలను స్వీకరించారని సీఎల్పీ సమావేశాలకు కూడా హాజరయ్యారని మురళీ వివరించారు. విప్‌లకు సంబంధించి మురళి చెప్పినందంతా స్పీకర్ మనోహర్ నమోదు చేసుకున్నారు. ఎవరెవరికి ఎప్పుడెప్పుడు విప్‌లను జారీ చేశారు. టెలిగ్రామ్‌లు ఎన్ని గంటలకు ఇచ్చారో.. అవి ఎప్పుడు చేరాయో కూడా నమోదుచేసుకున్నారు. ఈ 16 మందికి సంబంధించి విడివిడిగా ఫైళ్లను సిద్ధం చేసిన స్పీకర్ మనోహర్ అనర్హత వేటు ప్రక్రియపై కసరత్తును ప్రారంభించారు. రెండో తేదీ నాటికి కాపు రామచంద్రారెడ్డి వ్యవహారంపై తుది నిర్ణయానికి వచ్చే వీలుంది.
ఇక.. సోమవారం ఉదయం పీఆర్పీ విప్ వంగా గీత కూడా స్పీకర్ ముందు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ .. వ్యక్తిగత కారణాల వల్ల తనకు రెండు రోజుల సమయం కావాలని ఆమె అభ్యర్థించారు. ఇలా వంగా గీత వాంగ్మూలం కూడా రికార్డు చేశాక.. అనర్హత విషయమై స్పీకర్ మనోహర్ తుది నిర్ణయం తీసుకునే వీలుంది. ఫిబ్రవరి 8లోగా జగన్ వర్గం ఎమ్మెల్యేలపై స్పీకర్ మనోహర్ తన తుది నిర్ణయాన్ని ప్రకటించే వీలుందని అంటున్నారు.