రాష్ట్ర విభజనకు జగన్ మద్దతు.. జైరాం రమేష్
posted on Oct 17, 2022 @ 10:42AM
ఏపీ సీఎం జగన్ నాడు రాష్ట్ర విభజనకు సంపూర్ణ మద్దతు ఇచ్చారని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ అన్నారు. రాష్ట్ర విభజనకు సంపూర్ణ మద్దతు ఇస్తూ జగన్ అప్పటి కేంద్ర హోంమంత్రికి లేఖ రాశారని గుర్తు చేశారు. తాను బళ్లారి పర్యటనలో ఉండటంతో ప్రస్తుతం ఆ లేఖ విడుదల చేయలేకపోతున్నారని.. త్వరలోనే విడుదల చేస్తాననీ పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఏపీలో ప్రవేశిస్తున్న నేపథ్యంలో విజయసాయి చేసిన వ్యాఖ్యలకు సమాధానంగా జైరాం రమేష్ ఈ విషయాలు చెప్పారు. రాహుల్ భారత్ జోడో యాత్ర వల్ల ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ఒరిగేది ఏమీ లేదనీ.. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన విషయాన్ని రాష్ట్ర ప్రజలు రాహుల్ కు గుర్తు చేయాలంటూ విజయసాయి ట్వీట్ చేయడంపై జై రాం రమేష్ స్పందించారు.
అప్పటి హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేకు డిసెంబర్ 28న 2012న అప్పటి వైసీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ నేత ఎంవీ మైసురారెడ్డి, సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు కేకే మహేందర్‌రెడ్డి రాసిన లేఖను సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. ఆ లేఖలో 2011 జులై 8,9 తేదీలలో జరిగిన వైసీపీ ప్లీనరీలో తీసుకున్న నిర్ణయం మేరకు తెలంగాణ ప్రజల మనోభావాలను తమ పార్టీ గౌరవిస్తోందనీ, రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచడం, లేదా విభజించడంపై నిర్ణయం తీసుకునే అధికారం కేంద్రానిదేననీ పేర్కొన్నారు.