జగన్ బీసీ కార్డ్ సెల్ఫ్ గోలేనా?
posted on Jun 20, 2023 @ 9:31AM
కర్నాటకలో బీజేపీ ఓటమి తర్వాత ఆ పార్టీ పట్ల ఏపీ సీఎం జగన్ రెడ్డి వైఖరి మారుతోందా? బీజేపీ దూకుడుకు బ్రేకులు వేసేందుకు పావులు కదుపుతున్నారా? ఇందు కోసం వ్యూహాత్మకంగా బీసీ కార్డును తెరపైకి తెచ్చారా ?అంటే అందుకే బీసీ కార్డుతో బీజేపీ దూకుడుకు బ్రేకులు వేసే వ్యూహానికి తెరలేపారా? అంటే పరిఇశీలకులు ఔననే అంటున్నారు.
అయితే నాలుగేళ్ల పాటు బీజేపీ మాటే వేదం అన్నట్లుగా వ్యవహరించిన జగన్ ఇప్పుడు బీజేపీకి చెక్ పెట్టేందుకు చేస్తున్న వ్యూహరచన ఫలిస్తుందా అంటే అనుమానమే అని అంటున్నారు. ఏమైతేనేం.. కేసుల భయమో, మరోటో కానీ అధికారంలో ఉన్న ఈ నాలుగేళ్ల కాలంలోనూ బీజేపీ అడుగులకు మడుగులొత్తుతూ.. స్వామి కార్యం, స్వ కార్యం నెరవేర్చుకున్న జగన్ ఇప్పుడు ఎన్నికల సంవత్సరంలో ఆ పార్టీకి చెక్ పెట్టేందుకు పన్నుతున్న వ్యూహాలు బూమరాంగ్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు. ఇంతకీ బీజేపీ దూకుడుకు చెక్ పెట్టేందుకు బీసీ రిజర్వేషన్ బిల్లును తెరపైకి తీసుకువచ్చారని పరిశీలకులు అంటున్నారు. బీజేపీకి బీసీలను దూరం చేయాలన్న వ్యూహాన్ని జగన్ తలకెత్తుకున్నారనీ, కేంద్రంలో ఉన్న 27 మంది బీసీ మంత్రులూ పనికిరాని వాళ్లంటూ బీసీ నేత కృష్ణయ్య విమర్శ వెనుక ఉన్న ఎత్తుగడ ఇదేననీ విశ్లేషిస్తున్నారు.
కేంద్రంలోని మోడీ సర్కారు బీసీలకు అన్యాయం చేస్తోందని వైసీపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య విమర్శించడం మామూలు విషయం కాదని అంటున్నారు. పేరుకు మాత్రమే బీసీ అయిన మోడీ క్యాబినెట్‌లో ఉన్న 27 మంది బీసీ మంత్రులు పనికిమాలిన వాళ్లేనని కృష్ణయ్య విమర్శించారు. దేశంలోని 75 కోట్ల బీసీలకు బీజేపీ ప్రభుత్వం చేసిందేమిటని నిలదీశారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బీసీలకు రెండు లక్షల కోట్ల బడ్జెట్ ఇవ్వకపోతే ధర్నా చేస్తామని హెచ్చరించారు. అంతే కాకుండా అన్ని రాష్ట్రాల్లో పర్యటించి బీసీలను ఏకం చేస్తామన్నారు. బీసీల రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే కూడా మద్దతునిచ్చారని కృష్ణయ్య చెప్పారు. నాలుగేళ్లుగా కేంద్రంలోని మోడీ సర్కార్ ఆశీస్సులతో ఔను కేంద్ర ప్రభుత్వం ఆశీస్సులతోనే ఏపీలో బండి లాగించేస్తున్న జగన్ పార్టికి చెందిన ఎంపీ కృష్ణయ్య కేంద్రానికి అల్టిమేటమ్ ఇచ్చారంటే.. కేంద్రంతో జగన్ సర్కార్ కు ఉన్న సత్సంబంధాల్లో ఏదో తేడా కొట్టినట్టేనని పరిశీలకలు అంటున్నారు.
ఎందుకంటే వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరూ కూడా జగన్ అనుమతి లేకుండా నోరు మెదపడానికి సాహసించరు. అలా సాహసించిన వారు పార్టీలో ఉండరు. మరి బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కేంద్రంలోని బీజేపీ సర్కారు వైఫల్యాలనూ, చేతగాని తనాన్నీ వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య చెరిగేయడం వెనుక జగన్ అనుమతి ఉందనే అంటున్నారు. ఎందుకంటే కృష్ణయ్య బీసీ రిజర్వేషన్ల గురించి చేసిన వ్యాఖ్యలు, కేంద్రానికి ఇచ్చిన అల్టిమేటమ్ వ్యక్తిగత స్థాయిలో ఇచ్చిందే అనుకున్నా.. ఆయన నోటి వెంట కేంద్రంలోని మోడీ సర్కార్ పై విమర్శలు వచ్చిన వెంటనే వైసీపీ అధికారికంగా వాటిని ఖండించి ఉండాలి. అది పార్టీ అభిప్రాయం కాదనీ, కృష్ణయ్య వ్యక్తిగత హోదాలో చేసిన వ్యాఖ్యలనీ స్పష్టత ఇచ్చి ఉండాలి. కానీ ఇప్పటి వరకూ అటువంటిదేమీ జరగలేదు. అంటే జగన్ అనుమతితోనే కృష్ణయ్య మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా గళమెత్తారని భావించాల్సి వస్తోంది.
ఇదే విషయం బీజేపీలో హాట్ టాపిక్ గా మారింది. అమిత్ షా, నడ్డాలు ఏపీ వచ్చి మరీ జగన్ పార్టీపై నిప్పులు చెరిగి వెళ్లిన తరువాత ఇరు పార్టీల మధ్యా అగాధం ఏర్పడిందనడానికి కృష్ణయ్య వ్యాఖ్యలు కూడా ఒక నిదర్శనంగా పరిశీలకులు చెబుతున్నారు. ఇక కృష్ణయ్య బీసీ అయిన మోడీని నామ్ కేవాస్తేగా ప్రధానిని చేశారంటూ వ్యాఖ్యానించడంపై పార్టీ అగ్రనాయకత్వం చాలా చాలా సీరియస్ గా ఉంది. వైసీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య వ్యాఖ్యల వెనుక, ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి ఆదేశాలున్నాయన్న చర్చ బీజేపీలో జరుగుతోంది. తనకు కేంద్రంలోని బీజేపీ సర్కార్ మద్దతు అవసరం లేదని ఇటీవల జగన్ వ్యాఖ్యానించడాన్ని వారీ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. తన సర్కార్ పై అవినీతి ముద్ర వేసి విమర్శించిన షా, నడ్డాలకు బీసీ బాణం సంధించిన జగన్ ఇందుకు కాంగ్రెస్ మద్దతు కూడా ఉందని చెప్పడం భవిష్యత్ లో తాను తీసుకోబోయే టర్న్ కు చిహ్నంగా బీజేపీ భావిస్తోంది.
బీసీ బీజేపీ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. బీజేపీ టీడీపీ లు దగ్గరౌతున్న సంకేతాలు వస్తున్న ఈ సమయంలో బీసీలకు బీజేపీ అన్యాయం చేస్తోందన్న విమర్శలు రాజకీయంగా పూడ్చుకోలేని నష్టం చేకూర్చే అవకాశాలున్నాయని వైసీపీ వర్గాలు అంటున్నాయి. ఒక విధంగా జగన్ బీసీ కార్డ్ ప్రయోగించి బీజేపీని ఇరుకున పెడదామన్న వ్యూహం సెల్ఫ్ గోల్ వంటిదేనని పార్టీ శ్రేణుల్లోనే ఓ స్థాయిలో చర్చ జరుగుతోంది.