స్వాహాయజ్ణంలో జగన్ సర్కార్ స్టైలే వేరు!
posted on Jul 14, 2023 @ 11:13AM
వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఈ రాష్ట్రంలో ఆర్థిక నిర్వహణ అస్తవ్యస్థంగా తయారైంది. ఏ ప్రాజెక్టు తీసుకున్నా, ఏ పథకాన్ని చూసినా అవినీతే రాజ్యమేలుతోంది. దోపిడీ కోసం ఏకంగా కార్పొరేషన్ ల ద్వారా ప్రభుత్వ గ్యారంటీతో రుణాలు తీసుకోవడం గతంలో ఎన్నడూ చూడని కొత్త స్టైల్. ప్రభుత్వ తాజాగా రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరుతో భారీ దోపిడీకి పాల్పడిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కరువు నివారణ అంటూ కార్పొరేషన్ పేర అప్పులు తీసుకువచ్చి ఆ రుణాల సొమ్మును ప్రైవేటు ఖాతాలకు మళ్లించారంటూ తెలుగుదేశం సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. ఒక్క ఈ రూపేణా దాదాపు 900 కోట్ల రూపాయలు దారి మళ్లాయని కేశవ్ ఆరోపిస్తున్నారు. నిధుల దోపిడీ విషయంలో ఏపీ సర్కార్ కొత్త పుంతలు తొక్కుతోందన్నారు. అప్పుల సొమ్ముతోనూ స్కామ్ చేయడం ఒక్క జగన్ సర్కార్ కే చెల్లిందని పబ్లిక్ అక్కౌంట్స్ కమిటీ చైర్మన్ కూడా అయిన పయ్యావుల కేశవ్ అన్నారు. గురువారం (జూలై 13) విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన పయ్యావుల కేశవ్ రుణాల సొమ్ముదారి మళ్లింపు స్కాంపై సీబీఐ విచారణ కు డిమాండ్ చేశారు. రాయలసీమలో కరువు నివారణ కోసం అంటూ ఏర్పాటు చేసిన కార్పొరేషన్ పేరుతో ఎలక్ట్రో మెకానికల్ వర్క్స్ నిమిత్తం అప్పు చేసింది. అసలా పనులు చేపట్టకుండానే.. పూర్తై పోయాయని చెబుతున్నారు. తీసుకున్న రుణానికి చెల్లింపులూ జరిపేస్తున్నారు. ఆ రుణానికి ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చింది.
అ రుణం 900 కోట్ల రూపాయలూ నేరుగా కాంట్రాక్టర్ కు చెల్లించారు. విషయమేమిటంటే.. ప్రభుత్వం ఈ యేడాది మార్చి 29న బ్యాంక్ గ్యారెంటీ ఇస్తూ గెజిట్ జారీ చేస్తే మూడు రోజుల్లో రుణం మంజూరైపోయింది. అయితే ఆ సొమ్ములు కార్పొరేషన్ ఖాతాలోకి రాకుండానే నేరుగా కాంట్రాక్టర్ కు బదలీ అయిపోయాయి. ఏ పనుల నిమిత్తం అయితే రుణం తీసుకున్నారో ఆ పనులు జరగనే లేదు. అయినా పనులు పూర్తైపోయాయంటూ సర్కార్ సర్టిఫై చేసేసింది. అప్పుల సొమ్మును కూడా స్వాహా చేసే భారీ కుంభకోణం జగన్ సర్కార్ లో జరుగుతోందనీ.. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలనీ పయ్యావుల కేశవ్ డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి తీసుకున్న రుణం ప్రభుత్వ ఖాతాలో జమ కాకుండానే నేరుగా కాంట్రాక్టర్ కు చెల్లింపు అయిపోయింది. ఇప్పుడీ రుణాన్ని ప్రభుత్వ తన ఖాతాల నుంచి చెల్లిస్తున్నది. పయ్యావుల కేశవ్ డిమాండ్ చేస్తున్నట్లు ఈ స్కాంపై సీబీఐ విచారణకు ఆదేశిస్తే ప్రభుత్వ అప్పుల కుంభకోణాలన్నీ బయటపడతాయని పరిశీలకులు అంటున్నారు. అసలు జగన్ ప్రభుత్వాన్ని నడపడానికి పూర్తిగా అప్పులపైనే ఆదారపడుతున్నారు. దశలవారీ సంపూర్ణ మద్య నిషేధం అంటూ ప్రారంభించి రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్ గా మార్చేసేందుకు ఒప్పందాలు కుదుర్చుకుని మరీ అప్పులు తీసుకువస్తున్నారు. భవిష్యత్ లో మద్యంపై వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి మరీ అప్పులు తీసుకువస్తున్నారు.
తాజాగా మద్యం తాకట్టు ద్వారా మరో 8 వేల కోట్ల రూపాయల రుణం తీసుకోవడానికి రెడీ అయిపోయారు. మొత్తంగా ఒక్క చాన్స్ అభ్యర్థనతో అధికారంలోకి వచ్చిన జగన్ మరో చాన్స్ దక్కదన్న నిర్ణయానికి వచ్చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడమే ధ్యేయంగా నిర్ణయాలు తీసుకుంటున్నారనిపిస్తోందన్న విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తం రుణాలతో ప్రభుత్వాన్ని నడుపుతూ రాష్ట్ర అభివృద్ధిని పాతాళానికి పంపేశారన్న విమర్శలు వినవస్తున్నాయి.