ఐదేళ్లూ కొనసాగే ధైర్యం తగ్గు! ముందస్తుకే జగన్ మొగ్గు?
posted on Jul 11, 2022 @ 3:55PM
ఏపీ సీఎం జగన్ ముందస్తుకే మొగ్గు చూపుతున్నారా? వాగ్దానాల అమలు నుంచి ప్రతి విషయంలోనూ వెల్లువెత్తుతున్న ప్రజా వ్యతిరేకత ఆయనకు ఊపిరి సలపనివ్వడం లేదా? మిగిలిన రెండేళ్లు అధికారంలో కొనసాగితే ప్రజాగ్రహం మరింత ప్రజ్వరిల్లుతుందని భయపడుతున్నారా? అంటే పరిశీలకులు మాత్రం అవుననే సమాధానం ఇస్తున్నారు.
కేంద్రంతో అంటకాగి అప్పులు సంపాదించుకుని ఏదోలా నెట్టుకొస్తున్నా... అది మరింత కాలం కొనసాగే పరిస్థితి కనిపించడం లేదని పార్టీ శ్రేణులు సైతం అంతర్గత సంభాషణల్లో అంగీకరిస్తున్నారు. ఇక ప్రజా నిరసనల సెగలో మాడిపోతున్న ఎమ్మెల్యేలు, మంత్రులలో అత్యధికులు పార్టీ అధినేత తీరు పట్ల తమ వ్యతిరేకతను బాహాటంగా వెళ్లగక్కడానికి సంకోచించడం లేదు. పోనీ ప్లీనరీలోనైనా ప్రజా వ్యతిరేకతను తగ్గించడానికీ, తిరిగి ప్రజల అభిమానాన్ని చూరగొనడానికి ఏమైనా వ్యూహరచన లేదా కార్యాచరణపై చర్చ జరిగిందా అంటే అదీ లేదు. పైగా రాష్ట్రంలో 175కు 175 అసెంబ్లీ స్థానాలలో వైసీసీ విజయం కష్ట సాధ్యం కాదు.. సులభ సాధ్యమే అంటూ అధినేత పాత పాటే పాడటంతో వైసీపీ శ్రేణుల్లో ఈయన సీతయ్యే ఎవరి మాటా వినడంటూ పెదవి విరుస్తున్నారు. అమరావతి నుంచి ఆరంభిస్తే.. ఈ మూడేళ్లలో ఆయన మాట తప్పని అంశం లేదు. మడమ తిప్పనిసందర్భం లేదన్న విమర్శలు రాజకీయ వర్గాలలోనే కాదు సామాన్య జనంలోనూ వినిపిస్తున్నాయి.
రాష్ట్రంలోని నిరుపేదలకు 25 లక్షల ఇళ్లు కట్టించి ఇస్తామని ఎన్నికల ముందు గొప్పగా ఇచ్చిన హామీని తుంగలో తొక్కేశారు. రైతన్నలకు చెప్పిన ఉచిత బోర్లు మాట పూర్తిగా విస్మరించారు. మూడేళ్లుగా ఏపీలోని రోడ్ల దుస్థితిని పట్టించుకున్న పాపాన పోలేదు. అమ్మ ఒడికి కొర్రీలు, కోతలతో లబ్ధిదారుల విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఉద్యోగ క్యాలెండర్ ఊసే లేదు. డీఎస్సీ హామీకి తిలోదకాలొదిలేశారు. ఆర్థిక అరాచకత్వాన్ని పరాకాష్టకుతీసుకుపోయారు. ఇలా చెప్పుకుంటూ పోతే.. జగన్ మూడేళ్ల పాలన అంతా మాట తప్పడం, మడమ తిప్పడం వినా మరో ఘనత లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఐదేళ్ల పదవీ కాలం పూర్తయ్యే వరకూ ఇదే విధానంలో కొనసాగితే ఎన్నికలలో విజయం సులభ సాధ్యం కాదన్న అనుమానం అధినేతలోనే వ్యక్తం అవుతోందని పార్టీ శ్రేణులే అంటున్నాయి.
అందుకే ముందస్తుకే జగన్ మొగ్గు చూపుతున్నారంటున్నారు. ప్లీనరీ సందర్భంగా వచ్చే ఎన్నికలలో విజయం గురించి జగన్ మాట్లాడడమే ఆయన ముందస్తుకే మొగ్గు చూపుతున్నారన్న సంగతి అవగతమైపోయిందని పరిశీలకులు అంటున్నారు. లేకుంటే ఎన్నికలకు మరో రెండు సంవత్సరాలు సమయం ఉండగా అన్ని స్థానాలలోనూ విజయమే లక్ష్యం అన్న ప్రకటన పార్టీ ప్లీనరీ వేదికగా చేయాల్సిన అవసరం ఉండదని అంటున్నారు. అంతే కాకుండా ముందు ముందు పరిస్థితిని బేరీజు వేసుకుంటే ముందస్తే బెటరని జగన్ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కూడా సలహా ఇచ్చారని చెబుతున్నారు. ఒక పక్కన ఏపీలోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంటుందని, మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూనే ముందస్తు ఎన్నికలకు తొందరపడటం జగన్ లో ఓటమిపై గూడుకట్టుకున్న భయానికి తార్కాణమన్న విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి.
ఒక వైపె పార్టీలో పెచ్చరిల్లుతున్న అసంతృప్తి, అసమ్మతి, మరో వైపు ప్రభుత్వంపై ప్రజలలో రోజు రోజుకూ పెరుగుతున్న వ్యతిరేకతతో జగన్ ఇవి మరింత పెరిగి పార్టీ పుట్టి ముంచేలోగానే.. ఏదో విధంగా సంక్షేమ కార్యక్రమాలను నెట్టుకువస్తున్న సమయంలోనే ముందస్తుకు వెళ్లి ఎలాగోలా వచ్చే ఎన్నికల్లో గట్టెక్కాలని భావిస్తున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ సామాజిక న్యాయ భేరి పేర మంత్రుల బస్సు యాత్రలలో ఎదురైన ప్రజా వ్యతిరేకత అదే సమయంలో తెలుగుదేశం ‘బాదుడే బాదుడు’ కార్యక్రమాలకు, పార్టీ అధినేత చంద్రబాబు నిర్వహిస్తున్న జిల్లాల పర్యటనలకు వస్తున్న స్పందనతో జగన్ ఈనఫ్ ఈజ్ ఇనఫ్.. మనపై వ్యతిరేకత మరింత పెరిగే లోగా, అలాగే తెలుగుదేవం పట్ల ప్రజాభిమానం మరింత ఎక్కువ కాకుండా ముందస్తుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.
జగన్ ఉద్దేశానికి అనుగుణంగానే పీకే బృందం ఇప్పటికే జిల్లాల వారీగా నియోజకవర్గాలలో అభ్యర్థుల ఎంపిక కసరత్తు మొదలెట్టేసిందని చెబుతున్నారు. సిటింగ్ వైసీపీ ఎమ్మెల్యేల పట్ల ప్రజల్లో ఉన్న స్పందన పసిగట్టేందుకే ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని పీకే టీమ్ రూపొందించింటున్నారు. ఈ కార్యక్రమంలో ఇప్పటికే పలువురు సిటింగ్ ఎమ్మెల్యేలు ప్రజల నుంచి నిరసన సెగలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అలా జనం నుంచి వ్యతిరేకత వచ్చిన సిటింగ్ ల జాబితాను పీకే టీమ్ ఇప్పటికే రెడీ చేసిందని తెలుస్తోంది. జనం నుంచి మరింత వ్యతిరేకత మూటకట్టుకోక ముందే.. ఓటమి భయం నుంచి గట్టేందుకు సీఎం జగన్ ముందస్తు ఎన్నికలకు ప్రయత్నాలు చేస్తున్నారంటున్నారు.