.. అయినా జగన్ మారలేదు.. ఆయన పార్టీ తీరు మారలేదు!

వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ కక్ష సాధింపు, ప్రత్యర్థి పార్టీల నేతలపై సోషల్ మీడియాలో బూతులతో విరుచుకుపడటమే పాలన అన్నట్లుగా సాగింది. చట్టాలకు తిలోదకాలిచ్చేసి ఇష్ఠారీతిగా  చెలరేగిన వారందరూ ఇప్పుడు కూటమి ప్రభుత్వ హయాంలో చట్టం ముందు నిలబడకతప్పని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పలువురిపై కేసులు నమోదయ్యాయి. కొందరు అరెస్టయ్యారు. ఇంకొందరు బెయిలుపై ఉన్నారు. ఇంకా కొందరు ముందస్తు బెయిలు కోసం కోర్టులను ఆశ్రయించారు.

ఇంత జరిగినా వైసీపీ అధినేత జగన్ మారలేదు. ఆయన పార్టీ తీరు మారలేదు. గతంలో ప్రత్యర్థి పార్టీలపై అనుచిత భాషలో విరుచుకుపడిన వారికి జగన్ పదవులు, ప్రమోషన్లు ఇచ్చి ప్రోత్సహించారు. జగన్ అరాచక, అభివృద్ధి నిరోధక పాలనకు తోడు, ప్రత్యర్థి పార్టీల నేతలపై అనుచిత భాషా ప్రయోగం కూడా జగన్ పార్టీ ఘోర ఓటమికి కారణం అనడంలో సందేహం లేదు. అయితే జనం ఓటుతో బుద్ధి చెప్పినా, కనీసం విపక్ష హోదాకు కూడా జగన్ కి, జగన్ పార్టీకీ అర్హత లేదని తేల్చేసినా జగన్ తీరులో మార్పు రాలేదు. ఇప్పుడు కూడా భాష విషయంలో ఆయన ఇసుమంతైనా రాజీపడటం లేదు.

ప్రతిపక్ష హోదా కూడా లేని పార్టీలో పార్టీ పదవులు దక్కాలంటే ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగు దేశం కూటమి నేతలపై బూతులు, అనుచిత భాషలో విరుచుకుపడేవారికే పదవులు అని జగన్ తన చేతల ద్వారా నిరూపిస్తున్నారు. ఈ అనుచిత భాషా ప్రయోగంతో పాటు అవినీతి ఆరోపణలు కూడా ఉంటే అది అదనపు అర్హతగా భావిస్తున్నారు. తాజాగా వైసీపీ యూత్ వింగ్ కు కొత్తగా నియమితుడైన బైరెడ్డి సిద్ధార్ధరెడ్డి ఉదంతమే ఇందుకు ఉదాహరణగా రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.  బైరెడ్డి సిద్దార్థరెడ్డి కోసం జగన్ పార్టీ యూత్ వింగ్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు సృష్టించారు. ఇంతకీ ఇంత హడావుడిగా బైరెడ్డి సిద్ధార్ధ్ రెడ్డికి పదవి ఎందుకు కట్టబెట్టారంటే.. ఆయన అధికార కూటమిపై విమర్శలతో విరుచుకుపడటమే. అంతేనా మళ్లీ మేం అధికారంలోకి వస్తాం.. అప్పుడు ఇంతకింతా బదులు తీర్చుకుంటాం అంటూ వార్నింగ్ ఇవ్వడమే.

బైరెడ్డి సిద్ధార్ధ్ రెడ్డి మంగళవారం (మార్చి 25)న తెలుగుదేశం కూటమి నేతలకు వార్నింగ్ ఇచ్చారు. బుధవారం (మార్చి 26) ఆయనకు పార్టీ యూత్ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పదవి ఎగురుకుంటూ వచ్చేసింది. ఇంతకీ ఈ బైరెడ్డి సిద్దార్ధ్ రెడ్డి వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో  ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ శాప్ చైర్మన్ గా పని చేశారు. ఆడుదాం ఆంధ్ర పేర పెద్ద ఎత్తున జరిగిన నిధుల దుర్వినియోగంలో అప్పటి టూరిజం, క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజాతో పాటు సిద్ధార్ద్ రెడ్డిపైనా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ నిధుల దుర్వినియోగానికి సంబంధించిన ఆరోపణలపై ఆయన నేడో రేపో కేసులను ఎదుర్కోక తప్పని పరిస్థితి ఉంది. ఇటువంటి వారికే వైసీపీలో పెద్ద పీట లభిస్తుంది. పదవుల విషయంలో అగ్రతాంబూలం దొరుకుతుంది.  

Teluguone gnews banner