సచివాలయాన్నీ తాకట్టు పెట్టేశారు.. ఇక మిగిలింది ప్రజల ఆస్తులే జగన్!
posted on Mar 4, 2024 8:42AM
అభివృద్ధి అంటే తెలియని సీఎం జగన్ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురాలేని అసమర్ధ సీఎంగా ఇప్పటికే తనతు తాను ప్రూవ్ చేసుకున్నారు. అందుకు ప్రతిఫలంగా తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ప్రజలలో జగన్ ప్రభుత్వంపై ఎంతటి వ్యతిరేకత ఉందో.. వరుసగా వెలువడుతున్న సర్వేలన్నీ సందేహాలకు అతీతంగా రుజువు చేస్తూనే ఉన్నాయి. అది చాలదన్నట్లు గత ప్రభుత్వం హయాంలో వచ్చిన కంపెనీలను వెళ్లగొట్టేసిన సీఎం జగన్ ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ భూములను తాకట్టు పెట్టేస్తున్నారు. అంతటితో ఆగకుండా ఏకంగా రాష్ట్ర ప్రజలు దేవాలయంగా భావించే సచివాలయాన్నిసైతం బ్యాంకులో తాకట్టు పెట్టేశారు. జగన్ వంటి ముఖ్యమంత్రి దేశంలోనే కాదు.. ప్రపంచంలో ఎక్కడైనా ఉంటాడా? అని జనం విస్తుపోతున్నారు. ఏపీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కొత్త నిర్మాణాలు లేవు.. కొత్తగా వచ్చిన కంపెనీలు లేవు.. కొత్తగా వచ్చిన ఉద్యోగాలూ లేవు.. క బ్జాలు ఉన్నాయి.. ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టడాలు మాత్రం ఉన్నాయి. ఇలా ప్రపంచంలో ఏక్కడా కనిపించని అరుదైన సీఎం జగన్మోహన్ రెడ్డి అంటూ ఏపీ ప్రజలు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలు దేవాలయంగా ప్రభుత్వ పాలనకు కేంద్రంగా ఉండే సచివాలయాన్నిసైతం జగన్మోహన్ రెడ్డి బ్యాంకులో తాకట్టు పెట్టారంటే.. ఇలాంటి సీఎంను ఎన్నుకున్నందుకు ఏపీ ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్న పరిస్థితి నెలకొంది.
జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టి న నాటి నుంచి రాష్ట్రంలో కంటికి కనపడిన ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టుకుంటూ వస్తున్నారు. గతేడాది మద్యం బాండ్ల పేరుతో తాగుబోతులను తాకట్టు పెట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 48వేల కోట్లు అప్పు తెచ్చింది.. విశాఖలో 13 ప్రభుత్వ భవనాలు, కాలేజీలు తాకట్టు పెట్టి రూ. 25వేల కోట్లు.. రోడ్లు భవనాల శాఖలో కొన్ని ఆస్తులను తాకట్టు పెట్టి ఏడు వేల కోట్లను వైసీపీ ప్రభుత్వం అప్పుగా తెచ్చింది. ఇన్నాళ్లూ తాకట్టు పెట్టకుండా ఏపీలో మిగిలింది ఏదైనా ఉందంటే అది సచివాలయం మాత్రమే అని ఏపీ ప్రజలు చెప్పుకుంటూ వచ్చారు. కానీ, జగన్మోహన్ సచివాలయాన్ని కూడా వదల్లేదు. గుట్టు చప్పుడు కాకుండా హెచ్‌డీఎప్‌సీ బ్యాంకుకు రూ. 370 కోట్లకు సచివాలయాన్ని తాకట్టు పెట్టేశారు. సచివాలయంలో ఐదు భవనాలు ఉన్నాయి. శాసన సభ, శాసనమండలి భవనాలు విడిగా ఉన్నాయి. ప్రస్తుతం సచివాలయంలోని ఐదు బ్లాకులను ప్రభుత్వం తాకట్టు పెట్టింది. ఏపీ రాష్ట్ర బడ్జెట్ మొత్తం దాదాపు 3లక్షల కోట్లు.. అందులో రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టి అంత డబ్బు ఎందుకు తేవాల్సి వచ్చిందో జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాల్సి ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఆస్తులన్నీ బ్యాంకుల్లో తాకట్టు పెట్టి వచ్చిన డబ్బును ఏం చేస్తున్నారన్న విషయం ఆర్థిక అంశాలపై పట్టున్న వారికికూడా అర్థంకాని పరిస్థితి నెలకొంది. గత ఎన్నికల సమయంలో ఒక్క చాన్స్ ఇవ్వండి ప్లీజ్ అంటూ ఏపీ ప్రజలను వేడుకున్న జగన్మోహన్ రెడ్డి, అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్తులను బ్యాంకుల్లో తాకట్టుపెడుతూ వస్తున్నారు. అందుకే ఒక్క చాన్స్ అడిగారా అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే తాకట్టు పెట్టడం తప్ప ఆయన ప్రభుత్వ పరంగా ఈ ఐదేళ్లలో ఏం చేసింది లేదని అంటున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తరువాత ఏపీకి రాజధాని లేకుండా పోయింది. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు అమరావతి కేంద్రంగా దేశంలోని మిగిలిన రాష్ట్రాలను తలదన్నేలా ఏపీ రాజధానిని నిర్మించాలని భావించారు. అమరావతి ప్రాంత రైతులుసైతం చంద్రబాబు అడిగిందే తడవుగా భూములిచ్చేశారు. భావితరాలకు అద్భుత రాజధానిని అందించాలని భావించిన చంద్రబాబు ఒక్కో అడుగు ముందుకేస్తూ భవనాల నిర్మాణాలు చేపట్టారు. అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు ఇలా రూ.700 కోట్ల వ్యయంతో భవనాలను నిర్మించారు. ఆ భవనాలు కొన్ని 80శాతం, కొన్ని 90శాతం, కొన్ని భవనాలు పూర్తిస్థాయిలో నిర్మాణం జరిగాయి. అయితే అవన్నీ గ్రాఫిక్స్ మాత్రమే అంటూ జగన్ మోహన్ రెడ్డి గత ఎన్నికల సమయంలో ప్రచారం చేశారు. దీనికితోడు ఒక్క చాన్స్ ప్లీజ్ అంటూ ప్రజలను వేడుకున్నాడు. దీంతో ప్రజలు సైతం జగన్ మోహన్ రెడ్డిని గుడ్డిగా నమ్మి అధికారాన్ని కట్టబెట్టారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి రాజధానికాదు అంటూ జగన్ బాంబు పేల్చాడు. ఒక్క రాజధానితో ఏపీలో అభివృద్ధి జరగదు.. నేను మూడు రాజధానులు కడతా అంటూ జగన్ ఐదేళ్లుగా ప్రజల చెవుల్లో పువ్వులు పెడుతూనే వస్తున్నారు. అమరావతిలో చంద్రబాబు కట్టిన భవనాలు ఏమీలేవంటూ ప్రచారం చేసిన జగన్.. ఇప్పుడు ఆ భవనాలను తాకట్టు పెట్టి కోట్ల రూపాయలు అప్పులు తీసుకున్నారు.
జగన్ అమరావతిని నిర్వీర్యం చేయకుండా చంద్రబాబు కట్టగా మిగిలిన భవనాలను పూర్తిచేసినా ఏపీకి ఇప్పటి వరకు ఓ మంచి రాజధాని అయ్యి ఉండేది. ప్రజల సొమ్మును దోచుకోవటానికి అలవాటు పడిన జగన్మోహన్ రెడ్డి, ఆయన కేబినెట్‌లోని మంత్రులు అమరావతి రాజధాని కాదు స్మశాన వాటిక.. అక్కడ ఉంది బూడిదే అంటూ ప్రచారం చేశారు. అంతేకాదు.. అమరావతిలో భవనాల నిర్మాణానికి 100 కోట్లు కూడా కాదు.. చంద్రబాబు వెయ్యి కోట్లు పెడుతున్నారు.. ప్రజల సొమ్మును చంద్రబాబు దోచుకున్నారని జగన్ అండ్ కో గతంలో ప్రచారం చేసింది.. జగన్ చెప్పిందే నిజమైతే.. మరి ఇప్పుడు సచివాలయం తాకట్టుకు బ్యాంకు రూ.370కోట్లు ఎలా అప్పు ఇచ్చిందంటూ ఏపీ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తప్పుడు విమర్శలు చేయడం, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయించడం.. తనకు అనుకూల ఛానల్స్ ద్వారా తప్పుడు కథనాలు ప్రసారం చేయడం.. ఇలా ఏపీ ప్రజలను జగన్మోహన్ రెడ్డి నిలువునా మోసం చేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ మోహన్ రెడ్డి సచివాలయాన్ని తాకట్టుపెట్టడాన్ని చూసి ఆర్థిక వేత్తలు సైతం నివ్వెర పోతున్నారు. ఇలాంటి వ్యక్తినా ఏపీ ప్రజలు సీఎంగా ఎన్నుకుంది అంటూ జాలిపడుతున్నారు. సచివాలయం తాకట్టు పెట్టిన విషయం తెలుసుకున్న చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రాజధానులంటూ మూడు ముక్కలాటకు తెరలేపి... రాష్ట్రానికి రాజధాని కూడా లేకుండా చేసి... చివరికి అమరావతిలోని రాష్ట్ర సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టేశారు.. ఇంతకంటే దారుణం ఏమైనా ఉంటుందా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఏపీ ప్రజలు మేల్కొని ఓటు ద్వారా జగన్మోహన్ రెడ్డికి బుద్దిచెప్పకుంటే రాబోయే కాలంలో రాష్ట్రంలోని ప్రతీఒక్కరి ఆస్తులను ప్రభుత్వ ఆస్తులుగా చూపించి బ్యాంకుల్లో తాకట్టు పెట్టి అప్పులు తెచ్చినా ఆశ్చర్యం పోవాల్సిన పనిలేదని ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తున్నారు.