జగన్ దీక్షపై జైలు అధికారుల అయోమయం
posted on Aug 28, 2013 @ 12:23PM
జగన్ మోహన్ రెడ్డి చంచల్ గూడా జైలులో చేప్పటిన నిరవధిక నిరాహార దీక్ష నాలుగవ రోజుకి చేరుకొన్నతరువాత గానీ, అతని దీక్షపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవలసి ఉంటుందని జైలు అధికారులకు ఆలోచన కలుగకపోవడం చాలా విచిత్రం. వివిధ పార్టీల నేతలు చాలా సూచనలు చేసినప్పటికీ వాటిని జైలు అధికారులు పట్టించుకోలేదు. రిమాండ్ ఖైదీగా ఉన్నజగన్ జైలులోనిరాహార దీక్ష చేయవచ్చాలేదా? ఒకవేళ చట్ట ప్రకారం అనుమతి లేకుంటే అతనితో ఏవిధంగా వ్యవహరించాలనే సంగతి కూడా తెలుసుకోకుండా, అతను దీక్షకు అనుమతి కోరుతూ తమకు వ్రాత పూర్వకంగా ఎటువంటి విజ్ఞప్తి చేయనందున తామేమి చేయలేమని చెపుతూ ఈ నాలుగు రోజులు కాలక్షేపం చేసారు.
మూడు రోజులుగా అతను ఆహారం తీసుకోకపోవడం వలన క్రమంగా అతని ఆరోగ్యం క్షీణించడం మొదలవగానే, ఇప్పుడు జైలు అధికారులలో కంగారు మొదలయ్యింది. వారు ఈ రోజు హడావుడిగా సీబీఐ కోర్టుకి పరుగులు తీసి అతని విషయంలో ఏవిధంగా వ్యవహరించాలనే విషయంపై కోర్టు సలహా కోరుతున్నారు. అంటే గత నాలుగు రోజులుగా జైలు అధికారులు కూడా అతను దీక్ష చేయడానికి పరోక్షంగా సహకరించినట్లే అర్ధం అవుతోంది. లేకుంటే వారు ఈ రోజు సీబీఐ కోర్టును ఆశ్రయించేవారు కాదు. ప్రభుత్వం కూడా ఇటువంటి విషయాలలో చాలా ఉదాసీనత చూపడం చాలా ఆశ్చర్యంగా ఉంది.