జగన్ ధీమా మాయం.. వేడుకోళ్లూ పని చేయని వైనం
posted on Nov 4, 2023 @ 4:11PM
మంత్రులతో పని లేదు.. ఎమ్మెల్యేలు అక్కర్లేదు.. నాయకుల అవసరం లేదు.. బటన్ నొక్కి పందేరం చేస్తున్న సొమ్ములు.. నా నుంచి నా చేత నా కోసం నియమించుకున్న వలంటీర్లు చాలు.. వచ్చే ఎన్నికలలో 175కు 175 స్థానాలలో విజయం సాధించేస్తాను అన్న ధీమా నుంచి.. పార్టీ నేతలను నన్ను ముఖ్యమంత్రిని చేయడానికి పని చేయండి బాబ్బాబు అని బతిమలాడుకునే స్థాయికి ముఖ్యమంత్రి జగన్ వచ్చేశారు.
నాలుగున్నరేళ్లుగా ఆయన వ్యక్తం చేస్తున్న ధీమా అంతా డొల్లేననీ, ఎన్నికలు దగ్గరకొచ్చేసరికి ఓటమి భయం వణికించేస్తోందనీ.. ఇటీవలి ఆయన ప్రతి కదలికా.. ప్రతి మాటా ప్రస్ఫుటం చేస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గడపగడపకూ మన ప్రభుత్వం రివ్వూ మీటింగ్ లు ఏర్పాటు చేసి.. సీనియర్ నాయకులు, మంత్రులు అన్న కనీస మర్యాద కూడా చూపకుండా.. వచ్చే ఎన్నికలలో పార్టీ టికెట్ కావాలంటే జనం ఛీ కొట్టినా, చీత్కారం చేసినా జనంలోకి వెళ్లాల్సిందే... ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను వివరించాల్సిందే అని హుకుం జారీ చేసిన ధీమా ఇప్పుడు జగన్ లో కాగడా పెట్టి వెతికినా కనిపించడం లేదంటున్నారు.
చంద్రబాబు అరెస్టు తరువాత ప్రభుత్వ వేధింపుల భయాన్ని కూడా వదిలేసి జనం.. అన్ని వర్గాలకూ చెందిన వారు ధైర్యంగా బయటకు వచ్చి కేసులకు వెరవకుండా నిరసనలకు దిగడం.. పదేళ్లుగా తాను విజయవంతంగా మరుగున పడేశానని భావిస్తున్న తన అక్రమాస్తుల కేసులపై.. వ్యవస్థలను మేనేజ్ చేశో..మరోటి చేశో పదేళ్లుగా బెయిలు మీద బయట ఉన్న సంగతినీ జనం బాహాటంగా చర్చించుకున్నారు. చంద్రబాబుకు కృతజ్ణత ఈవెంట్ నిర్వహించి మరీ జగన్ నిష్క్రియాపరత్వాన్ని ఎండగట్టారు. ఏపీలోనే కాదు.. దేశ విదేశాలలో అసంఖ్యాకంగా జనం రోడ్ల మీదకు వచ్చి ఐ యామ్ విత్ బాబు (# I am with Babu) అంటూ నినదించారు.
మాజీ ఐఏఎస్ లు, ఐపీఎస్ లు మొహమాటం లేకుండా బాబు అవినీతికి పాల్పడ్డారంటే తాము నమ్మలేమని కుండబద్దలు కొట్టారు. బాబుపై నమోదైన స్కిల్ కేసు నిలవదని కరాఖండీగా చెప్పేశారు. అన్నిటికీ మించి కేసు మీద కేసును తెరమీదకు తీసుకువస్తూ చంద్రబాబును జైలుకు పరిమితం చేయాలన్న జగన్ ఉద్దేశం వెనుక ఉన్న రాజకీయ సంకుచితత్వాన్ని జనం పసిగట్టేశారు. సీఐడీ చీఫ్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ కలిసి ఊరూరు తిరిగి చంద్రబాబుపై అవినీతి ముద్ర వేయడానికి చేసిన ప్రయత్నాలను జనం తిప్పి కొట్టారు. సాంకేతిక కారణాలు, న్యాయవాదుల వాయిదాల అభ్యర్థన వల్ల చంద్రబాబు 52 రోజుల పాటు నిర్బంధంలో ఉండాల్సి వచ్చిందే తప్ప ఆయనపై పెట్టిన ఏ కేసులోనూ పస, విషయం లేదని జనం త్రికరణ శుద్ధిగా నమ్మారు. అందుకే మధ్యంత బెయిలుపై బయటకు వచ్చిన తరువాత నభూతో నభవిష్యత్ అన్న రీతిలో ఘనస్వాగతం పలికారు. తెలుగుదేశం ఆవిర్భావ సమయంలో ఎన్టీఆర్ కోసం జనం ఎలా బయటకు వచ్చారో అలా చంద్రబాబుకోసం జనం పోటెత్తారు. ఆయన ప్రసంగించరని తెలుసు.. కారులోంచి బయటకు అడుగుపెట్టరని కూడా తెలుసు.. కానీ చంద్రబాబుకు సంఘీభావం తెలపడం కోసం బయటకు రావడం తమ కర్తవ్యంగా భావించారు ప్రజలు.
గంటల తరబడి ఆయన వాహన శ్రేణి రాకకోసం రోడ్ల కిరువైపులా వేచి చూశారు. విజయవాడ రహదారిలో ఆయన కోసం వేచి చూస్తున్న జనం రోడ్ల పక్కనే మేను వాల్చి నిదురిస్తున్న దృశ్యాలు మీడియాలోనూ, సామాజిక మాధ్యమంలోనూ వైరల్ అయ్యాయి. ఇవి చాలు జనం మూడేమిటో తెలిసిపోవడానికి. సహజంగానే జగన్ కు కూడా చంద్రబాబు కోసం జనం పడుతన్న తపనే తన ఓటమి ఏ స్థాయిలో ఉండబోతున్నదో కళ్లకు కట్టినట్లు అయ్యింది. దీంతో ఆయనలో అసహనం అవధులు దాటుతోంది. ఆ అసహనం క్రోధంగా పార్టీ నేతలపై ప్రసరిస్తోంది. అయితే ఈ సారి మీరు పని చేయడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం లేదు.. నన్ను ముఖ్యమంత్రిని చేయడం మీకు ఇష్టం లేదా రుసరుసలాడుతున్నారు.
నన్ను సీఎంను చేయాలని లేదా అంటూ విశాఖ నేతలపై జగన్ రెడ్డి రుసరుసలాడుతున్న సంఘటనకు సంబంధించి వీడియో సామాజిక మాధ్యమంలో తెగ ట్రోల్ అవుతోంది. ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు వచ్చి బొకేలు ఇవ్వబోయిన పార్టీ నేతలపై ఆయన విరుచుకుపడ్డారు. నన్ను సీఎం చేయడానికి మీరు కష్టపడటం లేదంటూ నిష్టూరాలాడారు.
ఇదేంటి ఒక ముఖ్యమంత్రి నాయకులను నన్ను ముఖ్యమంత్రిని చేయడానికి పని చేయరా అని బతిమలాడుకోవడమేమిటి? తన నాయకత్వ పటిమతో నేతలను, పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవలసిన సీఎం మీ సంగతి నాకు అనవసరం నేను ముఖ్యమంత్రికి కావాలంతే అన్నట్లు మాట్లాడటమేమిటని నెటిజనులు విస్తుపోతున్నారు. జగన్ ఫ్రస్ట్రేషన్ ఏ స్థాయిలో ఉందో అవగతం అవ్వడానికి ఈ సంఘటన ఒక్కటి చాలంటూ ముక్తాయిస్తున్నారు.
జగన్ రెడ్డికి రాష్ట్రం ఏమైపోయినా, తనను నమ్ముకున్న ప్రజలు, నాయకులు, కార్యకర్తలూ ఏమైపోయినా పట్టదు.. తాను ముఖ్యమంత్రి కావడమే ముఖ్యం. కేవలం తనను సీఎం చేయడానికి అంగీకరించలేదన్న ఏకైక కారణంతోనే జగన్ రెడ్డి తన తండ్రి జీవితాంతం కొనసాగిన, ఆయనకు ఉన్నత పదవులు కట్టబెట్టిన కాంగ్రెస్ పార్టీని కాదని బయటకు వచ్చి సొంత పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. సరే పరిస్థితులు కలిసి వచ్చి 2019 ఎన్నికలలో ఆయన పార్టీ విజయం సాధించి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఆ ఎన్నికలలో వైసీపీ విజయం అంతా తన ఘనతేనని భావించిన జగన్ పార్టీ విజయంలో నేతలు, కార్యకర్తల ప్రమేయం ఏదీ లేదన్నట్లుగా ఈ నాలుగేళ్లూ వ్యవహరించారు. నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలకూ, కేబినెట్ లో మంత్రులకూ ఇసుమంతైనా విలువలేని విధంగా వ్యవహరించారు. నియోజకవర్గాల పెత్తనం అంతా వలంటీర్లకు, మంత్రుల అధికారాలన్నీ సకల శాఖల మంత్రి సజ్జలకు కట్టబెట్టేశారు. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేలూ నిమిత్త మాత్రలుగా మిగిలిపోయారు. ఇక సంక్షేమం పేరిట పందేరం చేస్తున్న సొమ్ములే 2024లో తన విజయానికి పెట్టుబడులుగా మారుతాయని భ్రమించారు. అయితే జనం మాత్రం సంక్షేమంతో పాటు అభివృద్ధీ సమాంతరంగా ఉండాలని కోరుకుంటారని విస్మరించారు. నాలుగేళ్ల పాటు తనాడిందే ఆట.. పాడిందే పాట అన్నట్లుగా సాగిన అధికారం.. ఆ తరువాత ఇప్పుడు కదలనంటూ భీష్మిస్తోంది.
జనం ఎక్కడికక్కడ నిర్బయంగా తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. సాక్షాత్తూ సీఎం సభల నుంచే వాకౌట్ చేస్తున్నారు. పార్టీ నేతల బస్సు యాత్రలకు మొహం చాటేస్తున్నారు. దీంతో విషయం బోధపడిన జగన్ ఇప్పుడు నేతలపై నెపం వేస్తున్నారు. నన్న మరోసారి సీఎం ను చేయడానికి మీరెందుకు కష్టపడటం లేదు. పని చేయడంలేదని నిలదీస్తున్నారు. నాలుగున్నరేళ్ల కిందట151 సీట్లతో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి నాలుగేళ్లలోనే ఇంతగా ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంటారని కానీ, మూటగట్టుకోగలరని కానీ ఎవరూ ఊహించలేదు. అందుకే జగన్ విధానాలు ఆయన పాలన చేపట్టిన తొలినాళ్లలోనే.. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ప్రజావేదిక కూల్చివేతతోనే అర్ధమైనా.. అమరావతిని నిర్వీర్యం చేసినా.. మూడు రాజధానులు అంటూ రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రం చేసినా నేతలు, కార్యకర్తలు ఆయనను అంటిపెట్టుకునే ఉన్నారు. కానీ చంద్రబాబు అరెస్టు.. తదననంతర పరిణామాలతో వారంతా కాడె వదిలేసినట్లే కనిపిస్తున్నారు. జగన్ ను సమర్ధిస్తూ మాట్లాడేందుకు సకల శాఖల మంత్రి.. కొడాలినాని, రోజా, అమర్నాథ్ వంటి వారు తప్ప ఇంకెవరూ మిగల్లేదు. చివరాఖరికి సామాజిక బస్సుయాత్రలో కార్యకర్తలు కూడా కనిపించనంతటి దారుణమైన పరిస్థితిలో జగన్ పార్టీ ఉంది. ఇందుకు జగన్ తీరే కారణమని పరిశీలకులు విశ్లేషించడమే కాదు.. స్వయంగా ఆయన పార్టీ నాయకులే అంతర్గత సంభాషణల్లో అంగీకరిస్తున్నారు.