రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా.. గొంతు సవరించిన జగన్ !
posted on Jul 27, 2022 @ 12:00PM
తప్పని పరిస్థితుల్లో అప్పులు చేసి భయపడుతూ జీవించేవాళ్లు ఉంటారు. అప్పుల అప్పారావులూ ఉంటారు. అప్పులు చేయడంలో గొప్ప ఆనందం ఉందని ప్రచారమూ చేస్తుంటారు. పారసైట్లలా అప్పుల కట్టల మీద నిద్రపోవడం బహు ఆనందం. ఈ రెండో తరగతికి చెందిన వారే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు. ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పాడుతున్న పాటకీ మూలార్ధం ఒక్కటే రండి డబ్బుల కట్టతో, ధన వంతులూ కోట్లు కుమ్మరించండి.. మీదే ఈ రాజ్యమని! ఎవరు డబ్బుల మూటతో వస్తే వారికే దేవర వారి దర్శనం, అభ్యర్ధనలతో, వినతులతో వస్తే గుమ్మం నుంచీ వెర్రినవ్వుతో వెళ్ల గొడుతున్నారు.
రాష్ట్ర ఆర్ధిక స్థితి రాను రాను దారుణంగా మారుతుండడంతో ఆదాయమార్గాల కోసం ప్రతీవారినీ సలహా అడుగుతున్నారు, ప్రతీ ఆలోచనకూ పదును పెడుతున్నారు. కానీ ఏ పదునైన ఆలోచన ఏ సలహా దారుల నుంచి రాక జగన్ అద్దంలో మొహం చూసుకోలేని పరిస్థితి ఏర్పడింది. మరి నెత్తికెత్తుకున్న భారం చిన్న దా. ఏటా యాభై వేల కోట్లు కేవలం సంక్షేమ పధకాలకే పోతుంది. ఉద్యోగుల జీతాలు ఇతర అవసరాలు అన్నీ చూడాలి అంటే ఏటా సర్కార్ కి సుమారు రెండు లక్షకోట్లు ఖర్చు అవుతోంది. అయితే ఈ రోజుకు స్టేట్ ఆదాయం ఎనభై వేల కోట్లు గా ఉంది. కేంద్రం నుంచి వివిధ పన్నుల ద్వారా వచ్చే ఆదాయం చూస్తే మరో ముప్పయి వేల కోట్ల దాకా జమ అవుతోంది. అంటే ఎలా చూసుకున్నా లక్షా పది వేలకు మించి ఆదా యం రావడం లేదు. మరి నలభై వేల కోట్లు ప్రతీ ఏటా లోటు కనపడుతోంది. దాంతో పాటు ఇంకా అదనపు ఖర్చులు తగిలితే తడిసి మోపెడు అవుతోంది. దాంతో అప్పులు చేస్తూనే మరో వైపు ఉన్న ఆదాయ మార్గా లను కూడా పెంచుకునే మార్గం వెతుకుతోంది.
ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన ఒక ఉన్నత స్థాయి సమావేశంలో కీలకమైన శాఖల నుంచి వచ్చే ఆదాయం మీద దృష్టి పెట్టారు. ముఖ్యంగా గనుల శాఖ బంగారు బాతుగుడ్డు మాది రిగా ఉందని సర్కార్ భావిస్తోంది. గత మూడేళ్లుగా ఎర్ర చందనం స్టాక్ వేలం వేయకుండా అలాగే మిగిలి ఉంది. దాంతో దాన్ని వేలం వేయడం ద్వారా వందల కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోవాలని సర్కార్ ఆరాటపడుతోంది. అంతేకాకుండా ఎర్రచెందనం వేలం వేయడానికీ ఆలోచిస్తోంది. అయితే అందుకు కేంద్రం అనుమతి కోసం ప్రయత్నాలు చేస్తోంది. కాగా మద్యం అమ్మకాలతో ఆదాయం గణనీయంగా ఉం టుందని చెబుతూ ఎక్సైజ్ అధికారులు జగన్‌కు కాస్తంత ఊరట కలిగిస్తున్నారు.
ఇక రిజిస్ట్రేషన్ విభాగం నుంచి వచ్చే ఆదాయం పైనా దృష్టిపెట్టాలన్నారు. ఎక్కడా ఒక్క పైసా కూడా విడవకుండా పట్టుదలతో వసూలు చేపట్టాలని సర్కార్ భావిస్తున్నది. అనేక ఇతర శాఖలకు కూడా ఆదా య అవకాశాలు పెంచాలన్న ఆదేశాలే జారీ అయినాయని తెలుస్తున్నది. అందుబాటులో ఉన్న వారు, ధనికస్నేహితులను ఏ ఒక్కరిని వదలద్దని పూర్వం ఒకాయన వెంటాడి మరీ డబ్బులు వసూలు చేసినట్టు ఇపుడు జగన్ సర్కార్ ఏ విభాగాన్ని వదలడం లేదు. అందరికీ తన పాట రావమ్మా.. మహాలక్ష్మీ.. రావమ్మా.. వినిపించి, పాడమంటున్నారు. ఇక అధికారుల కష్టాలు దేవతకే ఎరుక. కానీ ఎలాంటి న్యాయపరమైన వివాదాలకు ఆస్కారం లేకుండా పన్నుల వసూళ్లలో పారదర్శకత జవాబు దారీ తనం సమర్థత ఉండేలా చూడాలని అధికారుల ను ఆయన ఆదేశించారు.
మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఖజానా నింపడానికి చేయాల్సిన వీర యత్నాలన్నీ చేస్తున్న ది. ఇపుడు పరిస్థితులు మరింత విషమిస్తున్నవేళ అధికారులపై పెనుభారం పెట్టింది. కేంద్రం నుంచి ప్రేమాభిమానాలు, స్నేహసంబంధాలు మెరుగుపర్చుకుంటన్నప్పటికీ ఇంతటి అప్పారావు పాల నను కేంద్రం ఎలా సమర్ధిస్తున్నదని ప్రజలు అనుకుంటున్నారు.