జగన్ హయాం.. ప్రగతి పూజ్యం..విద్వేషాలకు అజ్యం
posted on Nov 2, 2022 6:31AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తీరు ఏపీ భవిష్యత్ లేని రాష్ట్రంగా మారేందుకు దోహదపడుతోంది. ప్రతి విషయంలో ఆయన వితండం రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసే దిశగానే నడుపుతోంది. అన్ని విషయాలూ పక్కన పెట్టి రాష్ట్ర రాజధాని అమరావతి విషయానికి వస్తే జగన్ తాను పట్టిన కుందేటికి మూడుకాళ్లన్న తీరులో వ్యవహరిస్తున్నారు. వికేంద్రీకరణ అంటూ మూడు ముక్కలాట మొదలెట్టి.. రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా మార్చేశారు. కోర్టుల చేత మొట్టికాయలు వేయించుకోవడాన్ని ఈ మూడున్నరేళ్లలో జగన్ ఒక అలవాటుగా మార్చేసుకున్నారు.
రాష్ట్రంలో రాజధాని వివాదం కొనసాగుతూనే ఉంది. ప్రాజెక్టుల నత్తనడక అలాగే ఉంది. వాస్తవానికి రాష్ట్రంలో పనుల వేగం కన్నా నత్తనడక చాలా వేగం అనిపించేలా ఉంది. అధికారంలోకి వచ్చి రావడంతోనే కూల్చివేతలతో ఆరంభించిన తన పాలనను జగన్ విద్వేషం, విధ్వంసం అన్న రెండు లక్ష్యాల సాధన కోసమే కొనసాగిస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమయ్యేలా చేస్తోంది. రివర్స్ టెండరింగ్ అంటూ మొదలెట్టిన ఆయన రివర్స్ ప్రగతి దిశగా రాష్ట్రాన్ని నడుపుతున్నారు. సరే ఇప్పుడిక అమరావతి విషాయానికి వస్తే.. జగన్ అధికారం చేపట్టి మూడున్నరేళ్లు అయ్యింద.. ప్రజారాజధాని అమరావతి పురోగతిని నిర్వీర్యం చేయడం తప్ప ఆయన ఇఫ్పటి వరకూ చేసిందేమీ లేదు. ఈ విషయాన్నే ఎత్తి చూపుతూ పరిశీలకులు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీరును ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. గత ప్రభుత్వం చేపట్టి అసంపూర్తిగా ఉన్న పనులనే కాదు.. గత ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలించి వాటిని అమలులో పెడుతున్న తీరును పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
ఇక్కడ రెడ్డొచ్చి మొదలాడు అన్న చందంగా గత ప్రభుత్వంలో చేపట్టి దాదాపు పూర్తి కావచ్చిన పనులను కూడా ఆపేసి జగన్ చోద్యం చూస్తుంటే... తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మాత్రం గత ప్రభుత్వంలో ప్రతిపాదనల దశలోనే ఆగిపోయిన ప్రగతి పనులను చేపట్టి చకచకా పూర్తి చేస్తున్నారు.
తమిళనాడు రాజధాని చెన్నై నగరాన్ని పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా విస్తరించాలని గత పళనిస్వామి ప్రభుత్వం ప్రతిపాదించింది. రాజధాని స్వరూపం చెడిపోకుండా చెన్నై నగరాన్ని విస్తరించాలని పళని స్వామి ప్రభుత్వం 2018లో నిర్ణయించింది. అది కాగితాలలోనే మిగిలిపోయింది. కార్యరూపం దాల్చకుండానే పళనస్వామి ప్రభుత్వం దిగిపోయింది. ఎన్నికలలో డీఎంకే విజయం సాధించి స్టాలిన్ ముఖ్యమంత్రి అయ్యారు. తమిళనాడులో అన్నాడీఎంకే, డీఎంకేల మధ్యా రాజకీయ వైరం ఏ స్థాయిలో ఉంటుందో తెలిసిందే.
ఆ రెండు పార్టీల మధ్యా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంటుంది. అసెంబ్లీలో జయలలితకు అవమానం, అర్ధరాత్రి కరుణానిథి అరెస్టు వంటి చర్యలు ఆ రెండు పార్టీల మధ్యా ఉన్న ప్రతీకారేచ్ఛలకు నిదర్శనంగా ఈ నాటికీ జనం చెప్పుకుంటారు. కానీ స్టాలిన్ అధికార పగ్గాలు చేపట్టాకా రాష్ట్రంలో రాజకీయ ముఖచిత్రమే మారిపోయిందని చెప్పాలి. ప్రతి నిర్ణయంలోనూ విపక్షాలను విశ్వాసం లోనికి తీసుకోవడం నుంచీ.. ప్రజలకు మేలు జరుగుతుందంటే.. రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి కార్యాచరణకు ఉపక్రమించడం వంటి చర్యలతో జగన్ తమిళనాటే కాదు.. దేశ వ్యాప్తంగా ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు రాజధాని చెన్నై విస్తరణ విషయంలోనూ ఆ ఒరవడినే కొనసాగిస్తున్నారు. గత పళని స్వామి సర్కార్ నిర్ణయించిన మేరకు తమిళనాడు రాజధాని చెన్నై విస్తరణకు శ్రీకారం చుట్టారు. దీంతో ఏపీ సరిహద్దుల వరకూ చెన్నై మెట్రోపాలిటన్ ప్రాంతం చేరుతుంది. ఈ మేరకు నగరాన్ని భారీగా విస్తరించడానికి నిర్ణయం తీసుకున్నారు.
ప్రస్తుతం చెన్నై మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సీఎండీఏ) పరిధి 1,189 చ.కి.మీ.గా ఉంది. విస్తరణతో అది ఏకంగా 5,904 చ.కి.మీ.కు పెరుగుతుంది. ఈ విస్తరణ ఒక్క తమిళనాడుకే కాదు.. ఏపీలోని ఉమ్మడి చిత్తూరు జల్లాకూ ఎంతో మేలు చేస్తుందనడంలో సందేహం లేదు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వాసులకు ఉపాధి అవకాశాలను పెంచుతుంది. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను పక్కన పెట్టాలన్న ఏకైక లక్ష్యంతో ఏపీలో జగన్ పాలన సాగిస్తుంటే.. స్టాలిన్ మాత్రం రాష్ట్ర అభివృద్ధి, ప్రజా ప్రయోజనాల విషయంలో రాజకీయ వైరాలను తావివ్వరాదన్న ఆదర్శంతో పని చేస్తున్నారు. తమిళనాడులో ఎంతో ఆదరణ పొందిన అమ్మ క్యాంటిన్లను స్టాలిన్ సర్కార్ కొనసాగిస్తోంది. మరింత ఉపయుక్తంగా తీర్చి దిద్దింది.
అదే ఏపీలో జగన్ సర్కార్ అన్న క్యాంటిన్లను మూసి వేసింది. కూల్చివేసింది. దీని వల్ల పేదవాడి నోటి దగ్గర కూడు లాక్కున్న పరిస్థితి ఏర్పడినా పట్టించుకోలేదు. అ పళని స్వామి ప్రభుత్వం దివ్యాంగులకు ఇవ్వాలని రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల ట్రై సైకిళ్లను సిద్ధం చేసి.. తమ పార్టీ గుర్తులతో పంపిణీ చేయాలని భావించింది. ఏర్పాట్లన్నీ పూర్తై ఇక పంపిణీయే తరువాయి అనుకున్న దశలో ఎన్నికలు వచ్చాయి. ట్రైసెకిళ్ల పంపిణీ నిలిచిపోయింది. ఎన్నికలలో అన్నాడీఎంకే పరాజయం పాలైంది. డీఎంకే అధికారంలోకి వచ్చింది. స్టాలిన్ సీఎం అయ్యారు. వెంటనూ దివ్యాంగులకు ఈ ట్రై సైకిళ్లను లబ్దిదారులైన అందించారు. వాటిపై ఉన్న డీఎంకే రంగులను, చిహ్నాలను మార్చాలని అనుకోలేదు. ఎక్కడా అన్నాడీఎంకే గుర్తులను వేయలేదు. చివరికి ముఖ్యమంత్రి ఫొటో కూడా మార్చలేదు. ప్రజలకు మేలు జరగడమే ముఖ్యమనుకున్నారు. ఇప్పుడు రాజధాని చెన్నై విషయంలో కూడా అదే చేస్తున్నారు. రాజకీయం అంటే ప్రత్యర్థి పార్టీలపై కక్ష సాధింపు ధోరణితో అభివృద్దిని అడుగంటించేయడం కాదనీ.. ప్రజలకు మేలు జరిగే కార్యక్రమాలు చేపట్టడమనీ జగన్ స్టాలిన్ ను చూసైనా నేర్చుకోవాలని జనం అంటున్నారు.