జగన్ కుందేటికి మూడేకాళ్లు..!
posted on Sep 4, 2022 6:35AM
ఆంధ్రప్రదేశ్ మూడు ముక్కలు కావాల్సిందే. సీఎం జగన్ ఇదే చెబుతున్నారు. రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయాలని న్యాయస్థానం చెప్పినా.. ఇంతవరకు ఒక్క అడుగైనా జగన్ సర్కార్ ముందుకు వేస్తే ఒట్టు. హైకోర్టు విధించిన గడువు తీరిపోయినా లెక్క లేనట్లు వ్యవహరిస్తున్న జగన్ తాను పట్టన కుందేటికి మూడేకాళ్లని భీష్మిస్తున్నారు. రాజధాని నిర్మాణంపై తన వైఖరి తనదే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. అఫిడవిట్లతో కాలయాపన చేస్తున్నారు. ఇంతలా అమరావతిని నిర్లక్ష్యం చేస్తున్న జగన్ చివరికి ఏం సాధిస్తారన్నది ఆయనకే తెలియాలి?
ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతి నుంచి తరలించి, మూడు ముక్కలు చేసేందుకు జగన్ తన వ్యర్థ ప్రయత్నాలను ఇంకా కొనసాగించేందుకే పూనుకున్నారు. రాజధాని అమరావతి నిర్మాణం ఆరు నెలల్లో పూర్తి చేయాల్సిందే అని ఈ ఏడాది మార్చి 3న హైకోర్టు ఇచ్చిన తీర్పు గడువు శనివారంతో తీరిపోయింది. అమరావతిలో రాజధాని నిర్మాణంపై హైకోర్టు తీర్పు వెలువరించి శనివారం నాటికి ఆరు నెలలు పూర్తయ్యింది. కానీ రాష్ట్ర సర్కార్ లో ఎలాంటి స్పందనా లేదు. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించకూడదనే మొండి పట్టునే ఇప్పటికీ ప్రదర్శిస్తోంది. కోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం శిరసావహిస్తే.. ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని పాలకులు అనుకుంటే.. ఇప్పటికే అక్కడ శరవేగంగా పనులు జరుగుతూ ఉండాలి. గత ఆరు నెలల్లో ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధిగా చేసిన ప్రయత్నం ఒక్కటీ లేదు. హైకోర్టు చెప్పిన గడువులోగా రాజధాని నిర్మాణం సాధ్యం కాదని ఒకసారి, నిధుల కొరత ఉందని ఇంకోసారి, బ్యాంకులతో మాట్లాడుతున్నామని మరోసారి.. ఇలా కోర్టులో అఫిడవిట్లు వేస్తూ ఈ ఆరు నెలలూ కాలం గడిపేసింది.
సీఆర్డీఏ చట్టంలోని సెక్షన్ 58కి లోబడి రాజధాని అమరావతిలో నెల రోజుల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని హైకోర్టు తీర్పు చెప్పింది. రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన యజమానులు, రైతులకు మౌలిక సదుపాయాలు కల్పించి, స్థలాల్ని నివాసయోగ్యంగా చేసి, మూడు నెలల్లోగా అప్పగించాలని పేర్కొంది. భూసమీకరణలో రైతులతో చేసుకున్న ఒప్పందం ప్రకారం 6 నెలల్లో రాజధాని అమరావతిని నిర్మించాలని ఏపీ సర్కార్ ను హైకోర్టు ఆదేశించింది.
అయితే.. నిర్ణీత గడువు లోగా మౌలిక వసతుల పనులు పూర్తిచేయడం సాధ్యం కాదని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. పనులు ప్రారంభించేందుకే 8 నెలలు పడుతుందని, పూర్తిచేయడానికి 60 నెలలు కావాలని ఏప్రిల్ 1న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ హైకోర్టులో పిటిషన్ వేశారు. రైతులకు అభివృద్ధి చేసిన స్థలాలు ఇవ్వడానికి అయిదేళ్లు పడుతుందని జూన్ తొలి వారంలో పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి కోర్టులో మరో అఫిడవిట్ వేశారు.
ఏపీలోని శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల్ని వేర్వేరు ప్రాంతాలకు తరలిస్తూ శాసనం చేసే అధికారం శాసనసభకు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. రాజధానిని మార్చాలనుకోవడం భూములిచ్చిన రైతుల హక్కుల్ని కాలరాయడమే అంది. అయితే.. హైకోర్టు తీర్పు వెలువడిన రోజే అడ్వకేట్ జనరల్, సీఆర్డీఏ అధికారులతో, ఆర్థిక, పురపాలక శాఖల మంత్రులతో సీఎం జగన్ సమీక్షించారు. మూడు రాజధానులపై ముందుకే వెళ్లాలని నిర్ణయించారు. అధికార వికేంద్రీకరణకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని, మూడు రాజధానులపై ప్రజాభిప్రాయం కోరతామని సీఎంతో సమావేశం అనంతరం అప్పటి పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేయడం గమనార్హం.
కోర్టు అంత స్పష్టంగా చెప్పినా ప్రభుత్వ వైఖరి మారలేదు. మంత్రులు, వైసీపీ నేతలు ఇప్పటికీ మూడు రాజధానుల పాటే పాడుతున్నారు. రాజధానిలో గత ప్రభుత్వ హయాంలో వేసిన రోడ్లు తవ్వుకుపోతున్నా, కంకర, మట్టి, ఇసుక తరలించుకుపోతున్నా కనీస రక్షణ చర్యలు లేపోవడం అమరావతిపై ఈ ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యానికి తార్కాణం అని పలువురు మండిపడుతున్నారు.