జగన్ రెడ్డికి ఎన్ఐఏ దర్యాప్తు మీదా నమ్మకం లేదట!
posted on Oct 14, 2023 @ 12:02PM
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి తీరే వేరు. ఏదైనా సరే వ్యక్తులైనా, వ్యవస్థలైనా తనకు అనుకూలంగా ఉండకపోతే సహించరు. నమ్మకం లేదంటూ కోర్టులను ఆశ్రయిస్తారు. ఇక అక్కడ నుంచీ చట్టంలోని లొసుగులను ఆసరా చేసుకుని తనకు అనుకూలంగా నిర్ణయాలు వెలువడే దాకా సాగదీత పద్ధతులను అవలంబిస్తారు. తాను విపక్ష నేతగా ఉన్నప్పుడు విశాఖ విమానాశ్రయంలో తనపై జరిగిన కోడి కత్తి కేసు విషయంలోనూ అదే విధానాన్ని అవలంబిస్తున్నారు.
వివేకా హత్య కేసులో సీబీఐకు ఎలా అడ్డంకులు సృష్టించారో, దర్యాప్తునకు వచ్చిన సీబీఐ అధికారులపైనే కడపలో దాడులు చేయడం, రివర్స్ కేసులు పెట్టడం, ఆరోపణలతో ఆ అధికారుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడానికి చేసిన ప్రయత్నాలు అందరికీ తెలిసిందే. ఇక కోడి కత్తి కేసు అసలు ఎన్ఐఏ చేపట్టడమే ఆశ్చర్యం. కేవలం ఉగ్ర కేసులు, దేశ భద్రతకు భంగం వాటిల్లే కేసులనూ మాత్రమే దర్యాప్తు చేసేందుకు ఉద్దేశించిన ఎన్ఐఏను.. తనపై దాడి వెనుక మహాకుట్ర ఉందంటూ విపక్ష నేతగా నాడు నానా యాగీ చేసి, కేంద్రంలోని మోడీ సర్కార్ మద్దతు కూడా ఉండటంతో ఎన్ఐఏ దర్యాప్తు సాధించగలిగారు. సరే కోడికత్తి కేసు దర్యాప్తు ఎన్ఐఏ దర్యాప్తు చేసింది. ఏళ్లూ పూళ్లూ గడిచిపోయినప్పటికీ, చివరాఖరికి నాలుగున్నరేళ్లు దాటిపోయిన తరువాత దర్యాప్తు ముగింపు దశకు వచ్చింది. ఇక కేసు తేలిపోవాలంటే బాధితుడిగా జగన్ కోర్టుకు హాజరై వాంగ్మూలం ఇవ్వాలి. కోర్టులు ఆదేశించినా, సీఎం హోదాను అడ్డుపెట్టుకుని ఏవేవో సాకులు చెబుతూ కోర్టుకు మాత్రం రావడం లేదు.
ఇక మరింత కాలం కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకునే వీలు లేకపోవడంతో నాడు తాను కోరి మరీ సాధించుకున్నఎన్ఐఏ దర్యాప్తుపైనే ఆరోపణలు గుప్పిస్తున్నారు. కోడి కత్తి కేసులో మరింత లోతైన దర్యాప్తు అవసరం అంటూ హైకోర్టును ఆశ్రయించారు. అంతకు ముందు ఆయన వేసిన ఇదే పిటిషన్ ను ఎన్ఐఏ కోర్టు తోసిపుచ్చింది.
అసలు కోడి కత్తి కేసులో జగన్ కు అయినా గాయం ఎంత తీవ్రమైనది, ఆయనకు అందిన చికిత్స ఏమిటి? దాడి జరిగిన వెంటనే ఆయన విశాఖ నుంచి హైదరాబాద్ కు చేరుకోవడానికి ఎలా అనుమతి ఇచ్చారు. ఇత్యాది వివరాలేవీ వెల్లడించడానికి జగన్ సిద్ధంగా లేరు. నిజంగా జగన్ కోరుకున్నట్లు ఎన్ఐఏ మరింత లోతైన దర్యాప్తు జరిగితే.. ఆయనకు ఆస్పత్రిలో అందిన చికిత్స, కోడికత్తి, ఆయన గాయం లోతెంత? నాడు విశాఖలో కోడికత్తి దాడి జరిగిన సమయంలో సీసీ కెమేరాలు ఎందుకు పని చేయలేదు. అంతర్జాతీయ విమానాశ్రయంలో నిఘా వైఫల్యం వెనుక శక్తులేమిటి? వంటి వివరాలపై దృష్టి పెట్టాలి. ఇక పోతే.. బాధితుడిగా జగన్ రెడ్డి కోర్టుకు హాజరై వాంగ్మూలం ఇవ్వడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారన్నది ఇప్పటి వరకూ అంతుబట్టని విషయం.
అయితే జగర్ తీరు వల్ల ఈ కేసులో నిందితుడు జనుపల్లి శీను నాలుగున్నరేళ్లకు పైగా కనీసం బెయిలుకు కూడా నోచుకోకుండా జైల్లోనే మగ్గుతున్నాడు. ఈ కేసులో దర్యాప్తు చేయడానికి ఇంక ఏమీ లేదని ఇప్పటికే ఎన్ఐఏ విస్పష్టంగా తేల్చేసింది. ఇప్పుడు జగన్ హైకోర్టులో మరింత లోతైన దర్యాప్తు అంటే ఇంకా ఏం చేయాలని జగన్ రెడ్డి భావిస్తున్నారని న్యాయ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వివేకా హత్య కేసులో దర్యాప్తు ఏ కోణంలో జరగాలో సీబీఐకి మీడియా సమావేశాలు పెట్టి మరీ అవినాష్ వివరించిన విధంగా జగన్ రెడ్డి కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి దర్యాప్తు ఎలా చేయాలో ఎన్ఐఏకి నిర్దేశించాలని భావిస్తున్నారా అని ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద న్యాయవ్యవస్థతో జగన్ రెడ్డి ప్రమాదకరమైన క్రీడ ఆడుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కోర్టులను ఆశ్రయిం చడానికి ఉన్న అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవడాన్ని ఎవరూ తప్పుపట్టరు కానీ, సీఎంను కనుక వీలుపడదు అంటూ హాజరును తప్పించుకుంటూ, వాయిదాల మీద వాయిదాలు కొరడాన్ని ఆక్షేపిస్తున్నారు. అక్రమాస్తుల కేసుల్లో దశాబ్దకాలంగా తాను బెయిలుపైనే ఉంటూ కూడా కోడికత్తి కేసులో నిందితుడికి అర్ధ దశాబ్దంగా బెయిలు అవకాశం లేకుండా వ్యవహరించడం దుర్మార్గం కాక మరేమిటని అంటున్నారు.