జగన్ హామీల్లో అమలైనవి పది శాతం కూడా లేవుగా.. 99శాతం అంటారేం?!
posted on Oct 13, 2023 @ 6:02PM
తాజాగా విజయవాడలో జరిగిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో సాక్షాత్తు సీఎం జగన్ మోహన్ రెడ్డే 99 శాతం హామీలను అమలు చేశామని.. ఇదే విషయాన్ని ప్రజలకు చెప్పాలని ఆదేశించారు. ఇక ఇదే విషయంలో వైసీపీ నేతల ప్రకటనలు అన్నీ ఇన్నీ కావు. ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పేటెంట్ హక్కు కేవలం సీఎం జగన్ కి మాత్రమే ఉందని వైసీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ పూనూరి గౌతమ్ రెడ్డి గతంలో ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు. వైసీపీ నేతలు ఎంత గుడ్డిగా జగన్ మాయలో ఉన్నారో ఇలాంటి ప్రకటనలు చూస్తే తెలిసిపోతుంది. మాట తప్పడు మడమ తిప్పడు అంటూ గతంలో ప్రచారం చేసిన వైసీపీ నేతలు.. ఇప్పుడు ఆ మాటను పక్కన పెట్టేశారు. రాజధాని మార్పు, శాసన మండలి రద్దు లాంటి అంశాల తర్వాత జగన్ మాట తప్పడు అంటే ప్రజలు నవ్వుతున్నారని వైసీపీ నేతలు గ్రహించి ఆ నినాదాన్ని పక్కన పెట్టేశారు. కానీ ఇప్పుడు ఎన్నికల సమయం కావడంతో 99 శాతం హామీల అమలు అనే నినాదాన్ని అందుకున్నారు.
అయితే ప్రతిపక్ష పార్టీలు, జనం మాత్రం జగన్ ప్రభుత్వం అమలు చేసింది కేవలం పది శాతం మాత్రమేనని కౌంటర్లు వేస్తున్నారు. గత ఎన్నికల సమయంలో అధికారంలోకి రావడం ఒక్కటే లక్ష్యంగా పాదయాత్రలో ఆగిన ప్రతిచోటా ఒక హామీని ఇచ్చుకుంటూ వెళ్లారు. అలా తన పాదయాత్ర నుండి ఎన్నికల సమయంలో సభల వరకూ మొత్తం జగన్ 650కి పైగా హామీలను ఇచ్చినట్లు పరిశీలకులు లెక్కతేల్చారు. అందులో చిన్నా చితకా ఏమైనా ఉండనీ కానీ.. జగన్ ఇచ్చిన హామీలను చూస్తే గుండె గుభేల్ అనాల్సిందే. ఇక హామీల అమలు విషయానికి వస్తే ఆయన ఇచ్చిన 650కి పైగా హామీలలో కేవలం పది శాతం మాత్రమే, అంటే 65 నుండి 100 లోపు మాత్రమే ఏదో మేరకు అమలుకు నోచుకున్నాయని ఉదాహరణలు, గణాంకాలతో సహా చెబుతున్నారు. జగన్ తన నోటి నుండి చెప్పి మరచిన వాటిని ఆధారాలతో సహా బయట పెడుతూ ఇది హామీ కాదా అంటూ ప్రశ్నిస్తున్నారు. వైసీపీ చెప్పుకుంటున్న ఆ 99 శాతం హామీలు ఏంటి అనేది ప్రజలకు వివరించాలని డిమాండ్ చేస్తున్నారు.
జగన్ గత ఎన్నికల సమయంలో చెప్పిన వాటిలో ప్రధానమైనవి సీపీఎస్ రద్దు, మద్యనిషేధం, జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ, 45 ఏళ్లకు పెన్షన్..అలా చెప్పుకుంటూపొతే కొండవీటి చాంతాడంత లిస్ట్ కనిపిస్తుంది. రాష్ట్రంలో మద్యం అంటే స్టార్ హోటళ్లలో దొరికే వస్తువుగా పరిమితం చేస్తానని, ఆ తర్వాతనే ఓట్లు అడుగుతామని ఘనంగా ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆ ఊసే లేకపోగా మద్యం ఆదాయాన్ని కూడా వచ్చే పాతికేళ్ల పాటు తాకట్టు పెట్టి మరీ అప్పు తెచ్చారు. ఇక మెగా డీఎస్సీ, ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ సంగతి ఎంత చెప్పుకున్నా దండగే. ఉద్యోగమంటే వాలంటీర్, సచివాలయాలనే చూపిస్తున్నారు.
మరో కీలకమైన హామీ సీపీఎస్ రద్దు. దీని గురించి వెళ్లిన ప్రతి చోటా చెప్పిన జగన్.. ఇప్పుడు డొంక తిరుగుడు సమాధానాలు చెపున్నారు. సీపీఎస్ రద్దు చేస్తే అప్పులు దొరకవని ఈ హామీని అటకెక్కించారు. 45 ఏళ్ళు దాటిన వాళ్ళు ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి రూ.3 వేలు పెన్షన్ అన్నారు. కానీ, రియాలిటీలో 63 దాటిన వాళ్ళకే సవాలక్ష కొర్రీలు పెట్టి ఇంట్లో ఒకరికే ఇస్తున్నారు. అదీ ఇప్పటికీ చెప్పిన రూ.3 వేలు కాలేదు. ఇలా, జగన్ మ్యానిఫెస్టోలో పెట్టి, బహిరంగ సభలలో ఇచ్చిన హామీలే వందలలో ఉండగా.. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి, ఏ జిల్లాకి ఆ జిల్లాలో జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలు ఇంకా వేలల్లో ఉన్నాయి. ఈ హామీలతో పాటు గత ప్రభుత్వాలు తెచ్చిన ఫీజ్ రీఎంబర్స్ మెంట్, ఆరోగ్య శ్రీ, పావలా వడ్డీ రుణాలు, వ్యవసాయ ప్రోత్సాహకాలు లాంటి ఉపయోగకరమైన పథకాలకు నిధులు లేకుండా చేసి వాటిని నీరుగార్చేశారు. మరి ఇవన్నీ ప్రజలు మర్చిపోయి వాళ్ళు ఏం చెప్పినా నమ్మేస్తారులే అనుకున్నారో ఏమో కానీ వైసీపీ నేతలు ఇష్టారాజ్యంగా అబద్దాల ప్రచారాన్ని మొదలు పెట్టారు.