వలంటీర్లను వంచించింది జగనే.. తేల్చి చెప్పిన పవన్

ఆంధ్రప్రదేశ్ లో వలంటీర్ల వ్యవస్థ జగన్ కోసం జగన్ చేత జగనే సృష్టించుకున్న వ్యవస్థ. అలాంటి వ్యవస్థను జగన్ గాలి కొదిలేశారు. తన కోసం పని చేయడం తప్ప వలంటీర్లకు ఉద్యోగ భద్రత అన్నది లేకుండా చేశారు.   వైసీపీ హయాంలో అమలులోకి వచ్చిన ఈ వలంటీర్ల వ్యవస్థ గ్రామాలు, పట్టణాల్లో సంక్షేమ పథకాల అమలులో జగన్ హయాంలో కీలక భూమిక పోషించింది. చెప్పాలి.  ఈ కారణంగా తాము అధికారంలోకి వచ్చినా కూడా వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని   ఎన్నికలకు ముందు  తెలుగుదేశం అధినేత, ప్రస్తుత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన మాట వాస్తవమే. అంతే కాకుండా   వలంటీర్లకు అప్పటి వరకూ ఇస్తున్న ఐదు వేల రూపాయల వేతనాన్ని పది వేలు చేస్తానని కూడా వాగ్దానం చేశారు. ఇదీ వాస్తవమే.

ఇచ్చిన హామీని నిలబెట్టుకునే ఉద్దేశంతో చంద్రబాబు తన వంతు ప్రయత్నం చేశారు. అధాకారంలోకి వచ్చిన తరువాత జరిగిన తొలి క్యాబినెట్ లోనే వలంటీర్ల వ్యవస్థపై చర్చించారు. ఇదే విషయాన్ని అడవి తల్లి బాటలో భాగంగా సోమ, మంగళవారాల్లో (ఏప్రిల్ 7, 8) తేదీల్లో అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటన సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చెప్పారు. అయితే ఏ కరంగానూ వాలంటీర్ వ్యవస్థను కొనసాగించలేని పరిస్థితిని జగన్ సృష్టించారని పవన్ కల్యాణ్ వెల్లడించారు.  వలంటీర్లను వంచించింది, ఆ వ్యవస్థ మనుగడ లేకుండా చేసిందీ జగన్ సర్కారేనని కుండబద్దలు కొట్టారు.  

వలంటీర్లను నియమించుకున్న వైసీపీ ప్రభుత్వం వారితో పనిచేయించుకుందే గానీ, వారి భవిష్యత్తు గురించి, ఉద్యోగ భద్రత గురించి పట్టించుకోలేదన్నారు. వలంటీర్ వ్యవస్థకు జగన్ సర్కార్ అధికారిక ముద్ర వేయలేదన్నారు.   ప్రస్తుతం ప్రభుత్వంలోని ఏ ఒక్క శాఖ వద్ద కూడా వలంటీర్ వ్యవస్థ గురించి ఒక్కటంటే ఒక్క పత్రం కూడా లేదన్నారు. అసలు వలంటీర్లకు వేతనాలను కూడా వైసీపీ సర్కారు ప్రభుత్వం ద్వారా ఇవ్వలేదని ఆయన వెల్లడించారు. వలంటీర్లకు ఏ విధంగానూ కూడా ప్రభుత్వంతో సంబంధం లేకుండా జగన్ సర్కార్ చేసిందన్నారు.అసలు వాలంటీర్లకు ఉద్యోగాలు ఇస్తున్నట్లుగా జగన్ సర్కార్ జీవో కూడా జారీ చేయలేదనీ, అయినా కూడా వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులేనన్న భ్రమల్లో వారిని ఉంచిందని పవన్ కల్యాణ్ చెప్పారు. వలంటీర్లను ప్రభుత్వం వంచించిందనీ, ఇప్పుడు తమ కూటమి ప్రభుత్వం వలంటీర్ వ్యవస్థను కొనసాగిద్దామన్నా కొనసాగించలేని పరిస్థతి ఉందనీ చెప్పారు.  

Teluguone gnews banner