బటన్ నొక్కుడుకు ఇక ఫుల్ స్టాపే!?
posted on Feb 15, 2023 @ 11:02AM
జగన్ విశ్వాసం, జగన్ ను నమ్ముకున్న వాళ్ల విశ్వాసం ఒక్కటే.. బటన్ నొక్కుడు కొనసాగినంత కాలం అధికారానికి ఢోకా లేదు. ప్రజలు ఎంతగా వ్యతిరేకించినా, ఆందోళనలతో రాష్ట్రం ఉడుకెత్తిపోయినా, ఏం ఫరక్ పడదు.. బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలలో సొమ్ము పడుతున్నంత కాలం ఓట్లెక్కడికీ పోవు. గడపగడపకూ కార్యక్రమంలో ఎమ్మెల్యేలకు పరాభవాలు ఎదురైనా.. స్వయంగా ముఖ్యమంత్రి సభల నుంచే జనం పారిపోయినా.. మంత్రుల సభలకు ప్రజలు మొహం చాటేసినా భయ పడాల్సిన పని లేదు. విపక్షాల సభలకు జనం పోటెత్తి జయజయధ్వనాలు ఆందోళన వద్దు.. ఓట్లూ మనవే, అధికారమూ మనదే.. ఇంత కాలం వైసీపీలో కనిపించిన ధీమా ఇదే.
ఔను జగన్ బటన్ లు నొక్కడమే వైసీపీలో ఓటమి భయం లేకుండా ధీమా కనిపించడానికి కారణం. అయితే ఇప్పుడా ధీమా లేకుండా పోయింది. ఇక జగన్ బటన్ నొక్కుదామన్నా నొక్కలేని పరిస్థితి వచ్చేసింది. ఖజానాలో సొమ్ములు నిండుకున్నాయి. అప్పులు పట్టే మార్గాలన్నీ మూసుకుపోయాయి. ఇకపై రోజు గడవడమే ప్రభుత్వానికి గగనం అన్న పరిస్థితి వచ్చేసింది. ఉద్యోగుల జీతాలకే దిక్కు దివాణం లేని ఆర్థిక అధోగతికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చేరుకుంది. ఇంత కాలం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో జనం ఛీత్కారాలు చేస్తున్నా ఎమ్మెల్యేలు భరించి ఏదో విధంగా ఆ కార్యక్రమాన్ని మమ అనిపించేందుకు ప్రయత్నమేనా చేసే వారు. ఎందుకంటే జగన్ బటన్ నొక్కుతున్నారు కనుక ఈ ఛీత్కారాలు ఓట్లపై పెద్దగా ప్రభావం చూపవని ఏమూలో ఒకింత ఆశ ఉండేది వారిలో.
ఇప్పుడా ఆశా అడుగంటి పోయింది. ఆర్థిక క్రమశిక్షణా రాహిత్యం కారణంగా నిధులు నిండుకుని, అప్పులుపుట్టని పరిస్థితి ఏర్పడి జగన్ బటన్ నొక్కుడు కార్యక్రమం ఇంచుమించుగా ఆగిపోయింది. అందుకే జగన్ లో కూడా ధీమా కనిపించడం లేదు. గతంలో మీరు జనంలో తిరగండి.. నేను బటన్లు నొక్కి జనాల ఖాతాలలో సొమ్ము జమ చేస్తా.. విజయానికి ఢోకా ఉండదు.. మామూలు విజయం కాదు.. 175కు 175 అసెంబ్లీ స్థానాలలోనూ మనమే గెలుస్తాం అని ధీమాగా చెప్పే వారు. కానీ ఆయనకు ఇప్పుడా ఆస్కారం లేకుండా పోయింది. ఆయనే స్వయంగా విడుదల చేసిన క్యాలండర్ ప్రకారం బటన్ నొక్కడానికి అవకాశం లేని పరిస్థితిని ఇప్పుడాయన ఎదుర్కొంటున్నారు. అందుకే ఎప్పటికప్పుడు ఆ కార్యక్రమాన్ని వాయిదాలు వేసుకుంటూ పోతున్నారు.
ఉదాహరణకు ఆసరా పథకాన్నే తీసుకుంటే.. రమారమి కోటి మంది డ్వాక్రా మహిళలకు రుణమాఫీ ఇప్పుడు అతీగతీ లేకుండా పోయింది. ఈ పథకం కింద నాలుగేళ్లపాటు రూ. 12500 బటన్ నొక్కుడు ద్వారా అందజేస్తామని సీఎం జగన్ చెప్పారు. సంక్షేమ క్యాలెండ్‌లో ఆసరా పథకం కింద డ్వాక్రా మహిళల ఖాతాలలో జనవరిలో సొమ్ములు జమ కావాల్సి ఉంది. అయితే ఫిబ్రవరి నెల సగం గడిచిపోయినా ఇంకా జగన్ బటన్ నొక్కి ఆసరా పథకం లబ్థిదారులకు సొమ్ములు జమ చేయలేదు. అంతకంటే ముందు డిసెంబర్‌లో ఈబీసీ నేస్తం, లా నేస్తం పథకాలకు బటన్లు నొక్కాలి. వాటి సంగతి అతీగతీ లేదు. ఇక ఇప్పుడు ఇక ఫిబ్రవరి నెలలో విద్యా దీవెన పథకానికి బటన్ నొక్కాలి. దానిపైనా జగన్ సర్కార్ కిమ్మనడం లేదు. పథకాల సంగతి పక్కన పెడితే జీతాలు, పెన్షన్లకే జగన్ సర్కార్ లాటరీ కొట్టాల్సిన పరిస్థితి.
అదనపు రుణాల కోసం ఢిల్లీలో చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్న సూచనలు కనిపించడం లేదు. దీంతో మార్చి నెల వస్తేం ఏం చేయాలన్న విషయంలో ప్రభుత్వం అయోమయం నెలకొంది. ఈ నేపథ్యంలోనే పార్టీ నాయకుల్లోనూ, శ్రేణుల్లోనూ కూడా జగన్ పై విశ్వాసం సన్నగిల్లింది, భవిష్యత్ పై భరోసా కరవైంది. అందుకే పార్టీలో గతంలో ఎన్నడూ లేని విధంగా అసమ్మతి స్వరాలు పెరుగుతున్నాయి. తీవ్రమౌతున్నాయి అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.