కాంగ్రెస్ హస్తరేఖల్లో జగన్ జాతకం!

 

తన బెయిలాశలన్నీ ఒకటొకటిగా అడియాసలవుతుంటే, క్రమంగా చంచల్ గూడా జైల్లో స్థిరపడిపోయిన జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు నవ్వాలో బాధపడాలో తెలియని పరిస్తితి నెలకొంది. ఒక వైపు జైలునుండి బయటపడలేని దీనస్థితి. మరోవైపు తనపార్టీలోకి జేరెందుకు జైల్లోకి బారులు తీరి వస్తున్న రాజకీయనాయకులూ! తానూ జైల్లోఉన్నపటికీ అంతగా ప్రభావం చూపగలుగుతున్నందుకు సంతోషించాలా? లేక జైలే తన కార్యాలయం అయిపొయినందుకు బాధపడాలా అతను? మొత్తంమీద అతనిప్పుడు ఒక త్రిశంకు స్వర్గంలో వ్రేలాడుతున్నాడు.

 

ఇక, ఎన్నికలు ముంచుకొస్తున్న ఈ కీలకతరుణంలో, ఈ విధంగా నిస్సహాయంగా జైలుగోడల మద్యన ఇర్రుకుపోవడం మరో దురదృష్టమేనని చెప్పాలి. ఎప్పటికయినా, తను బయటకి వస్తాడా? లేక కలకాలం సి.బి.ఐ. కేసులతో నలిగిపోతూ చంచల్ గూడా జైలులోనే భారంగా బ్రతకలా?రేపు ఎన్నికలు వచ్చేనాటికయినా తానూ బయట పడకపోతే పార్టీకి దిక్కెవరు?పార్టీలోకి వస్తున్న లేదా ఇప్పటికే వచ్చినవారిని నిలుపుకోనేదేలా?తానూ జైల్లో ఉంటే తనపార్టీ ఇంతే పటిష్టంగా ఉంటూ రేపు ఎన్నికలని దైర్యంగా ఎదుర్కొనగలదా? లేక ఒకప్పుడు ప్రజారాజ్యం లాగానే కుప్పకూలిపోయి చివరకి ఆ కాంగ్రెసులోనే కలిసిపోక తప్పదా? జైల్లో ఉండి తానూ పార్టీని గెలిపించుకొని ఆ పార్టీ అండతోనే జైల్లోంచి బయట పడతాడా? లేక తన తల్లీ చెల్లీ ప్రజలకి చెపుతున్న విదంగా తానూ నిర్దోషిగా జైలునుండి విముక్తుడయి హుందాగా ఎన్నికలలో పాల్గొని రాజ్యదికారం హస్తగతం చేసుకొంటాడా? కాంగ్రెస్ అతనిని మళ్ళీ పార్టీలోకి స్వాగతించి కేసులనీ రద్దు చేసేసి, ముఖ్యమంత్రిగా అతనికి పట్టంకడుతుందా లేక అతనిపై మరిన్ని కేసులు నడిపించి శేషజీవితం జైల్లోనే గడిపేలా చేస్తుందా? సమాధానం దొరకని ఇటువంటి బేతాళ ప్రశ్నలు ఎన్నెనో జగన్ మనసుని దోలిచేస్తూ ఉండవచ్చును. బహుశః ఇటువంటి జీవితాన్ని కలలో కూడా అతను ఊహించి ఉండడు.

 

అతని జాతకం అతని బవిష్యత్ గురించి  ఏమి చెపుతోందో తెలుసుకోవాలంటే చూడవలసింది అతని హస్త రేఖలు మాత్రం కాదు. కాంగ్రెస్ ‘హస్తరేఖలు’ అతని జాతకం వివరించబోతున్నాయి. సమస్యలన్నిటికీ ఒకటే పరిష్కారంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికే బలహీనంగా ఉన్న కాంగ్రేసు పార్టీ మున్ముందు మరింత బలహీన పడితే తప్ప అతనికి స్వేచ్చ లబించే అవకాశం లేకపోవచ్చు. ఒక వేళ, కాంగ్రెస్ మరింత బలహీనపడినప్పుడు, అది సహజంగా జగన్ వంటి ఆకర్షణగల నాయకుడికోసం తన ద్వారాలు తెరవకతప్పదు. రానున్న ఎన్నికలలో బలంగా ఉన్న తె.రా.స.ను డ్డీ కొనడం, మంచి కార్యకర్తల బలం కలిగి రాబోయే ఎన్నికలలో చావో రేవో తెల్చుకోబోయే తే.దే.ప.ఇచ్చే గట్టి పోటీని తట్టుకోవడం, పార్టీలో అంతర్గతకుమ్ములాటలకు ముక్కుతాడు వేయడం వంటి క్లిష్టమయిన సవాళ్లు ముందున్న కాంగ్రెస్ పార్టీ, వాటిని దైర్యంగా అదిగమించగలనని భావిస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డికి విముక్తి ఉండకపోవచ్చును. ఒకవేళ, కాంగ్రేసు పార్టీ బలంగా ఉంటే ఆ తరుణంలో జగన్ వంటిబలవంతుడయిన, ప్రభావంతుడయిన విరోదిని కోరుండి అది జైలు నుంచి బయటకి రానిచ్చి కొరివితో తల ఎందుకు గోక్కోవాలని ఎందుకు ఆలోచిస్తుంది? గనుక, వీలయితే అతనిని మరిన్ని కేసులలో ఇరికించి కనీసం ఎన్నికలయ్యేవరకయినా, తన విజయానికి అడ్డుగోడగా నిలువగల అతనిని జైలుగోడలకే పరిమితం చేయవచ్చును. అందువల్ల, కాంగ్రెస్ మరింత బలహీనపడితే తప్ప జగన్కి జైలు విముక్తి లంబించకపోవచ్చును. కాంగ్రేసుకి కష్టం అనుకొంటే మాత్రం అతను రేపు ‘తల్లి కాంగ్రేసు’ ఒడిలో ఒదిగిపోయి మనకి కనిపించినా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. అంటే, జగన్ ఇప్పుడు కోర్టుతీర్పులకన్నా కాంగ్రెస్ బలహీన పడటం కోసమే చకోర పక్షిలా ఎదురు చూపులు చూస్తూ చంచల్ గూడా జైల్లో వేచి ఉండక తప్పదు.