ఫస్ట్రేషన్ పీక్స్.. సీఎం నోట బూతుల పంచాంగం!
posted on Jul 22, 2023 7:33AM
ప్రజలలో వ్యతిరేకత తెలిసి ఫ్రస్టేషన్ ఫీలవుతున్నారో.. లేక ఇప్పుడు రాజకీయం అంటే ఇదే అనుకుంటున్నారో కానీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ మధ్య కాలంలో తన స్థాయి మరచి ప్రత్యర్థులపై మాటల దాడి చేస్తున్నారు. గత నాలుగేళ్లలో వైసీపీ కోటరీలో కొడాలి నానీ, రోజా లాంటి వాళ్ళు చేసే వ్యాఖ్యలు ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నోటి వెంట వస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళు సైలెంట్ అయ్యారని ప్రత్యక్షంగా జగనే రంగంలోకి దిగినట్లు అనిపిస్తుంది. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండి ప్రత్యర్థులపై అమ్మాయిలు, పెళ్లిళ్లు, కాపురాలు, కడుపులు, దౌర్భాగ్యులు, నీచులు వంటి వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే రాజకీయాలు ఈ స్థాయిలో దిగజారిపోయాయా అనిపిస్తుంది.
గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనను ఇంటర్వ్యూ చేసిన ఒక విలేఖరి తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీరామారావు గురించిన ప్రస్తావన చేస్తూ ఏకవచనంలో మాట్లాడారు. వెంటనే కాసు బ్రహ్మానందరెడ్డి ఆ విలేకరిని తీవ్రంగా మందలించారు. అలాగే తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు, మాజీ సీఎం దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డీ కూడా రాజకీయ ప్రత్యర్థులైనా పరస్పరం గౌరవం ఇచ్చి పుచ్చుకునే వారు. రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలూ తప్ప వ్యక్తిత్వ హననానికి పాల్పడే మాటలు వారి నోటి నుంచి మచ్చుకైనా ఎన్నడూ రాలేదు. అయితే జగన్ అటువంటి రాజకీయ విలువలు, సంస్కారానికి తిలోదకాలిచ్చేశారా అన్నట్లుగా ఆయన మాటలు, ప్రసంగాలు ఉంటున్నాయి. ఇక విషయానికి వస్తే..
ఒక ప్రభుత్వ కార్యక్రమానికి వచ్చిన సీఎం.. ఆయన చేసిన అభివృద్ధి, సంక్షేమంపై మాట్లాడతారని ఎవరైనా భావిస్తారు. తన కార్యకలాపాలకు ప్రత్యర్ధులు అడ్డు వస్తున్నారని ఆధారాలతో సహా ప్రజల ముందు పెట్టడం సహజం. కానీ జగన్ మోహన్ రెడ్డి మాత్రం కార్యక్రమం ఏదైనా.. ఎదుట ఎవరు ఉన్నా తన స్థాయిని తానే తగ్గించేసుకునేలా అనుచిత వ్యాఖ్యలకు దిగుతున్నారు.
వెంకటగిరిలో సీఎం జగన్ ‘వైఎస్‌ఆర్ నేతన్న హస్తం’ పథకం కింద ఆర్థికసాయాన్ని విడుదల చేశారు. ఈ సభలో మాట్లాడిన జగన్.. వాలంటీర్లపై కొందరు తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని ఫైరయ్యారు. వాలంటీర్లపై తప్పుడు వ్యాఖ్యలకు నిర్మాత చంద్రబాబే అని.. పదేళ్లుగా చంద్రబాబుకు ప్యాకేజీ స్టార్ వాలంటీర్ గా పనిచేస్తున్నారని విమర్శించారు. అంతేకాదు, క్యారెక్టర్ లేని వాళ్లంతా వాలంటీర్ల గురించి మాట్లాడతారా అని ధ్వజమెత్తారు. వాలంటీర్లపై తప్పుడు వ్యాఖ్యలకు నిర్మాత చంద్రబాబేనని.. నటన, మాటలు మాత్రమే దత్తపుత్రుడివని వ్యాఖ్యానించారు. అక్కడితో ఆగకుండా ఆయన శృతి మించారు.
దత్తపుత్రుడికి అమ్మాయిలను లోబర్చుకుని పెళ్లి చేసుకోవడం, నాలుగేళ్లు కాపురం చేయడం.. వదిలేయడం చేస్తాడని.. మళ్లీ ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం మళ్లీ వదిలేయడం అలవాటన్నారు. 10 మంది అమ్మాయిలతో స్విమ్మింగ్‌పూల్‌లో డ్యాన్స్ చేస్తూ మందుతాగుతూ మరొకరు ఉంటారని అన్నారు. ఇది లోకేష్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యగా కనిపిస్తుంది. అంతటితో ఆగని జగన్.. అమ్మాయి కనపడితే ముద్దయినా పెట్టాలి లేదా కడుపైనా చేయాలని ఇంకో దౌర్భాగ్యుడు అంటాడని నందమూరి బాలకృష్ణపై సెటైర్లు వేశారు. ఇక, 75 ఏళ్ల వయసొచ్చినా చంద్రబాబుకి సిగ్గులేదని, బావమరిది నువ్వు సినిమాల్లోనే చేశావు, నేను నిజ జీవితంలో చేశానంటూ చేసిన వెధవ పనుల్ని గొప్పగా చెప్పుకునే ముసలాయన అని చంద్రబాబునాయుడిపై కూడా వ్యాఖ్యలు చేశారు.
జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఒక సీఎం మాట్లాడాల్సిన మాటలు ఇవేనా అంటూ నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. పక్క రాష్ట్రమైన తెలంగాణ సీఎం, మంత్రులను చూసైనా వైసీపీ నేతలు బుద్ది తెచ్చుకోవాలని నెటిజన్లు సలహాలు ఇస్తున్నారు. మరికొందరైతే రానున్న ఎన్నికలలో ఫలితాలేంటో జగన్ మోహన్ రెడ్డికి తెలిసిపోయిందని.. అందుకే ఫ్రస్టేషన్ లో బూతులు లంకించుకుంటున్నారని సెటైర్లు వేస్తున్నారు. ఇక జనసేన కార్యకర్తలైతే జగన్ తాత, ముత్తాల దగ్గర నుండి రెండు పెళ్లిళ్లు చేసుకున్న వాళ్ళ జాబితా అంతా బయటపెట్టి మరీ విమర్శిస్తున్నారు. టీడీపీ నేతలైతే జగన్ వ్యాఖ్యలను మతి స్థిమితం లేని వ్యాఖ్యలుగా కొట్టి పారేస్తున్నారు. జగన్ బూతుల పంచాంగం ఎంతవరకూ వెళ్తుందో.. ఇంకెంత దిగజారుడు వ్యాఖ్యలు వినాల్సి వస్తుందో చూడాలి మరి.