గుజరాత్ బరిలో జడేజా భార్య.. ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించడానికి బీజేపీ పాట్లు
posted on Nov 11, 2022 9:04AM
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. యాంటీ ఇన్ కంబెన్సీ ఆ రాష్ట్రంలో బీజేపీకి పెను సవాల్ గా మారింది. దీంతో ఎన్నికలలో విజయంతో గట్టేక్కేదుకు బీజేపీ అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్నీ ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై భారీ కసరత్తు చేసింది. పాత ముఖాలకు చాలా వరకూ టికెట్ ఇవ్వకూడదన్న నిర్ణయానికి వచ్చింది.
కొత్త ముఖాలను బరిలోకి దింపడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేకతను ఏదో మేరకు తగ్గించుకోవాలని వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ఇందు కోసం వివిధ రంగాలలో పేరున్న, గుర్తింపు పొందిన వ్యక్తులకుటికెట్లు కేటాయించే దిశగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే బీజేపీ విడుదల చేసిన అభ్యర్థుల తొలి జాబితాలో పలువురు కొత్తవారే ఉన్నారు.సిట్టింగ్ ఎమ్మెల్యేలలో 38కి శూన్యహస్తం చూపింది. అంటే బీజేపీ వంద మంది అభ్యర్థులతో విడుదల చేసిన జాబితాలో 38 మంది ఇప్పటి వరకూ ఎన్నికల బరిలో నిలబడని వారే. బీజేపీ అభ్యర్థుల ఎంపికలో ఎంతగా కసరత్తు చేసిదో తెలుసుకోవాలంటే ఆ పార్టీ విడుదల చేసిన తొలి జాబితాలో ఉన్నకొత్తు ముఖాలను చూస్తే అర్ధమౌతుంది. క్రికెట్ లో తన ఆల్ రౌండ్ ప్రతిభతో ఎంతో మందికి అభిమాన క్రీడాకారుడిగా మారిన జడేజా భార్యను ఈ సారి బీజేపీ తన అభ్యర్థిగా ఎన్నికల రంగంలో దింపేందుకు నిర్ణయించింది.
జడేజా భార్య రావాబా జడేజాను నార్త్ జామ్ నగర్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగారంగంలోకి దింపుతోంది. అలాగే కాంగ్రెస్ గూటి నుంచి వచ్చి చేరిన పలువురికి బీజేపీ టికెట్లు ఇచ్చింది. ఇక రివాబా విషయానికి వస్తే 2016లో ఆమెకు జడేజాతో వివాహంజరిగింది. ఆమె మూడేళ్ల కిందటే బీజేపీ తీర్థంపుచ్చుకున్నారు.
అలాగే ఇటీవలే బీజేపీలో చేరిన హార్థిక్ పటేల్ కు కూడా బీజేపీ టికెట్ ఇచ్చింది.ఇప్పటికే ఐదు సార్లు వరుసగా అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించిన రాష్ట్రంలో అధికారంలో కొనసాగుతున్న బీజేపీ ఆరో సారి గెలిచి.. అధికారం చేపట్టాలన్న పట్టుదలతో ఉంది. అయతే ఆప్ రంగంలో ఉండటం, పంజాబ్ లాగే ఇక్కడ కూడా అధికార పగ్గాలను అందుకోగలమన్న ధీమాతో ఆ పార్టీ ఇప్పటికే జోరుగా ప్రచార రంగంలో ఉండటం బీజేపీని ఒకింత కలవర పరుస్తోంది. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి ఇటీవలే ఏర్పాటు చేసిన భారత్ రాష్ట్ర సమితి కూడా పలు స్థానాలలో అభ్యర్థులను నిలబెట్టాలని నిర్ణయించడమే కాకుండా.. గుజరాత్ లో తెలుగువారు అధికంగా ఉండే సూరత్ ప్రాంతంపై ప్రత్యేక గురి పెట్టింది.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేంత బలంగా లేకపోయినా.. ఆ పార్టీ ప్రభావాన్ని కూడా తక్కువ అంచనా వేయలేమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాహుల్ భారత్ జోడో యాత్రకు వస్తున్న అశేష జనస్పందన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలపై ఏదో ఒక మేరకు ప్రభావం చూపుతుందంటున్నారు. ఆ మేరకు బీజేపీకి భారీ నష్టం వాటిల్లే అవకాశాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు.