రింగింగ్ బెల్స్ కు మోగిన ఐటీ బెల్స్
posted on Feb 21, 2016 @ 2:54PM
అతి తక్కువ ధర గల ఫోన్ అని చెప్పి గత కొద్దిరోజులుగా వివాదాల్లో నలుగుతున్న కంపెనీ రింగింగ్ బెల్స్. ఫ్రీడం 251 పేరుతో 251 రూపాయలకే స్మార్ట్ ఫోన్ ను ఇస్తున్నామని ఈ కంపెనీ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఐటీ, ఎక్సైజ్ శాఖల అధికారులు ఈ కంపెనీపై దృష్టి సారించారు. ఇంత తక్కువ ధరకు ఫోన్ ను తయారుచేయడం అసాధ్యమని, ఒకవేళ తయారుచేస్తే కంపెనీకి ఎలాంటి లాభం ఉండదంటూ బిజెపీ ఎంపీ కిరీట్ సోమయ్య కేంద్రానికి లేఖ రాశారు.
ఆయన లేఖకు స్పందనగా రింగింగ్ బెల్స్ కంపెనీ పై విచారణ చేయాలని టెలికాం శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ ఆదేశించారు. మరో వైపు కేవలం మార్గదర్శకాలు సూచించడం కోసమే ఐటీ శాఖ వచ్చిందని కంపెనీ ప్రెసిడెంట్ అశోక్ చద్ధా చెబుతున్నారు. ఫోన్ కు బుకింగ్స్ భారీగా రావడంతో, కంపెనీ శనివారం నుంచి బుక్సింగ్ ను నిలిపేసింది. తొలి రోజున 3.7 కోట్లు, రెండో రోజు 2.47 కోట్లు రిజిస్ట్రేషన్లు జరగడం విశేషం..